జీవోల రద్దు వరకు.. పీఆర్సీ పోరు

ABN , First Publish Date - 2022-01-24T06:02:49+05:30 IST

ఉద్యోగులకు తీవ్ర నష్టం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ 2022 జీవోలను రద్దుచేసే వరకు ఉద్యమిస్తామని పీఆర్సీ సాధన సమితి హెచ్చరించింది.

జీవోల రద్దు వరకు.. పీఆర్సీ పోరు
సమావేశంలో పాల్గొన్న వివిధ అసోసియేషన్ల నాయకులు, ఉద్యోగులు

రేపటి నుంచి ధర్నాలు, రిలే దీక్షలు, ర్యాలీలు

ఉద్యమ కార్యాచరణ విజయవంతం చేస్తామని ప్రతిన

చీకటి జీవోలతో ప్రతి ఉద్యోగికి అన్యాయమేనన్న నేతలు

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సంఘాల నాయకుల వెల్లడి


గుంటూరు, జనవరి 23: ఉద్యోగులకు తీవ్ర నష్టం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ 2022 జీవోలను రద్దుచేసే వరకు ఉద్యమిస్తామని పీఆర్సీ సాధన సమితి హెచ్చరించింది.  ఆదివారం ఎన్జీవో హోంలోని కల్యాణ మండపంలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఏపీ జేఏసీ చైర్మన్‌ ఘంటసాల శ్రీనివాసరావు ప్రసంగించారు. ఉద్యోగులకు భారీగా నష్టం వాటిల్లే విధంగా ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవోలకు వ్యతిరేకంగా మంగళవారం నుంచి జరగనున్న ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆందోళనల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఐక్యంగా పాల్గొనాలన్నారు. ఏపీ గవర్నమెంటు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సయ్యద్‌ చాంద్‌బాషా మాట్లాడుతూ చీకటి జీవోల ద్వారా ప్రతి ఉద్యోగికి అన్యాయం జరిగిందన్నారు. మంగళవారం స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్‌ వరకు ఉపాధ్యాయ, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 26న మధ్యాహ్నం ఎన్జీవో హోం నుంచి లాడ్జి సెంటరు వరకు ర్యాలీ నిర్వహించి బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇస్తామన్నారు. 27 నుంచి 30 వరకు రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు సహాయ నిరాకరణ చేస్తామన్నారు. వచ్చే నెల 3న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు  తెలిపారు. వచ్చే నెల 7 నుంచి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులంతా నిరవధిక సమ్మెలోకి వెళుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ గవర్నమెంటు ఎంప్లాయీస్‌ పెడరేషన్‌ అధ్యక్షుడు భాస్కరరెడ్డి, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ సంగీతరావు, ఎన్జీవో అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌ సతీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-01-24T06:02:49+05:30 IST