అకాల వర్షం.. తీరని నష్టం

ABN , First Publish Date - 2022-01-15T05:49:26+05:30 IST

జిల్లాను అకాల వర్షం అతలాకుతలం చేసింది. రైతన్నకు తీరని నష్టం చేకూర్చింది. భారీగా కురిసిన వడగళ్ల వల్ల జిల్లాలోని పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

అకాల వర్షం.. తీరని నష్టం

జిల్లాలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు

పంటలను పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు

సుమారు వెయ్యి ఎకరాల్లో పంట నష్టం

ప్రకృతి వైపరీత్యాలతో రైతుల ఆందోళన

పరిహారం చెల్లించాలని బాధితుల వేడుకోలు

నిజామాబాద్‌, జనవరి 14(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాను అకాల వర్షం అతలాకుతలం చేసింది. రైతన్నకు తీరని నష్టం చేకూర్చింది. భారీగా కురిసిన వడగళ్ల వల్ల జిల్లాలోని పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గాలి దుమారంతో భారీగా వడగళ్లతో పాటు వర్షం పడడంతో మొక్కజొన్న, ఉల్లి, పొద్దుతిరుగుడు, ఆముదం, ఆవాలతో పాటు ఎర్రజొన్న పంటలకు తీవ్రం నష్టం జరిగింది. పంటలు వేసి రెండునెలలు దాటి చేతికి వచ్చే దశలో వడగళ్ల వర్షం పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 

ఫ జిల్లాలో సరాసరి 6.9 మి.మీలు వర్షం..

జిల్లాలో గురువారం రాత్రి అకాల వర్షం పడింది. జిల్లాలో సరాసరి 6.9 మి.మీలు వర్షం పడగా నిజామాబాద్‌ సౌత్‌లో అత్యధికంగా 30.9 మి.మీల వర్షం పడింది. సిరికొండ మండలంలో 14.3 మి.మీలు, డిచ్‌పల్లిలో 11.4 మి.మీలు, ధర్పల్లిలో 17.6మి.మీలు, ఇందల్‌వాయిలో 29.3మి.మీలు, నిజామాబాద్‌నార్త్‌ 22.4మి.మీల వర్షం పడింది. కొన్ని మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. జిల్లాలో పడిన భారీ వర్షంతో సిరికొండ, ఇందల్‌వాయి, ధర్పల్లి, డిచ్‌పల్లి మండలాల పరిధిలో పంటలు దెబ్బతిన్నాయి. ఒకేసారి గాలివాన రావడం, కొంతమేర వడగళ్లు పడడంతో పంట నేలకొరిగింది. మొక్కజొన్న భారీగా దెబ్బతింది. ఈ వర్షానికి పీచు దశలో ఉన్న మొక్కజొన్న కర్రలు విరిగిపోవడంతో పంట తిరిగి చేతికివచ్చే పరిస్థితిలేదని రైతులు వాపొతున్నారు. భారీగా పడిన ఈ వర్షంతో పూత దశలో ఉన్న పొద్దుతిరుగుడూ కూడా దెబ్బతింది. కొన్ని గ్రామాల పరిధిలో ఎర్రజొన్న దెబ్బతింది. ఒకేసారి భారీగా పడడం, గాలిదుమారం ఎక్కువ రావడం వల్ల పంటకు నష్టం జరిగింది. కొన్ని మండలాల పరిధిలో ఆముదం, ఉల్లి, ఆవాల పంట కూడా దెబ్బతింది. కూరగాయల పంటలకు కూడా నష్టం జరిగింది. జిల్లాలో పొద్దుతిరుగుడు 48 ఎకరాల్లో, మొక్కజొన్న 146 ఎకరాల్లో దెబ్బతింది. జిల్లాలో 33శాతం కన్న ఎక్కువగా 196 ఎకరాల్లో పంట దెబ్బతినగా 33శాతం కన్న తక్కువ ఎక్కువ మొత్తంలో నష్టం జరిగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్కువ నష్టం జరిగినవారికి పరిహారం అందదు. జిల్లాలో వడగళ్లు, వర్షాలతో 33శాతం కంటే అధికంగా దెబ్బతింటేనే ఈ పరిహారం ఇస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ అధికారులు శుక్రవారం కొన్ని గ్రామాల పరిధిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మరికొన్ని గ్రామాల్లో శని, ఆదివారాల్లో పరిశీలించనున్నారు.

ఫ వెయ్యి ఎకరాలకుపైగా పంటల సాగు..

జిల్లాలో వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం వెయ్యి ఎకరాలకుపైగా పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు. జిల్లా నుంచి ఈ వడగళ్ల వల్ల దెబ్బతిన్న పంటల వివరాలను మొత్తం సర్వే పూర్తయిన తర్వాత సోమవారం పూర్తి నివేదికను అందించనున్నారు. జిల్లాలో ఈ పంటలతో పాటు కూరగాయల పంటలు కూడా కొంతమేర దెబ్బతిన్నాయి. వీటిని కూడా ఉద్యానవనశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలను కలెక్టర్‌కు నివేదించి ప్రభుత్వానికి పంపించనున్నారు. జిల్లాలో అకాల వర్షం వల్ల నాలుగు మండలాల పరిధిలో పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయని జేడీఏ మేకల గోవింద్‌ తెలిపారు. ఆ మండలాల పరిధిలోని గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఎక్కువగా మొక్కజొన్న పంట దెబ్బతిందని ఆయన తెలిపారు.

Updated Date - 2022-01-15T05:49:26+05:30 IST