ఎస్సెస్సీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2020-06-05T10:55:39+05:30 IST

పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ పాణిని అన్నారు

ఎస్సెస్సీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

డీఈఓ పాణిని


ఆసిఫాబాద్‌, జూన్‌4: పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ పాణిని అన్నారు. గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో నిలిచి పోయిన పదో తరగతి పరీక్షలను తిరిగి జూన్‌ 8 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. కొవిడ్‌-19  ్త నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను 35 నుంచి 46కు పెంచామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య బృందాలను అందుబాటులో ఉంచి విద్యార్థులను థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు చేసిన తరువాత పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా మాస్కులు, శానిటైజర్లు, సిబ్బందికి గ్లౌజ్‌లు పరీక్ష సెంటర్‌లో అందు బాటులో ఉంటుందన్నారు.


జిల్లాలో మొత్తం 46 కేంద్రాలలో 7787 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు. కరోనా నివారణకు గాను అన్ని పరీక్ష కేంద్రాలలో ప్రతి రోజు పరీక్ష హాల్‌ను హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్ర పర్చాలన్నారు. విద్యార్థులు పాత హాల్‌ టికెట్‌ నంబర్లతోనే పరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. తమ హాల్‌ టికెట్‌ నెంబర్‌ను ఆన్‌లైన్‌ డీఈఓకేబీఎస్‌ఎఫ్‌.వెబ్‌.కంలో నమోదు చేసినట్లయితే తమకు కేటాయించిన పరీక్ష సెంటర్‌ పేరు వస్తుందన్నారు. ఒక బెంచీకి ఒక విద్యార్థి మాత్రం ఉంటారన్నారు. గతంలో పరీక్షకు విధులు నిర్వహించిన వారితో పాటు అదనంగా 140 మంది అవసరం ఉంటుందన్నారు. అలాగే గతంలో వాంకిడి మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు అదనంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కేజీబీవీ సెంటర్‌ను బంబార ఆశ్రమ స్కూల్‌కు మార్పు చేసినట్లు తెలిపారు. 


‘పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు’

ఆసిఫాబాద్‌, జూన్‌4: ఈనెల 8నుంచి జరిగే పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ కుమరం బాలు అన్నారు. గురువారం కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశాల మేరకు వసతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థులకు థర్మల్‌ స్కానర్‌తో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌-19 కారణంగా విద్యార్థులు, సిబ్బంది  మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సత్యనారాయణ, డాక్టర్‌ ప్రేంసాగర్‌, సూపర్‌వైజర్‌ రాజేశ్వరి పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-05T10:55:39+05:30 IST