పురిటి పాట్లు

ABN , First Publish Date - 2021-05-14T08:27:34+05:30 IST

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కాబోయే ఆ తల్లుల ప్రాణాలను ప్రసవం వేళ ప్రమాదంలోకి నెట్టింది. సకాలంలో ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో ఒకరు రోడ్డు మీదే ప్రసవిస్తే, ఇంకొక గర్భిణి వైద్యశాల ప్రాం

పురిటి పాట్లు

కొవిడ్‌లో ఆస్పత్రుల వైఖరితో కొన్ని గంటలపాటు నరకయాతన

తీవ్ర నొప్పులు పడుతూనే నిరీక్షణ

మార్కాపురంలో రోడ్డుపైనే పురుడు

విశాఖలో ఆస్పత్రి బయట బెంచ్‌పైనే..

సింహాచలం, మార్కాపురం, మే 13: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కాబోయే ఆ తల్లుల ప్రాణాలను ప్రసవం వేళ ప్రమాదంలోకి నెట్టింది. సకాలంలో ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో ఒకరు రోడ్డు మీదే ప్రసవిస్తే, ఇంకొక గర్భిణి వైద్యశాల ప్రాంగణంలోనే పురుడుపోసుకోవాల్సి వచ్చింది. కొన్నిగంటలపాటు ఎంతో టెన్షన్‌కు గురిచేసిన ఈ ఘటనలు ప్రకాశం జిల్లా మార్కాపురం, విశాఖజిల్లా సింహాచలంలో గురువారం చోటుచేసుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. విశాఖ నగరంలోని కొబ్బరితోట ప్రాంతానికి చెందిన సీహెచ్‌ లక్ష్మి సింహాచలం దేవస్థానం ఘాట్‌రోడ్డులో గల బంధువుల వద్ద ఉంటున్నారు. గురువారం ఉదయం నొప్పులు రావడంతో పది గంటల ప్రాంతంలో స్థానిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. తనకు పురిటి నొప్పులు వస్తున్నాయని సిబ్బందికి చెప్పగా...ముందుగా కరోనా పరీక్ష చేయించుకొనివస్తేనే అడ్మిట్‌ చేసుకొంటామని నిర్దయగా సమాధానమిచ్చారు. 


అప్పటికి ఇంకా కొవిడ్‌ పరీక్ష చేసే సిబ్బంది విధులకు రాలేదు. దీంతో ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో నొప్పులు పడుతూనే వారి కోసం చెట్టు కిందనున్న బెంచీపై వేచి చూశారు. ఆ సమయంలో నొప్పులు మరింత అధికమవ్వడంతో ఆ బెంచీపైనే మగబిడ్డకు లక్ష్మి జన్మనిచ్చారు. ఈ విషయం తెలుసుకుని ఆస్పత్రి ఇన్‌చార్జి వైద్యాధికారి డాక్టర్‌ ఎన్‌.మాధవి సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. బాలింతను, నవజాత శిశువును శస్త్రచికిత్సా కేంద్రానికి తరలించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని, అయినా మెరుగైన వైద్యం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించామని సిబ్బంది చెప్పారు. అయితే, తల్లీబిడ్డలను ఆటోలో కేజీహెచ్‌కు తరలించడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. నొప్పులతో వచ్చిన గర్భిణి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, ఆస్పత్రికి సొంత అంబులెన్స్‌ లేకపోవడం, 108 వాహనాలన్నీ కొవిడ్‌ బాధితుల సహాయక చర్యల్లో ఉండటం వల్లే వారిని ఆటోలో పంచాల్సి వచ్చిందని సిబ్బంది చెబుతున్నారు. 


రోడ్డు మీదే ప్రసవం

ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్‌లోని బేస్తవారపేట మండలం గార్లకుంటకు చెందిన వెంకటేశ్వర్లు భార్య త్రివేణికి నెలలు నిండాయి. నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌లో మార్కాపురం తీసుకొచ్చారు. అక్కడి జిల్లా వైద్యశాలను కొవిడ్‌ వైద్యశాలగా మార్చారు. మాతా, శిశుసంరక్షణ వార్డును మార్కాపురంలోని సాయి సింధూరా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (సిమ్స్‌)కు మార్చారని తెలుసుకొని అక్కడకు వారు వెళ్లారు. అప్పుడు సమయం మధ్యాహ్నం ఒంటిగంట. త్రివేణికి నొప్పులు అధికమయ్యాయి. అయినా.. త్రివేణిని సిబ్బంది ఆస్పత్రిలో చేర్చుకోలేదు. తమ వద్ద తగినన్ని రక్త నిల్వలు లేవనే కారణంతో అడ్మిట్‌ చేసుకోవడానికి నిరాకరించారు. తీవ్రమైన పురిటినొప్పులతో కొన్నిగంటలపాటు తాము వచ్చిన ఆటోలోనే త్రివేణి అల్లాడిపోయారు. సాయంత్రం ఐదుగంటల సమయంలో త్రివేణికి రోడ్డుపైనే ప్రసవం అయింది. అక్కడ ఉన్న మహిళలు చుట్టూ చీరలను అడ్డు తెరలుగా ఉంచి ఆమె ప్రసవానికి సహకరించారు. ఆడశిశువుకు త్రివేణి జన్మనిచ్చింది. ఈ ఘటన తర్వాత.. ప్రసవం కోసం వచ్చి ఆటోలో నిరీక్షిస్తున్న ఇద్దరు గర్భిణులను సిబ్బంది హడావుడిగా ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు.  


చర్యలు తీసుకొంటాం..

‘‘కరోనా పరీక్షలను త్వరితగతిన చేయడానికి 50 చొప్పున రాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లు అందజేశాం. సింహాచలం కేంద్రంలో సిబ్బంది ఎందుకు అలా వ్యవహరించారో విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని ఇద్దరు అధికారులను పంపించాం. ఈ విషయంలో నిర్లక్ష్యం ఉందని తేలితే, తప్పకుండా చర్యలు చేపడతాం’’

- డాక్టర్‌ సూర్యనారాయణ, డీఎంహెచ్‌వో, విశాఖ జిల్లా 

Updated Date - 2021-05-14T08:27:34+05:30 IST