ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు

ABN , First Publish Date - 2020-03-30T09:12:20+05:30 IST

రబీ పంట చేతికొస్తోంది. మెట్ట ప్రాంతాల్లో మసూళ్లు ప్రారంభం కానున్నాయి. మరో రెండు వారాల్లో డెల్టాలోనూ ధాన్యం పంట తయారు

ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు

  రబీలో 10 లక్షల టన్నుల లక్ష్యం

  అవసరాన్ని బట్టి పెంపు  

  ఎఫ్‌సీఐకి 4.70 లక్షల టన్నుల బియ్యం

  పౌరసఫరాల కార్పొరేషన్‌ 2 లక్షల టన్నుల బియ్యం సేకరణ


 (తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి)

 రబీ పంట చేతికొస్తోంది. మెట్ట ప్రాంతాల్లో మసూళ్లు ప్రారంభం కానున్నాయి. మరో  రెండు వారాల్లో  డెల్టాలోనూ ధాన్యం పంట తయారు కానుంది. కరోనా ప్రభావం వరి పంటపై లేకుండా అధికార యంత్రాంగం సన్నాహాలు చేసింది. ఏప్రిల్‌ ఒకటో తేదీనుంచి కొనుగోళ్లు ప్రారంభించనుంది. ఆరుతడి ధాన్యం మద్దతు ధరకే కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం పాఠశాల ఆవరణలు అదుబాటులో ఉన్నాయి. ధాన్యం ఆరబెట్టేందుకు ఎటువంటి ఇబ్బంది లేదు. వరికోత యంత్రాలతో ఒబ్బిడి చేసిన ధాన్యాన్ని తక్షణమే వ్యాపారులకు విక్రయిస్తే తేమ శాతం పేరుతో ధరలో కోత పడే అవకాశం ఉంది. దళారులకు ఆ అవకాశం ఇవ్వకుండా ఆరుతడి ధాన్యాన్ని అమ్మకానికి తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. రబీలో పూర్తి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది.


ప్రస్తుతానికి జిల్లాలో 10 లక్షల టన్నుల రబీ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. అవసరాన్ని బట్టి లక్ష్యాన్ని పెంచనున్నారు. ఖరీఫ్‌లో ఏర్పాటు చేసిన 342 కేంద్రాలను మళ్లీ కొనసాగించనున్నారు. అప్పట్లో లోపాలు ఉన్న కొనుగోలు కేంద్రాలను ఈ సారి తప్పించాలన్న భావనతో అధికారులు ఉన్నారు. ధాన్యం అందుబాటులో కి వచ్చిన ప్రాంతాల్లో ముందుగా కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. 


ఎఫ్‌సిఐకి అధిక బియ్యం

 రబీలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి అత్యధిక బియ్యాన్ని భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)కు అప్పగించనున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసే 10 లక్షల టన్నుల నుంచి మిల్లర్లు 6.7 లక్షల టన్నుల బియ్యాన్ని అప్పగించాలి. అందులో రెండు లక్షల టన్నుల బియ్యం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ భద్ర పరచనుంది. మిగిలిన 4.7 లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌సీఐ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేశారు. 


 గోదాముల సమస్య

 భారత ఆహార సంస్థ తీసుకోవాల్సిన 4.7 లక్షల టన్నుల బియ్యానికి సంబంధించి గోదాముల సమస్య ఉంది. భారత ఆహార సంస్థ వద్ద 2.50 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు మాత్రమే ఉన్నాయి. అందులోనూ బియ్యం నిల్వలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ర్టాలకు బియ్యం తరలిస్తేనే గోదాముల సమస్య నెరవేరనుంది. ఆ దిశగా భారత ఆహార సంస్థ కృషి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. అప్పుడే తమిళనాడు, కర్నాటక వంటి రాష్ర్టాలకు జిల్లానుంచి బియ్యం తరలి వెళ్లనున్నాయి. గోదాములు లభ్యత ఉంటుంది. 


మిల్లర్లకు పెండింగ్‌ బకాయిలు చెల్లింపు

రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. గడచిన ఖరీఫ్‌ కంటే ముందుగా ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించేందుకు పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఆదేశాలు జారీచేసింది. జిల్లాలో ప్రస్తుతం రూ. 70 కోట్లు చెల్లించేందుకు ప్రణాళిక చేశారు. తక్షణం రూ. 20 కోట్లు విడుదల చేశారు. వాటిని మిల్లర్లకు చెల్లించే ప్రక్రియను చేపడుతున్నారు. ఖరీఫ్‌ బకాయిలు మాత్రమే పెండింగ్‌లో ఉంటాయి. మిగిలినవన్నీ చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. . 


బియ్యం తరలించేది ఎవరు

గతంలో మిల్లులనుంచి గోదాములకు మిల్లర్లే తరలించేవారు. జాతీయ స్థాయిలో మిల్లుల నుంచి తరలించే బాధ్యత మిల్లర్లకు లేదు. అందుకు సంబంధించి కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. దూరాన్ని బట్టి రవాణా చార్జీలు చెల్లిస్తారు. రాష్ట్రంలో మిల్లింగ్‌ ఛార్జీలు రూ.5లు అధికంగా ఉందన్న ఉద్దేశంతో 8 కిలోమీటర్ల లోపు ఉన్న గోదాములకు మిల్లర్లు ఉచితంగా బియ్యాన్ని అప్పగించాలి. ఆ విధానాన్ని రద్దు చేయాలని మిల్లర్లు ప్రతిపాదించారు. జాతీయస్థాయి విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.


దానిపై ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తమైంది. మిలర్లు గోదాములకు అప్పగించే బియ్యానికి రవాణా చార్జీలు చెల్లించనున్నారు. ఎంత దూరమైనాసరే రవాణా చార్జీలు చెల్లించాల్సిందే. అయితే మిల్లింగ్‌ ఛార్జీలో క్వింటాల్‌కు రూ.5లు తగ్గించనున్నారు. ఇప్పటివరకు బియ్యం అప్పగింతకు ఎంత మేర ఛార్జీలు చెల్లిస్తారనేది నిర్ణయించాల్సి ఉంది. రైతులనుంచి ధాన్యం కొనుగోలుకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. 

Updated Date - 2020-03-30T09:12:20+05:30 IST