‘కరోనా’ వేళ.. కాదు పొమ్మన్నారు..!

ABN , First Publish Date - 2020-07-20T15:23:55+05:30 IST

పురిటి నొప్పులతో బాధపడే ఓ నిండుగర్భిణీకి వైద్యం చేయడానికి మనసు రాలేదు. పలు కారణాలు చెబుతూ కాన్పు చేయడానికి డాక్టర్లు నిరాకరించారు. దీంతో పక్కనే ఉన్న బస్టాండ్‌ సమీపంలో డెలివరీ కాగా,

‘కరోనా’ వేళ.. కాదు పొమ్మన్నారు..!

నిండు గర్భిణీకి రక్తం తక్కువ ఉందని ఎంసీహెచ్‌లో వైద్యానికి నిరాకరణ

బస్టాండ్‌ పక్కనే ప్రసవం.. జన్మించిన బాబు

తల్లిబిడ్డాక్షేమం.. తిరిగి ఆస్పత్రిలో చికిత్స

జనగామలో దారుణం


జనగామ టౌన్‌(ఆంధ్రజ్యోతి) : పురిటి నొప్పులతో బాధపడే ఓ నిండుగర్భిణీకి వైద్యం చేయడానికి మనసు రాలేదు. పలు కారణాలు చెబుతూ కాన్పు చేయడానికి డాక్టర్లు నిరాకరించారు. దీంతో పక్కనే ఉన్న బస్టాండ్‌ సమీపంలో డెలివరీ కాగా, పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలోని మాతా, శిశు ఆరోగ్యకేంద్రం (ఎంసీహెచ్‌)లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. 


బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన హుస్సేన్‌-బీబీ దంపతులకు ముగ్గురు కుమార్తెలుకాగా, నాలుగో కాన్పు కోసం జనగామలోని ఎంసీహెచ్‌ ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు రక్తం తక్కువగా ఉందని చెబుతూ వైద్యులు, సిబ్బంది అడ్మిట్‌ చేసుకోకుండా బయటకు పంపించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో నిండుగర్భిణి ఆస్పత్రి పక్కనే ఉన్న బస్టాండ్‌లో ఆరుబయట ప్రసవించింది. పండంటి బాబుకు జన్మనిచ్చింది. కాగా, అంతకుముందు హుస్సేన్‌ తన భార్య బీబీని సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడి డాక్టర్లు చేర్చుకోలేదు. తిరిగి జనగామ ఎంసీహెచ్‌కురాగా స్థానిక వైద్యులు గర్బిణీకి రక్తం తక్కువగా ఉందని చెబుతూ.. వరంగల్‌కు వెళ్లాలని సూచించి, ఆస్పత్రి నుంచి పంపించారు. అయితే ఆస్పత్రి సమీపంలోని బస్టాండ్‌లో వరంగల్‌కు అంబులెన్స్‌లో వెళ్లేందుకు వేచిఉన్న గర్భిణీ  కోసం వాహనం రాకపోవడంతో పురిటినొప్పులు అధికమై బస్టాండ్‌ సమీపంలోనే స్థానిక మహిళల సహకారంతో ప్రసవించింది. దీంతో ఎంసీహెచ్‌ వైద్యులు తల్లీబిడ్డలను తిరిగి ఆస్పత్రిలోకి చేర్చుకుని చికిత్స ప్రారంభించారు. 


ఈ విషయమై బాధితురాలి భర్త హుస్సేన్‌ మాట్లాడుతూ తాను ఎంత ప్రాధేయపడినా ఎంసీహెచ్‌ వైద్యులు తన భార్యకు డెలివరీకి నిరాకరించారని ఆరోపించారు. ఎంసీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.రఘును వివరణ కోరగా గర్బిణీకి రక్తం తక్కువగా ఉండడంతో వరంగల్‌కు రెఫర్‌ చేశామని, అంబులెన్స్‌ సైతం ఏర్పాటు చేశామన్నారు. గర్భిణీ బయటకు వెళ్లి ఎక్కడికి వెళ్లాలో బంధువులు తేల్చుకునేలోగా డెలివరీ అయిందని, ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఏమిలేదని తెలిపారు. కాగా, ఈ సంఘటనపై జనగామ ఎస్‌ఐ రాజే్‌షనాయక్‌ ఆస్పత్రికి చేరుకుని విచారణ జరిపారు. అలాగే ఎంసీహెచ్‌లో జరిగిన ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరుపాలని కలెక్టర్‌ నిఖిల ఆదేశాలను జారీ చేశారు.

Updated Date - 2020-07-20T15:23:55+05:30 IST