ముందు జాగ్రత్త

ABN , First Publish Date - 2020-09-21T06:17:25+05:30 IST

మవోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. అడవులను, వలస ఆదివాసీ గ్రామాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. పోలీసు

ముందు జాగ్రత్త

మావోయిస్టుల కదలికలపై పోలీసుల డేగకన్ను 

మణుగూరు సబ్‌డివిజన్‌లోకి చొరబడినట్లు ‘నిఘా’ సమాచారం ?

అడవులను జల్లెడ పడుతున్న గ్రేహౌండ్స్‌ బలగాలు

విస్తృత తనిఖీలతో భయంగుప్పిట ఏజెన్సీ 


కరకగూడెం, సెప్టెంబరు 20: మవోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. అడవులను, వలస ఆదివాసీ గ్రామాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. పోలీసు బుట్ల చప్పుళ్లతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి గోదవరి దాటి భద్రాద్రి జిల్లా మణుగూరు సబ్‌డివిజన్‌లోకి మావోయిస్టులు వచ్చినట్లు సమాచారం అందడంతో గ్రేహౌండ్స్‌, స్పెషల్‌ పార్టీ పోలీసులు అడవుల్లో కూంబింగ్‌ ముమ్మరం చేశారు. ఇటీవల కరకగూడెం, మణుగూరు పరిహద్దు మల్లెతోగు వద్ద పోలీసులు, నక్సల్స్‌ మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అప్పుటి నుంచి పోలీసులు మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. వలస ఆదివాసీ గ్రామాలపై డేగా కన్ను వేశారు. ఇటీవల కరకగూడెం మండలంలోని లిమ్మగూడెం, అశ్వాపురంపాడు గ్రామాలకు చెందిన 12 మంది మావోయిస్టు సానుభూతిపరులను కరకగూడెం, ఏడూళ్ల బయ్యారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


మావోయిస్టుల కదలికలపై ఆదివాసీ గ్రామాలలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. గిరిజనులతో సమావేశాలు ఏర్పాటు చేసి కొత్తవ్యక్తులు, అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి, కాటాపురం, రంగాపురం, గుండాల, ఆళ్లపల్లి సరిహద్దు కావడంతో కరకగూడెం ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సరిహద్దులలో ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. దీంతో గిరిజన గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-09-21T06:17:25+05:30 IST