ముందస్తు ఖాయం

ABN , First Publish Date - 2021-10-19T07:01:20+05:30 IST

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ ముందస్తు ఎన్నికల దిశగానే ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

ముందస్తు ఖాయం

  • టీఆర్‌ఎస్‌లో పరిణామాలన్నీ ఆ దిశగానే..
  • గుజరాత్‌ ఎన్నికల సమయానికి 
  • ప్రభుత్వాన్ని కేసీఆర్‌ రద్దు చేస్తారు
  • హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత 
  • టీఆర్‌ఎస్‌లో తిరుగుబాటు
  • ఆ భయంతోనే విజయగర్జన సభ
  • మీడియాతో చిట్‌చాట్‌లో పీసీసీ చీఫ్‌ రేవంత్‌


హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ ముందస్తు ఎన్నికల దిశగానే ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గుజరాత్‌ ఎన్నికల సమయానికి సీఎం కేసీఆర్‌ తన ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని, గుజరాత్‌ ఎన్నికలతో పాటే తెలంగాణ ఎన్నికలూ వస్తాయని చెప్పారు. ఇదంతా ప్రధాని మోదీ డైరెక్షన్‌లోనే జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే కుట్ర జరుగుతోందన్నారు. సీఎల్పీ కార్యాలయంలో సోమవారం రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 2022 ఆగస్టు 15తో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందని, ఆ సందర్భంగా కొత్త శకానికి నాంది అని చెబుతూ కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళతారని చెప్పారు.


అలాంటిదేమీ లేకపోతే సర్కారును నడపాల్సిన సమయంలో సీఎం కేసీఆర్‌ పార్టీపై ఎందుకు దృష్టి పెట్టారని ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలంటే టీఆర్‌ఎస్‌ పార్టీలో మరింత గందరగోళం నెలకొంటుందన్న భయంతోనే కేసీఆర్‌ చెప్పట్లేదన్నారు. ప్రతి నియోజకవర్గంలో నాయకులకు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని, వారు అప్రమత్తమవకుండా చేసేందుకే ‘ముందస్తు’ లేదంటూ కేసీఆర్‌ డ్రామా ఆడుతున్నారని అన్నారు. అసలు ఎవరు అడిగారని ముందస్తు ఎన్నికలపై ఆయన మాట్లాడాల్సి వచ్చిందని ప్రశ్నించారు. యూపీ ఎన్నికల్లోనూ బీజేపీకి కేసీఆర్‌ సహకారం ఉంటుందని ఆరోపించారు.


తిరుగుబాటు!

హుజూరాబాద్‌ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలో తిరుగుబాటు వస్తుందని రేవంత్‌ అన్నారు. ఆ భయంతోనే కేసీఆర్‌ పార్టీ ప్లీనరీ, విజయగర్జన సభ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఇవే చివరి సభలని వ్యాఖ్యానించారు. హరీశ్‌రావును కూడా త్వరలోనే పార్టీ నుంచి బయటికి పంపుతారన్నారు. మిత్రద్రోహి పేరుతో ఆయన్ను పంపేస్తారని చెప్పారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలిచినా, ఓడినా ఎవరికీ లాభం లేదన్నారు. ఏం సాధించారని టీఆర్‌ఎస్‌ పార్టీ విజయగర్జన సభ నిర్వహిస్తోందని ప్రశ్నించారు. ‘16 లోక్‌సభ స్థానాలు గెలుస్తా.. కేంద్రంలో చక్రం తిప్పుతా’ అంటే దేనికి సంకేతమని వ్యాఖ్యానించారు. దళిత ద్రోహి నాయకత్వంలోని పార్టీలోకి మరో దళిత నాయకుడు మోత్కుపల్లి చేరాడన్నారు.

Updated Date - 2021-10-19T07:01:20+05:30 IST