కారులోనే ప్రసవం.. ఎదురుకాళ్లతో బిడ్డ జననం.. ఆస్పత్రి బిల్లు రూ. 4.12 కోట్లు! చివరికి..

ABN , First Publish Date - 2021-12-29T02:23:22+05:30 IST

ఆస్పత్రి ఖర్చులంటే భయపడని వారుండరు! బిల్లులు చెల్లించేందుకు పేషెంట్ల బంధువులు ఆస్తులు అమ్మిన ఘటనలు కోకొల్లల్లు! అయితే.. అమెరికాకు చెందిన ఓ మహిళకు ఇంతకంటే భయంకరమైన అనుభవం ఎదురైంది.

కారులోనే ప్రసవం.. ఎదురుకాళ్లతో బిడ్డ జననం.. ఆస్పత్రి బిల్లు రూ. 4.12 కోట్లు! చివరికి..

ఇంటర్నెట్ డెస్క్: ఆస్పత్రి ఖర్చులంటే భయపడని వారుండరు! బిల్లులు చెల్లించేందుకు పేషెంట్ల బంధువులు ఆస్తులు అమ్మిన ఘటనలు కోకొల్లల్లు! అయితే.. అమెరికాకు చెందిన ఓ మహిళకు ఇంతకంటే భయంకరమైన అనుభవం ఎదురైంది. బిల్లులు చెల్లించేందుకు ఇన్సూరెన్స్ సంస్థలు నిరాకరించడంతో ఆమె దాదాపు 5 లక్షల డాలర్లు (మన కరెన్సీలో దాదాపు రూ. 4.12 కోట్లు) చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు స్థానిక మీడియా కల్పించుకోవడంతో కథ సుఖాంతమైంది. అసలేం జరిగిందంటే..


ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన బిసీ బెన్నెట్ ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్. ఆమె వయసు 38 ఏళ్లు. ఆమెకు అదే తొలి గర్భం. కానీ.. డెలివరీ డేట్ దగ్గరపడుతుండగా ఆమె కలలో కూడా ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ రోజున ఉన్నట్టుండి ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. దీంతో.. హుటాహుటీన బిసీ ఆస్పత్రికి బయలు దేరింది. కానీ.. కారులోనే ప్రసవం జరిగిపోయింది. నెలలు నిండకుండానే బిడ్డ పుట్టింది. ఇది చాలదన్నట్టు..శీర్షోదయానికి బదులు ఎదురు కాళ్లతో బిడ్డ పుట్టడడంతో పరిస్థితి మరింత సీరియస్‌గా మారింది. ఆమెను ఆస్పత్రికి తరలించే ముందు కూడా బిడ్డ బొడ్డు తాడు తల్లి నుంచి వేరు పడలేదు. ఓ తల్లిగా ఆమెకు ఇది ఊహించని అనుభవం. 


ఇక ఆస్పత్రిలో తరలిస్తున్నప్పుడు కూడా బిడ్డ ఏడుపు వినపడకపోవడంతో ఆమె మరింతగా భయపడిపోయింది. పాపను ప్రాణాలతో చూస్తానో లేదో అంటూ తల్లడిల్లిపోయింది. బిడ్డ నాడి కొట్టుకుంటోంది..అన్న వైద్యులు మాటలు విన్నాకే ఆమె ప్రాణం కుదుటపడింది. ఆ తరువాత.. పాపను మళ్లీ రెండు నెలల తరువాత కానీ ఆమె చూడలేదు. ఈ క్రమంలో వైద్యులు బిడ్డను శిశువు ఐసీయూ(నియోనేటల్ ఐసీయూ)లో ఉంచారు. నెలలు నిండకుండానే పుట్టడంతో శిశువుకు అత్యాధుని వైద్య చికిత్సలు అవసరమయ్యాయి. అంతా సవ్యంగా సాగడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో తల్లీబిడ్డలు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 


కానీ.. ఆ తరువాతే బిసీకి అసలు షాక్ తగిలింది. ఆస్పత్రి బిల్లు మొత్తం రూ. 4 కోట్లు అయ్యిందని చెప్పడంతో ఆమెకు నోట మాటరాలేదు. ఆమె తేరుకునేలోపలే.. ఈ మొత్తాన్ని 12 నెలల వ్యవధిలో చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. అప్పటికే ఆమెకు ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ.. తను ఉద్యోగం చేస్తున్న సంస్థ తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా బిల్లులు మంజూరు కాలేదు. ఆమె 2020 చివర్లో ఆస్పత్రిలో చేరి 2021లో డిశ్చార్జ్ అయింది. అయితే.. సంస్థ మాత్రం కొత్త ఏడాదిలో ఇన్సూరెన్స్‌ను కొత్త సంస్థకు మార్చింది. ఆస్పత్రి వారేమో ఇవేవీ పట్టించుకోకుండా.. బిల్లును ఓ మారు పాత ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించారు. కొత్త ఏడాది బిల్లులు తాము చెల్లించమని ఆ సంస్థ చెప్పడంతో రెండో కంపెనీకి పంపించారు. 2020 నాటి బిల్లును తాము చెల్లించమని రెండో కంపెనీ చెప్పడంతో చివరికి ఈ బిల్లు బిసీకి చేరింది. అయితే..ఈ వ్యవహారమంతా స్థానిక మీడియాకు తెలియడంతో వారు ఆస్పత్రి వర్గాలను, రెండు ఇన్సూరెన్స్ కంపెనీలను సంప్రదించి పరిస్థితిని ఓ కొలిక్కి తీసుకురాగలిగారు. ఫలితంగా.. చెల్లించాల్సిన బిల్లు కూడా గణనీయంగా తగ్గడంతో పాటూ ఆ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలే చెల్లించాయి. 

Updated Date - 2021-12-29T02:23:22+05:30 IST