కీర్తన

ABN , First Publish Date - 2020-09-14T10:15:20+05:30 IST

కీర్తన

కీర్తన

ఈ రోజుని ఇట్లా

వదిలేయటానికి ఇష్టం లేదు

దీనిని పగలకోయాల్సిందే

లోన ఏమేమి దాచుకుందో

గతం నుంచి ఏమి తెచ్చుకుందో

కస్మలాన్ని తెచ్చుకుందో

రత్న కలశాన్ని గర్భీకరించుకుందో-

బాగా పెరిగి పెద్దదై మగ్గి

బంగారు రంగు కాంతులీనుతున్న 

       బొచ్చచేపలా-

స్వర్ణమీనాన్ని వర్తమానానికి

వరంగా ఈయతలచిందా ?

ప్రవహించి ప్రవహించి నదిలో

గతం మేట వేస్తే తీసినట్టు

నేటిని శోధించి శోధించి

         ఒక బంగారు కంకిని లాగాలి


అంతటా ముసురే

అంతటా చీకటే

అంతటా మృత్యు శీతల వాయు స్పర్శే-

వేడి కోసం,

నునివెచ్చని ప్రాణం కోసం-

ముందుకాళ్లతో

భూమిని తవ్వుతున్న

శునక మహారాజు ఎక్కడ?

నా చుట్టూ తిరుగుతాడు

నా లోపల తిరుగుతాడు,

పంకిలమంటని పక్షిలా

దైనందిన జీవితంలో

గిరికీలు కొట్టే లావణ్యం, నేర్పు-

చేతివేళ్ల గోళ్లు అరుగుతాయి

కాని కంటిచూపు పదునెక్కుతుంది

వీడు మనిషి కదా

అనంత జాగృతీభూత చిత్తుడు కదా

ఏదీ ఏం చేయలేదు

కొన్ని వేల సంవత్సరాల నుంచి

చెక్కుచెదరని ధైర్యసంపన్నుడు ఇతడే కదా

ఎవడాపగలడు వీణ్ణి-

       కించిత్‌ తొణికినట్టు-

కొద్దిగా చలించినట్టు కనపడ్డా

నిరంతర పురోగామి వీడు


కాలానికి సవాలు మనిషే

కాలాన్ని జయించేదీ ఒక్క మనిషే

మనుషుల ప్రపంచంలో

అనంతంగా మొగ్గతొడిగే వీరత్వమేదో

సదా జ్వలించే

       జల కిన్నెర ఏదో

అతని స్వభావమై

అతని స్వభావమై

విలుకాడొకడున్నాడు ఇతడిలో

ఆదిమ పురుషుడి దగ్గర నుంచి

అనంత పురుషుని దాకా

అప్రాణి కాని, సప్రాణి కాని

ఏమీ చేయలేవు

సర్వసృష్టి అతని వెంట రావాల్సిందే

ప్రవర్ధమానమౌతున్న

కేంద్ర బిందు పుష్పతుల్యుడు

సమస్త చరాచర ప్రపంచం

ప్రాణి అప్రాణి-

సమస్త సౌందర్యాలూ, వికృతాలూ

అతని వెంట రావాల్సిందే

అతనిలో లీనం కావాల్సిందే

అతణ్ణి అనుసరించాల్సిందే

సూర్యుణ్ణి ముఖం మీద

బొట్టుగా పెట్టుకున్న అతను శాశ్వతం

అతను చలన సౌందర్యం-

సమస్త విశ్వానికి అతడు ఆది, అంతం

వర్ధిల్లుతాడు

వర్ధిల్లుతాడు

అగ్నిలా తేజరిల్లుతాడు

అనంతంగా -


కె. శివారెడ్డి

95021 67764

Updated Date - 2020-09-14T10:15:20+05:30 IST