గృహాలకు ప్రీ పెయిడ్ మీటర్లు అనుచితం

ABN , First Publish Date - 2020-09-19T06:17:16+05:30 IST

కేంద్రప్రభుత్వం ఒక్కోసారి ఒక్కో సంస్కరణ తీసుకువస్తుండడంతో ప్రజలు కలవరపడుతున్నారు.

గృహాలకు ప్రీ పెయిడ్ మీటర్లు అనుచితం

కేంద్రప్రభుత్వం ఒక్కోసారి ఒక్కో సంస్కరణ తీసుకువస్తుండడంతో  ప్రజలు కలవరపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు, కమర్షియల్ సర్వీసులకు, ఆ తర్వాత క్రమంగా గృహాలకు ఈ ప్రీ పెయిడ్ మీటర్లు బిగించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గృహ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. 


విద్యుత్ ఉమ్మడి జాబితాలో  ఉన్నందున కేంద్రం దీనిపై చట్టం చేస్తే దానిని రాష్టాలు అంగీకరించాల్సిందే. రాజ్యాంగంలోని 3వ జాబితా 7వ షెడ్యూల్‌లోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం రాష్టాలకు ఉన్నప్పటికి కేంద్రం చేసే శాసనానికే చట్టబద్ధత ఉంటుంది. రాష్ట్రాలకు పూర్తి అధికారాలు, స్వేచ్చ కల్పిస్తున్నాం  అంటూనే కేంద్రప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా విద్యుత్ పై నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో  దివంగత ముఖ్యమంత్రి వై. యస్.రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ను అమలులోకి తెచ్చారు. అయితే అది మోయలేని భారంగా మారిందని, విద్యుత్‌ సంస్థలకు తీవ్ర నష్టాలు వస్తున్నాయని, క్రమంగా బిల్లు చెల్లించే విధానమే రావాలని కేంద్రం భావిస్తోంది. దానికి తోడు గృహ అవసరాలకు కూడా ప్రీ పెయిడ్ మీటర్లు బిగిస్తామనే చెప్పడం అనాలోచితం, అర్థం లేని నిర్ణయం. గృహ యజమానులు నిజాయితీగా, సక్రమంగా ప్రతి నెల బిల్లులు చెల్లిస్తున్నారు. అందువల్ల గృహాలకు ప్రీ పెయిడ్ మీటర్లు అవసరం లేనే లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు, కమర్షియల్ సర్వీసులకు మాత్రమే వాటిని బిగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాల్లో బిల్లుల చెల్లింపులు సకాలంలో ఉండవు, చాలావరకు చెల్లించవు. ఆయా కార్యాలయాలకు సంబంధించి విద్యుత్ బిల్లుల బకాయిలు కోట్లలో పేరుకుపోయాయి. ముందు ఆ కార్యాలయాలకు మీటర్లు అమర్చితే ట్రాన్స్‌కో నష్టాల నుంచి సగంపైనే గట్టెక్కుతుంది. తర్వాత కమర్షియల్ సర్వీసులకు ఈ విధానం అమలు చేస్తే సముచితంగా ఉంటుంది. 


కనుమ ఎల్లారెడ్డి

Updated Date - 2020-09-19T06:17:16+05:30 IST