మోసపూరిత పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా నిరసన

ABN , First Publish Date - 2022-01-27T05:24:28+05:30 IST

తమకు న్యాయపరమైన జీతాలు ఇవ్వాలని, 2018 జూలై నుంచి తమకు రావాల్సిన గ్రాట్యుటీ సౌకర్యాలు ఇవ్వాలని, 2022 నుంచి ఇచ్చిన గ్రాట్యుటీ తమకు వద్దంటూ పలువురు ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు.

మోసపూరిత పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా నిరసన
జొన్నవాడ కూడలిలో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు

బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 26: తమకు న్యాయపరమైన జీతాలు ఇవ్వాలని, 2018 జూలై నుంచి తమకు రావాల్సిన గ్రాట్యుటీ సౌకర్యాలు ఇవ్వాలని, 2022 నుంచి ఇచ్చిన గ్రాట్యుటీ తమకు వద్దంటూ పలువురు ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. బుధవారం బుచ్చిలోని జొన్నవాడ రోడ్డు సెంటర్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.   అధికసంఖ్యలో మహిళా ఉపాధ్యాయులతో సహా 100మందికి పైగా ఉపాధ్యాయులు మోసపూరిత పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీఆర్సీ సాధన జిల్లా కమిటీ సభ్యుడు వీవీ శేషులుమాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరించే 10ఏళ్ల ఒకసారి ఇచ్చే పీఆర్సీ తమకు వద్దని.. ఐదేళ్లకొకసారి ఇచ్చే పీఆర్సీ తమకు కావాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి పీఆర్సీ జీవోలను రద్దు చేసి వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్లు  పరిష్కరించకుంటే అనివార్యంగా 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. అలాగే సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని, ఔట్‌సోర్స్‌ వారికి జీతాలు పెంచే వరకు తామంతా పోరాడుతామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల నాయకులు, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు, ఔట్‌ సోర్స్‌ ఉద్యోగుల  నాయకులు పాల్గొన్నారు.  


కోవూరులో ప్రభుత్వోద్యోగుల నిరసన 

కోవూరు : రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ప్రభుత్వోద్యోగులు బుధవారం పట్టణంలో నిరసన చేపట్టారు. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో తాలూకాపీసు కూడలి నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీఆర్సీ సాధన సమితి కన్వీనర్‌ మురళీధరరావు మాట్లాడుతూ మెరుగైన పీఆర్సీ ప్రకటించాలన్నారు. ఇంటి అద్దె స్లాబులను యథాతథంగా అమలు చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ నాయకులు డేవిడ్‌ చినబాబు, ఖాజావలి, జల్ఫీకర్‌ ఆలీ, తిరుమలయ్య, కృష్ణారెడ్డి, శీనయ్య, శేఖర్‌బాబు, పెంచలయ్య, మణికంఠాచారి తదితరులు పాల్గొన్నారు.


అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం 

తోటపల్లిగూడూరు: గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మండల పీఆర్సీ సాధన సమితి సభ్యులు  అంబేద్కర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇంగిలేల బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇస్కపాలెం కూడలిలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్ధరాత్రి పీఆర్సీ జీవోలు ఇవ్వడాన్ని ఖండించారు. పాత పీఆర్సీ ముద్దు, పాత పీఆర్సీని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఫిట్మెంట్‌ ఇవ్వాలని, సీపీఎస్సీని రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.   కార్యక్రమంలో అవ్వారు శ్రీధర్‌బాబు, సుబ్బారెడ్డి, దయాకర్‌రెడ్డి, నూనె నారాయణ, హెచ్‌ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.  

 

Updated Date - 2022-01-27T05:24:28+05:30 IST