ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు

ABN , First Publish Date - 2021-03-05T06:01:25+05:30 IST

యాసంగి దిగుబడి అధికంగా వస్తుందనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్న క్రమంలో కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వ ప్రకటనలు అయోమయానికి గురి చేశాయి.

ధాన్యం  కొనుగోళ్లకు  సన్నాహాలు

- వచ్చే నెలలో ధాన్యం దిగుబడి 

- యాక్షన్‌ ప్లాన్‌ కోరిన ప్రభుత్వం

- జిల్లా పౌర సరఫరాల శాఖ ద్వారా కొనుగోళ్లకు ఏర్పాట్లు 

- పెరిగిన యాసంగి సాగు 

- దిగుబడి అంచనా 3.78 లక్షల మెట్రిక్‌ టన్నులు 

- జిల్లాలో 227 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

యాసంగి దిగుబడి అధికంగా వస్తుందనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్న క్రమంలో కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వ ప్రకటనలు అయోమయానికి గురి చేశాయి.  ప్రస్తుతం యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పౌర సరఫరాల శాఖ సన్నాహాలు ప్రారంభించింది. జిల్లా వారిగా ధాన్యం దిగుబడి, కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలపై సమాచారం సేకరించాలని ఆదేశించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సరఫరాల అధికారులు కొనుగోళ్లకు సంసిద్ధమయ్యారు. యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించి ప్రభుత్వానికి పంపించారు.  

జిల్లాలో దిగుబడి అంచనా 3.78 లక్షల మెట్రిక్‌ టన్నులు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు భారీగా పెరగడంతో రబీ  సీజన్‌లో 1.68 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో వరి 84,109 మంది రైతులు 1.65 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. వరి సాగులో జిల్లాలో 3.78 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 28,826 మెట్రిక్‌ టన్నులు స్థానికంగా కొనుగోలుతో విత్తనాల కోసం వెళ్తుందని అంచనా వేశారు. 50 వేల మెట్రిక్‌ టన్నులు మిల్లర్లు కొనుగోలు చేస్తే 3 లక్షల మెట్రిక్‌ టన్నులు పౌర సరఫరాల శాఖ నుంచి కొనుగోలు చేయడానికి యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు.  ఏప్రిల్‌లో 75 వేల మెట్రిక్‌ టన్నులు, మేలో 1.50 లక్షల మెట్రిక్‌ టన్నులు, జూలైలో 75 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. 


227 కొనుగోలు కేంద్రాలు 

కొవిడ్‌ నేపథ్యంలో రైతులకు అందుబాటులోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 227 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేశారు. ఐకేపీ ద్వారా 62 కేంద్రాలు, సింగిల్‌ విండోల ద్వారా 151 కేంద్రాలు, డీసీఎంస్‌ ద్వారా 7 కేంద్రాలు, మెప్మా ద్వారా 2 కేంద్రాలు, మార్కెట్‌ యార్డుల ద్వారా 5 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.  కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సమయంలో 6810 టార్ఫాలిన్లు, ఇన్నోవింగ్‌ మిషన్లు 167, పాడీ క్లీనర్లు 681, మ్యాచరైజ్‌ మీటర్లు 227, వేయింగ్‌ మిషన్స్‌ 457,  గన్నీ బ్యాగులు 75 లక్షల అవసరం కానున్నాయి. 31 లక్షల 70 వేల గన్నీ బ్యాగులు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నాయి. 43 లక్షల 60 వేల బ్యాగులను సమకూర్చుకుంటున్నారు. జిల్లాలోని 74 రైస్‌మిల్లులకు ధాన్యాన్ని పంపించనున్నారు. ఇందులో 43 రా రైస్‌మిల్లులు, 31 బాయిల్డ్‌ రైస్‌మిల్లులు ఉన్నాయి. 



Updated Date - 2021-03-05T06:01:25+05:30 IST