పర్యావరణ హితం కోసం... ఈ ప్రత్యూషం!

ABN , First Publish Date - 2020-09-30T06:12:50+05:30 IST

పర్యావరణ స్పృహ ఎంతో కొంత అందరికీ ఉంటుంది. అయితే ఆ ప్రవృత్తిని వృత్తిగా మలచుకోవాలనే తపన కలిగి ఉండేవారు ఎంతో అరుదు. అలాంటి తన అభిరుచికి అంచెలంచెలుగా అర్హతలు జోడించుకుంటూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది ప్రత్యూష పరకాల...

పర్యావరణ హితం కోసం...  ఈ ప్రత్యూషం!

పర్యావరణ స్పృహ ఎంతో కొంత అందరికీ ఉంటుంది. అయితే ఆ ప్రవృత్తిని వృత్తిగా మలచుకోవాలనే తపన కలిగి ఉండేవారు ఎంతో అరుదు. అలాంటి తన అభిరుచికి అంచెలంచెలుగా అర్హతలు జోడించుకుంటూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది ప్రత్యూష పరకాల. అంటార్కిటికా మంచు ఖండం మీద గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావాన్ని దగ్గర నుంచి చూసి వచ్చిన  ప్రత్యూష, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే ఉన్నత చదువు కోసం ప్రతిష్ఠాత్మకమైన షీవినింగ్‌ స్కాలర్‌షిప్‌ దక్కించుకుని ఇంగ్లండ్‌ చేరుకుంది. ఇంగ్లండ్‌ నుంచి నవ్యతో ఆమె పంచుకున్న విశేషాలు...



పర్యావరణ హితం కోసం పాటు పడేవారు ఎందరో. అయితే తోచిన విధంగా సాయపడడం కాకుండా, ఆ ప్రవృత్తికి విద్యార్హతలు జోడిస్తే అందే ఫలితం ఉన్నతంగా ఉంటుందని నమ్మే వ్యక్తిని నేను. అందుకే ఆ దిశగా ప్రయాణించడం మొదలుపెట్టాను. ఆ క్రమంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నాను. కార్పొరేట్‌ ఉద్యోగులు, కాలేజీ, స్కూలు విద్యార్థులకు పర్యావరణ మార్పు, సుస్థిర జీవనవిధానాలకు సంబంధించిన సెషన్లు నిర్వహించాను.


పర్యావరణ హితాన్ని ప్రోత్సహిస్తూ పలు ఎన్‌జీవోలతో కలిసి పని చేశాను. రేడియో జాకీగా శ్రోతలకు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంచాను. అయితే వీటన్నిటికంటే పర్యావరణ హితం పట్ల నా బాధ్యతను పెంచి, నా లక్ష్యాన్ని నిర్దేశించుకునేందుకు తోడ్పడింది నా అంటార్కిటికా ఎక్స్‌పెడిషన్‌్‌. అక్కడికి వెళ్లే అవకాశం దక్కడమే ఓ అదృష్టం. 


కరుగుతున్న ఖండం!

దేన్నైనా దగ్గర నుంచి చూస్తే, మనపై పడే ప్రభావం వేరు. అప్పటివరకూ వాతావరణ మార్పు గురించి చదివాను, విన్నాను. తోచింది చేశాను. కానీ అంటార్కికా మంచు ఖండంలో ఆ మార్పును ప్రత్యక్షంగా చూసిన తర్వాత పర్యావరణం హితం చేజిక్కే మార్గం ఏదో తెలిసింది. నాకున్న ఆసక్తిని చేతల్లో చూపించాలనే బలమైన కోరికను పెంచి, పర్యావరణ హితాన్ని వృత్తిపరమైన కోణంలో చూసేలా ఆ ప్రయాణం నాకు దిశానిర్దేశం చేసింది. ఆ పర్యటనలో మంచు ఖండం మీద తరిగిపోయే గ్లేసియర్‌ గుర్తులను బట్టి ఏడాదిలో ఎంత మంచు కరిగిపోతుందో అక్కడ నేను గమనించాను. పర్యావరణం మీద తరిగిపోతున్న సముద్రజీవుల ప్రభావం కూడా గ్రహించాను. అలాగే అక్కడకు వచ్చిన పర్యావరణ నిపుణుల ద్వారా మరెంతో లోతైన అంశాల గురించి అవగాహన ఏర్పడింది. అలా ఎంతో క్లిష్టమైన పరీక్షలు నెగ్గి, ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ అంటార్కిటికా ఎక్స్‌పెడిషన్‌లో క్లైమేట్‌ ఫోర్స్‌ అంబాసిడర్‌గా 2018లో మంచు ఖండానికి వెళ్లి వచ్చాను. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఎక్స్‌పెడిషన్‌కు ఎంపికైన మొట్ట మొదటి మహిళ నేనే! ఇది నా అదృష్టం.


దూరదృష్టి పెంచుకోవాలి!

కొవిడ్‌ మూలంగా మనకు ఒరిగిన ఒకే ఒక మేలు గ్లోబల్‌ వార్మింగ్‌ తగ్గడం. అయితే ఈ మార్పు పర్యావరణానికి మేలు చేసేదే అయినా, ఇదే స్థితి దీర్ఘకాలం పాటు కొనసాగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కానీ కొవిడ్‌ కారణంగా స్తంభించిన రవాణా వ్యవస్థలు, కర్మాగారాలు, పరిశ్రమల పనులు తిరిగి పుంజుకుంటే పరిస్థితి మళ్లీ మొదటికి రావడం ఖాయం. నష్టాల భర్తీ కోసం అవసరానికి మించి ఉత్పత్తులు తయారుచేయడం మొదలుపెడితే, పూర్వం కంటే కాలుష్యం పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ దిశగా ఆలోచించి, చేతనైనంతలో ప్రభుత్వాలు, ప్రజలు బాధ్యతతో నడుచుకుంటే కాలుష్యం పెరిగిపోకుండా చూసుకోవచ్చు.




కరుగుతున్న మంచు ముక్కలు!

అంటార్కిటికా ఖండంలో పగుళ్లు ఏర్పడి విడిపోతున్న రెండు భారీ మంచు ముక్కల గురించి, ఫలితంగా ముంచుకొచ్చే ముప్పు గురించిన వార్తలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. నిజానికి ఇదంతా ఎంతో నిశ్శబ్దంగా జరిగిపోతూ ఉంటుంది. అంటార్కిటికాలో మంచు కరగడం అంటే, అందరూ అనుకుంటున్నట్టు అది కళ్లకు కనిపించేలా జరగదు. మంచు కరగడం అనేది అడుగు నుంచి మొదలవుతుంది. భూమి వేడెక్కేకొద్దీ ఉపరితలం మీద ఉండే మట్టి, దాన్ని అంటుకుని ఉండే మంచు అర అంగుళం మేరకు కరుగుతాయి. దాంతో వాటి పైన ఉండే భారీ ఐస్‌బర్గ్‌ సముద్రంలోకి జారిపోతుంది. దాంతో మంచు నష్టం జరుగుతుంది, సముద్రమట్టం పెరుగుతుంది. ఇలా అంటార్కిటికా మంచు కరగడం మూలంగా రెండు విధాలైన నష్టం జరుగుతుంది. 




ఇంగ్లండ్‌లో ఎమ్మెస్సీ!  

పర్యావరణంలో జరిగే మార్పులను శాస్త్రీయంగా తెలుసుకుని, విజ్ఞానపరంగా అవగాహన ఏర్పరుచుకోవాలంటే దానికి సంబంధించిన విద్యను అభ్యసించాలి. అలాగే పర్యావరణ హితం పట్ల అవగాహనతో పాటు అభివృద్ధీ ఉండాలి. ఆ అభివృద్ధి సుస్థిరమైనదిగా ఉండాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేజిక్కించుకోగలం. అందుకు తోడ్పడే ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం దక్కించుకోవాలని పరితపించాను. ఇందుకోసం ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ యూనివర్శిటీని ఎంచుకుని, షీవినింగ్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాను. అలా ఎన్విరాన్‌మెంట్‌, డెవల్‌పమెంట్‌, పాలిటిక్స్‌ సబ్జెక్టులుగా ఎమ్మెస్సీ కోర్సుకు అర్హత సాధించాను. ఈ స్కాలర్‌షిప్‌ దక్కించుకోవడం క్లిష్టం. అప్పటికే ఎంచుకున్న రంగంలో లీడర్‌షిప్‌ లక్షణాలతో తమ వంతు కృషి చేసే వారికే ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి నాకున్న పూర్వ అనుభవం కారణంగా షీవినింగ్‌ స్కాలర్‌షిప్‌ దక్కించుకోగలిగాను. ఏడాది పాటు సాగే మాస్టర్స్‌ కోర్సు పూర్తయిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి, క్రియాశీలకంగా పర్యావరణ హితం కోసం పాటుపడాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాను.


ఇంటిల్లిపాదిదీ అదే దారి!

పర్యావరణం పట్ల ప్రేమ మా రక్తంలోనే ఉందేమో? మా ఇంట్లో అందరూ అదే దారిలో నడుస్తూ ఉంటారు. హైదరాబాద్‌లోని మా ఇంటి టెర్రస్‌ మీద అమ్మ దాదాపు రెండు వందల రకాల పూలు, కూరగాయ మొక్కలు పెంచితే, నాన్న రిటైర్మెంట్‌ తర్వాత చిలుకూరులో సేంద్రీయ పంటలు పండించే వ్యాపకం పెట్టుకున్నారు. ఇలా పర్యావరణం పట్ల వారికి ఉండే ఆపేక్ష నాకూ అబ్బింది. అలా నా ప్రయాణం కూడా పర్యావరణ హితం వైపే సాగింది.

- గోగుమళ్ల కవిత


Updated Date - 2020-09-30T06:12:50+05:30 IST