Abn logo
Oct 17 2021 @ 01:49AM

అకాల వర్షం.. అన్నదాతకు నష్టం

హుజూర్‌నగర్‌ మండలం బూరుగడ్డలో నేలవాలిన వరి పొలం

జిల్లాలో వెయ్యి ఎకరాల్లో దెబ్బతిన్న వరి

చేతికొచ్చే సమయానికి నేలవాలిన పంట


హుజూర్‌నగర్‌, నాగారం, అక్టోబరు 16: అకాల వర్షం అన్నదాతకు నష్టం మిగిల్చింది. సూర్యాపేట జిల్లాలో వెయ్యి ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చే సమయానికి పంట నేలవాలడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో రైతాంగానికి అపార నష్టం వాటిల్లింది. బూరుగడ్డ రెవెన్యూ పరిధిలోని మాచవరం, బూరుగడ్డ, కరక్కాయలగూడెం, మర్రిగూడెం, గోపాలపురం గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా చేతికి వచ్చిన పంట నేలరాలింది. మండలంలో రైతులు ఖరీ్‌ఫలో చింట్లు, హెచ్‌ఎంటీ, సాంబమసూరి రకాలు సాగుచేశారు. పంట ఏపుగా పెరగడంతో పొట్ట దశలో ఉన్న వరిపైరు ఈదురు గాలులకు నేలవాలింది. ఎకరానికి రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు ప్రకృతి కన్నెర్ర చేయడంతో వందల ఎకరాలల్లో పంట కోల్పోయారు. నాగారం మండలంలో అకాల వర్షంతో వరిపంటకు నష్టం వాటిల్లింది. చేతికి వచ్చే సమయానికి నేలవాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాగారం స్టేజీ నుంచి పస్తాలకు వెళ్లే రహదారి వద్ద నుంచి తాళ్లకుంట చెరువు అలుగు పోస్తుండడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షానికి పస్తాల గ్రామానికి చెందిన పులుసు రామూర్తి ఇల్లు ధ్వంసమైంది.


మోత్కూరులో మోస్తరు వర్షం

మోత్కూరు అక్టోబరు 16: మోత్కూరు మండలంలో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షంతో వరి, పత్తి చేలకు నష్టం కలుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ, దసరా పండుగ కావడంతో కూలీలు లభించక చేనులో పత్తి తీయలేదు. వరి చేలు కూడా కోతకు వచ్చాయి. పండుగ తర్వాత పత్తి తీత, వరి కోతలకు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో వర్షంతో పత్తి తడిసి ముద్దయింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి గొలుసులు వర్షానికి తడిసి బరువెక్కి నేలవాలాయి. ఇప్పటికే అధిక వర్షాలతో పత్తి చేలు దెబ్బతిని దిగుబడి సగానికి పడిపోగా, మిగిలిన పత్తి కూడా దెబ్బతిన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.