Abn logo
Jun 3 2020 @ 03:52AM

కరోనాతో గర్భిణి మృతి

బచ్చన్నపేట, జూన్‌ 2 :  యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం దూది వెంకటాపూర్‌కు చెందిన గర్భిణికి కరోనా వ్యాధిసోకగా హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో సోమవారం మృతి చెందింది. మృతురాలు తల్లిగారి ఇల్లు జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం. ఈ ఘటనకు సంబంధించి వైద్యాధికారి నవీన్‌, ఎస్‌ఐ రఘుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.


మృతురాలు తన భర్తతో కలిసి లాక్‌డౌన్‌కు ముందు హైదరాబాద్‌ కుషాయిగూడలో ఉండేవారు. లాక్‌డౌన్‌తో స్వగ్రామం దూది వెంకటాపూర్‌కు వచ్చారు. గతనెల 27న సదరు మహిళ అనారోగ్యంతో తల్లిగారిల్లయిన బచ్చన్నపేటకురాగా, గర్భిణీ కావటంతో కుటుంబ సభ్యులు 28న జనగామ ఎంసీహెచ్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు రక్తహీనతతో బాధపడుతోందని హైదరాబాద్‌ ఉస్మానియాకు వెళ్లాల్సిందిగా సూచించారు. కానీ, రాజపేట ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు ఉస్మానియాకు వెళ్లమని సూచించటంతో తిరిగి బచ్చన్నపేటకు వచ్చి, ఇక్కడి నుంచి 29న మళ్లీ జనగామ ఎంసీహెచ్‌కు వెళ్లారు. ఏం జరిగిందో తెలియదుకాని అదేరోజు వరంగల్‌ గవర్నమెంట్‌ మెటర్నటీ హస్పిటల్‌కు వెళ్లారు. అక్కడి వైద్యులు సైతం ఉస్మానియాకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు.


దీంతో గతనెల 30న హైదరాబాద్‌ ఉస్మానియాలో చేర్పించగా, పరీక్షించిన వైద్యులు కడుపులో శిశువు మృతి చెందినట్టు గుర్తించి తీసివేశారు. బ్లడ్‌ శాంపిల్స్‌ తీసి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. సదరు మహిళ చికిత్స పొందుతూ ఈనెల 1న సాయంత్రం మృతి చెందింది. రక్త పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలినట్టు వైద్యులు తెలిపారు. కాగా, గత 15 రోజుల సమయంలో పలు ప్రభుత్వాస్పత్రులతో పాటు, ప్రైవేటు ఆస్పత్రులకు సైతం చికిత్స కోసం వెళ్లినట్టు తమ పరిశీలనలో వెల్లడైందని బచ్చన్నపేట వైద్యాధికారి నవీన్‌ తెలిపారు. స్వగ్రామం దూది వెంకటాపూర్‌తో పాటు, బచ్చన్నపేటలో ఎవరెవరిని కలిశారనే విషయమై ఆరా తీస్తున్నట్టు వివరించారు. 


Advertisement
Advertisement