‘పది’ పరీక్షలకు ప్రత్యేక ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-05-31T10:58:07+05:30 IST

కోవిడ్‌ -19 నేపథ్యంలో వాయిదా పడ్డ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు

‘పది’ పరీక్షలకు ప్రత్యేక ఏర్పాట్లు

కోవిడ్‌-19 నిబంధనలతో జాగ్రత్తలు 

ఒక్కో గదిలో 12 మంది విద్యార్థులకే అనుమతి 

అదనంగా 53  కేంద్రాల ఏర్పాటు 

విద్యార్థులు, ఉద్యోగులకు గ్లౌజ్‌లు, మాస్క్‌లు, శానిటైజర్ల పంపిణీ

పరీక్షలకు హాజరుకానున్న 14,270 మంది


కరీంనగర్‌, మే 30 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): కోవిడ్‌ -19 నేపథ్యంలో వాయిదా పడ్డ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు జిల్లా అధికారయంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. జిల్లాలో 504 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 14,270 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 7,528 మంది బాలురు, 6,742 మంది బాలికలు ఉన్నారు. ఇది వరకు పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన 168 మంది పరీక్షలు రాస్తున్నారు. గత మార్చి 18వ తేదీన ఎసెస్సీ పరీక్షలు ప్రారంభం కాగా తెలుగు-1,2, హిందీ పరీక్షలు పూర్తయిన వెంటనే లాక్‌డౌన్‌ నేపథ్యంలో మిగిలిన ఎనిమిది పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేశారు.  మార్చిలో 70 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాయిదా వేసిన ఇంగ్లీష్‌-1,2, గణితం 1,2, సామాన్యశాస్త్రం 1,2, సాంఘికశాస్త్రం 1,2 పేపర్లను జూన్‌ 8 నుంచి జూలై 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 


బెంచీకి ఒక్కరే..

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించేందుకు ఒక్కో తరగతి గదిలో 12 మంది, ఒక్కో బెంచిపైన ఒక్క విద్యార్థి చొప్పున పరీక్షలు రాసేందుకు వీలుగా అదనంగా మరో 53 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 123 పరీక్షా కేంద్రాల్లో 14,270 మంది విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు రాసేందుకు చర్యలు చేపడుతున్నారు. మార్చిలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఏ కేంద్రంగా కొత్తగా ఏర్పాటుచేసిన కేంద్రాలను బీ కేంద్రాలుగా పేర్కొంటూ విద్యార్థులకు సమాచారమిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  కట్టడి ప్రాంతాల్లో, హోం క్వారంటైన్‌, అనారోగ్యం బారిన పడిన వారికి ప్రత్యేక గదులను కేటాయించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలున్న విద్యార్థులు కూడా నిర్భయంగా పరీక్షలు రాసేందుకు వీలు కల్పిస్తున్నారు. 


పరీక్షా కేంద్రాలను శానిటైజ్‌ చేసేందుకు చర్యలు

పరీక్షా కేంద్రాలను పరీక్షకు 2, 3 గంటల ముందే హైడ్రో క్లోరిక్విన్‌ ద్రావణంతో పిచికారి చేయాలని మున్సిపల్‌ అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా హాల్‌లోకి విద్యార్థులు ప్రవేశించే ముందు మాస్కులు అందించి శానిటైజేషన్‌ చేయించిన తర్వాతనే లోనికి అనుమతిస్తారు. విద్యార్థులతోపాటు  ఇన్విజిలేటర్లు, ఇతర అధికారుల కోసం 1800 మాస్క్‌లు, గ్లౌజ్‌లు, సానిటైజర్లను తెప్పించి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద  ఏఎన్‌ఎంలతో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లతోపాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


ఏర్పాట్ల పరిశీలనకు ప్రత్యేక బృందం

 పరీక్షలకు వారం రోజుల ముందే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ శాఖల ఆధ్వర్యంలోని వసతి గృహాలను తెరవాలని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని సంక్షేమ అధికారులను కలెక్టర్‌ ఇప్పటికే ఆదేశించారు ప్రతిరోజు రెండుసార్లు శుభ్రం చేయించాలని, తాగునీటి కొరత లేకుండా చూడాలని సూచించారు.  డీఈవో ఎన్వీ దుర్గాప్రసాద్‌ పది పరీక్షల ఏర్పాట్లను పరిశీలించేందుకు ముగ్గురు సీనియర్‌ ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ కె శశాంక విద్య, మున్సిపల్‌, పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్‌శాఖల అధికారులతో పది పరీక్షలపై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆదేశాలు జారీ చేశారు. 


Updated Date - 2020-05-31T10:58:07+05:30 IST