‘ముందుమాట’లంటే మాటలు కాదు!

ABN , First Publish Date - 2021-07-12T05:47:23+05:30 IST

‘ముందుమాట’ అంటే కవులని, రచయితలని ప్రశంసిస్తూ రాసే వ్యాసం కాదు. అట్లని విశ్లేషిస్తూ రాసే విమర్శా కాదు. గ్రంథ రచయిత కృషిని అర్థం చేసుకుని, ప్రతిభని బలహీనతల్ని సమతూకం వేసి...

‘ముందుమాట’లంటే మాటలు కాదు!

‘ముందుమాట’ అంటే కవులని, రచయితలని ప్రశంసిస్తూ రాసే వ్యాసం కాదు. అట్లని విశ్లేషిస్తూ రాసే విమర్శా కాదు. గ్రంథ రచయిత కృషిని అర్థం చేసుకుని, ప్రతిభని బలహీనతల్ని సమతూకం వేసి వ్యాఖ్యానించే వాస్తవం. పదమూడు పేజీల కవిత్వానికి యాభై ఆరు పేజీల ముందుమాట రాసిచ్చిన ప్రముఖుడు నాకు తెలుసు. ఏ పుస్తకానికి ముందుమాట రాస్తున్నారో దాని గూర్చి కనీసంగానైనా ఊటంకించకుండా తమ స్వీయ ప్రతిభాపాటవాల్ని పాఠకులకు ఏకరువు పెట్టుకునే వాళ్ళనీ చదివాను. మహామహా ఘనత వహించిన కొందరు పెద్దలు వందల వేల సంఖ్యలో ముందు మాటలు గిలుకుతుంటారు. పుస్తకంలోని రెండు వాక్యాలో, నాలుగు పదాలో కాదు... ఏవీ దొరక్కపోతే రెండు కామాలు, నాలుగు పుల్‌స్టాప్‌ల నైనా ఎత్తిచూపి ప్రశంసాపత్రం ఇచ్చేస్తూంటారు. పైగా ‘‘ఇవి మచ్చుతునకలు నా మెచ్చుతునకలు’’ అని ప్రశంసిస్తుంటారు. మరింకొందరు ఊళ్ళు తిరుగుతూ యువ కవుల్ని, యువ రచయితల్ని పుస్తకాలు అచ్చేయండని ప్రోత్సహిస్తూ ఉంటారు. ముందుమాట రాసే బాధ్యత వాళ్ళు తనకే ఇస్తారని ఆశ. చాలాసార్లు వారి ఆశ నెరవే రుతుంది కూడా! ముందు మాటల అవకాశ వాదులు ఇలా రకరకాలుగా ఉంటారు. 


ఎప్పుడైనా, ఎక్కడైనా ముందుమాట కోసం లబ్ధప్రతిష్టులయిన వారి దగ్గరికే వర్ధమానులు వెళుతుంటారు. ముందుమాటలు రాయడం వల్ల లబ్ధప్రతిష్టులకు వచ్చే లాభం కాని, కొత్తగా వచ్చే పేరు ప్రతిష్టలు కాని ఏమీ ఉండవు. బలం లేక పడిపోతున్న తీగకు పందిరి వేసి, ఊతకర్రలు పెట్టి నిలబెట్టినట్లు- స్వతహాగా గ్రంథ రచయితలో ‘‘విషయమేమీ’’ లేకపోతే, ఈ లబ్ధ ప్రతిష్టులు తమ ముందు మాటల ఊతకర్రలు పెట్టి నిలబెట్టడం కుదరదు. ‘‘పీఠికాధిపతి’’ది ఒక ప్రెసెంటర్‌ ఉద్యోగం. అందమైన ఉపోద్ఘాతం ఇచ్చి, ప్రేక్షకుల్లో ఉత్సుకతను పెంచి తెరచాటుకు కదలిపో యేవాడు. ప్రయోక్త- ప్రెసెంటర్‌- పీఠికా రచయిత అని ఏ పేరుతో పిలిచినా అతను పరిచయ వాక్యాలు పలికి వెనక్కెళ్ళి పోయేవాడే. కళాకారుడు ప్రదర్శన చెడగొడితే ప్రయోక్త ఏం చేస్తాడూ? ఒక లబ్ధ ప్రతిష్టుడు తన పీఠి కలో ఆశించిన స్థా యిని గ్రంథ రచ యిత అందుకోకపోతే అది గ్రంథ రచయిత తప్పే అవుతుంది. కానీ, పీఠిక రాసిన వారిది కాదు. అతను ఆశించింది అతను రాస్తాడు. దాన్ని నిలుపు కోవాల్సింది గ్రంథ రచయితే కదా? అయితే ఇక్కడ మరొక విషయం కూడా చెప్పుకోవాలి. నీళ్ళులేని బావిని నీళ్ళున్నట్టు పరిచ యం చేస్తే ఆ ‘పీఠికాధిపతి’ తక్షణం ఆ ఆసనం నుండి దిగి వెళ్ళిపోవాల్సిందే- అం దుకు అతడు అనర్హుడన్నమాట! 


ఒక అనామకుడిని లేదా సాహిత్య రంగంలో కొద్దిపాటి గుర్తింపే ఉన్నవాడిని ఒక లబ ్ధప్రతిష్టుడు గుర్తించి, నాలుగు మంచి మాటలు చెప్పి, అతని స్థాయిని పెంచి, ఇక ముందు ఈ రంగంలో మరింత బాధ్యతగా ముందుకు పోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తాడు. ముందుమాట రాయించుకోవడమంటే ప్రము ఖుడితో కలిసి సెల్ఫీ తీయించుకోవడమ న్నమాట! ఆ సెల్ఫీ లాంటి ముందుమాటను అడ్డంపెట్టుకుని అప్రయోజనకరమైన రచనలు ఉత్పత్తి చేస్తూపోతే ఆ వర్ధమాన రచయిత తనను తాను కించపరుచుకున్నట్టు. తనను ప్రోత్సహించిన పెద్దల్ని అవమాన పరిచినట్టు. కాలం మారిపోయింది. సమాజంలో మార్పులొ చ్చాయి. నీతికి, నిజాయితీకి, విలువలకు దక్కా ల్సిన స్థానం దక్కటం లేదు. రెండు చొప్పదంటు రచనలు చేసి, నాలుగు సన్మానాలు కొనుక్కుని, ప్రయత్నించి మరో మూడు అవార్డుల్ని చేజిక్కించుకుని, సిగ్గు వదిలేసి తన గురించి తనే బాహాటంగా వ్యాసాలు రాసుకుంటూ, తనను తాను ప్రమోట్‌ చేసుకుంటూ హీనంగా బతుకుతున్న వాళ్ళున్న ఈ రోజుల్లో ఇలాంటి మాటలు చాలామందికి నచ్చకపోవచ్చు. అయితే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజం నిజమే. ప్రముఖుల్ని బుట్టలో వేసుకుని అమోఘమైన ప్రశంసా పత్రాలు రాయించుకోవడంలో ఫలితం ఉంటుందనుకుంటారు కొందరు. కానీ, తెలివైన పాఠకుల ముందు తేలిపోతుంటారు. గ్రంథ రచయితా, పీఠిక రాసిన ప్రముఖుడూ ఇద్దరూ అజ్ఞానులుగా కాలం ముందు, సాహిత్యాభిమానుల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది.


అందువల్ల ముందుమాట రాయడమంటే ఎంతో బాధ్యతతో చేయాల్సిన పని అని గుర్తుం చుకోవాలి. కత్తి అంచుమీద జాగ్రత్తగా కలం నడపడం లాంటిది. రాసే కలం పాడవకూడదు. ఎవరి గురించి రాస్తున్నామో వారికి కొంత మేలు జరగాలి! భూతద్దాలు పట్టుకుని ప్రచండ విమర్శకాగ్రేసరులు వచ్చినా ఎవరికీ ఏ తప్పూ దొరకకూడదు. అందుకు సులభమైన మార్గం ఒక్కటే! నిజాయితీగా వాస్తవ దృక్కోణంలోంచి విషయం చెప్పడం! దాని వల్ల తప్పకుండా విలువలు ప్రతిష్టాపించబడతాయి. గ్రంథ రచయిత/ కవి వేసే కుప్పిగంతులు, వికృత చేష్టలూ నిరసిస్తూ బెత్తం తెచ్చి దండించ కుండా పీఠిక రాసే ప్రముఖుడు మెల్లిగా తెలివిగా ముందుమాట అనే అద్దం తెచ్చి గ్రంథ రచయిత ముందు పెడతాడన్నమాట. అంతే- దాంతో ఎవరి విషయం వారికే అర్థమ వుతుంది. ముందుమాటంటే ఆత్మీయంగా స్పర్శించడం, ఒక్కోసారి స్నేహపూర్వకమైన మందలింపు. బలాన్ని, మనోధైర్యాన్నీ పెంచు తూనే అజ్ఞానాన్ని, అహంకారాన్ని లాగేయడం. ముందుమాటంటే ఫార్మాలిటీ కాదు, ఎస్సెసింగ్‌ ద ఎబిలిటి! ఒక పరీక్షాధికారికి, ఒక న్యాయాధి కారికి, ఒక పరిపాలకుడికి, ఒక మంచి మనిషికి ఉండే ఔదార్యం, సహనశీలత ఉంటేనే ఎవరైనా పీఠిక రాయడానికి పూనుకోవాలి. 


కొందరి పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. పుస్తకంలో సగభాగం పీఠికలు, అభిప్రాయాలు, సందేశాలు, అభినందనలతో నింపేస్తారు. పాఠ కులు వాటిని పక్కకు నెట్టేసి ముందుకుపోయి, అసలు గ్రంథ రచయితలో ఏమైనా ‘సరుకు’ ఉందా లేదా అని చూస్తారు. అలాంటప్పుడు ముప్పయి పేజీల ముందు మాటలు రచయి తకు ఏమాత్రం ఉపయోగపడనట్లే కదా? సరిగా రాయగలవాళ్ళు ఏ ఒక్కరు రాసినా బావుండేదే అని తర్వాత తెలుసుకుంటారు. ముందుమాట పుస్తకానికి ముఖచిత్రంగా నిలవాలి. దాంతో పాఠకులు పుస్తకం వెనకపడి వచ్చేట్లుండాలి. అల్లాటప్పాగా తీసుకునేవారికి దాని విషయం తెలియకపోవచ్చు. కానీ, సాహిత్యాన్ని సీరియస్‌గా తీసుకునేవారికి అదొక సీరియస్‌ విషయం! 


పుస్తకంలోకి అంటే రచయిత ఆలోచనల్లోకి అంటే సృజనకర్త మేధస్సులోకి దారిచూసే సైన్‌ బోర్డు ముందుమాట! పుస్తకాన్నంతా క్రోడీక రించే సారాంశపు చుక్క. పుస్తకం గుమ్మం ముందు నిలిచిన ఒక మహావృక్షపు బోన్సాయ్‌ మొక్క. ఒక పరిధిలో ఒదిగి ఉండి, పుస్తకంపై సృజకారుడిపై ‘స్పాట్‌లైట్‌’ వేసి ప్రదర్శించేదిగా ఉండాలి. అంతేకాని, పుస్తకాన్ని మరుగునపడేసే దుష్ట సంప్రదాయం కాకూడదు. కళ్ళు చెదర గొట్టే ఫ్లడ్‌ లైట్‌ కాకూడదు. దానివల్ల అసలు ప్రయోజనం దెబ్బతింటుంది. స్వంత డబ్బా కొట్టుకునేవారితో ఏ గ్రంథ రచయిత అయినా ముందుమాట రాయించుకుంటే, ఇక ఆ గ్రంథ రచయిత తనను తాను అగ్నికి ఆహుతి ఇచ్చు కున్నట్లే. అనుబంధాలు, పరిచయాలు పక్కన పెట్టి విషయ పరిజ్ఞానం ఉన్నవారితో ముందు మాట రాయించుకుంటే కొంతలో కొంత ఫలితం ఉంటుంది. సరైన వైద్యుడి దగ్గరికి వెళితేనే లోపాలు తెలుస్తాయి. 

దేవరాజు మహారాజు


Updated Date - 2021-07-12T05:47:23+05:30 IST