UP:కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రార్థిస్తున్నాను...

ABN , First Publish Date - 2021-09-13T14:21:59+05:30 IST

రాబోయే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తాను ప్రార్థిస్తున్నట్లు రాయబరేలీలోని హనుమాన్ దేవాలయం ప్రధాన పూజారి అనుప్ అవస్థి చెప్పారు....

UP:కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రార్థిస్తున్నాను...

ప్రియాంకగాంధీతో హనుమాన్ దేవాలయ పూజారి సంచలన వ్యాఖ్యలు

రాయ్‌బరేలీ(ఉత్తరప్రదేశ్): రాబోయే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తాను ప్రార్థిస్తున్నట్లు రాయబరేలీలోని హనుమాన్ దేవాలయం ప్రధాన పూజారి అనుప్ అవస్థి చెప్పారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రాయ్ బరేలీ సరిహద్దు చురువాలోని హనుమాన్ దేవాలయాన్ని సందర్శించినప్పుడు,ఆ దేవాలయ ప్రధాన పూజారి అనుప్ అవస్థి ఆమెకు ఈ విషయం చెప్పారు. 


‘‘నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్‌కు మీరు కావాలి. యూపీలో మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నేను హనుమంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన పూజారి అనుప్ అవస్థి ప్రియాంక గాంధీకి చెప్పారు.‘‘తదుపరి ముఖ్యమంత్రి లాగే ప్రధానమంత్రి మీ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తారని నేను ఆశిస్తున్నాను.’’ అని పూజారి పేర్కొన్నారు. గతంలో రామజన్మభూమి సమస్యను ప్రస్థావించి బీజేపీ యూపీలో అధికారాన్ని చేజిక్కించుకుంది.కానీ రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం తాను ప్రార్థిస్తున్నట్లు హనుమాన్ దేవాలయ పూజారి చెప్పడం సంచలనం రేపింది.


2004 లో యూపీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధానమంత్రి పదవిని తిరస్కరించినందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని అవస్థీ ప్రశంసించారు.ప్రియాంక గాంధీ ఆదివారం సాయంత్రం చురువాలోని హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు. ఆమె తల్లి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆలయంలో ప్రియాంక ప్రార్థనలు చేశారు. 2022 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సంసిద్ధతను సమీక్షించడానికి ప్రియాంక యూపీలో పర్యటిస్తున్నారు.ఇందిరాగాంధీ కాలం నుంచి గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్ బరేలీలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, వాటిలో రెండు కాంగ్రెస్, రెండు బీజేపీ, ఒకటి సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.



Updated Date - 2021-09-13T14:21:59+05:30 IST