ఇంటర్‌ పరీక్షలకు సన్నాహాలు పూర్తి

ABN , First Publish Date - 2021-10-22T04:54:22+05:30 IST

ఇంటర్‌ పరీక్షలకు సన్నాహాలు పూర్తి

ఇంటర్‌ పరీక్షలకు సన్నాహాలు పూర్తి
వికారాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

  • వికారాబాద్‌ జిల్లాలో 29, మేడ్చల్‌ జిల్లాలో 167 పరీక్షా కేంద్రాలు 
  • పర్యవేక్షణకు ప్రత్యేక తనిఖీ బృందాలు 
  • కొవిడ్‌ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేసిన అధికారులు


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి/మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): జిల్లాలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 25వ తేదీన ప్రారంభం కానున్న ఈ పరీక్షలు వచ్చేనెల 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కొవిడ్‌ ఉధృతి కారణంగా గతేడాది ప్రత్యక్ష పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. అయితే పరీక్షలకు ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుండా ఉండేందుకు ఈ ఏడాది పరీక్షలు ఎలాగైనా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 29 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈ కేంద్రాల్లో 9239 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. వికారాబాద్‌లో 8, తాండూరులో 8, పరిగిలో 5. కులకచర్లలో 2 కేంద్రాలు ఏర్పాటు చేయగా, కొడంగల్‌, దోమ, పెద్దేముల్‌, మోమిన్‌పేట్‌, మర్పల్లి, నవాబ్‌పేట్‌ల్లో ఒక్కో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. పోలీసు భద్రత మొదలుకుని విద్యార్థులకు రవాణాపరమైన ఇబ్బందులు ఎదురు కాకుండా అవసరమైన చర్యలు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. 

బెంచీకి ఇద్దరు విద్యార్థులు..

జిల్లాలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక్కొక్కరు వంతున 29 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 29 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, 450 మంది వరకు ఇన్విజిలేషన్‌ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. పరీక్షలు సజావుగా కొనసాగేలా పర్యవేక్షించేందుకు రెండు సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, ఒక ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, ఒక డెక్‌ బృందాలు ఏర్పాటు చేశారు.  ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థి కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఒక్కో బెంచీకి ఇద్దరు విద్యార్థులను కూర్చోబెట్టనున్నారు. విద్యార్థుల్లో ఎవరికైనా కొవిడ్‌ లక్షణాలు ఉంటే వారి కోసం పరీక్షా కేంద్రంలో ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. పరీక్ష సమయంలో విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకోనున్నారు. 



పకడ్బందీ ఏర్పాట్లు చేయండి : మంత్రి సబితారెడ్డి

ఈనెల 25వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఇంటర్‌ విద్యా కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌తో కలిసి ఆమె  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మేడ్చల్‌ జిల్లాలో 167 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ హరీష్‌ మంత్రికి వివరించారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఈనెల 25 నుంచి నవంబరు 2 వరకు ప్రత్యేక బృందాలు పర్యటించనున్న నేపథ్యంలో  కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో డీఆర్‌డీవో పద్మాజారాణి, సీఈవో, డీపీవో, అధికారులు పాల్గొన్నారు. కాగా, వీడియో కాన్ఫరెన్స్‌లో వికారాబాద్‌ అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ పాల్గొన్నారు. ఉదయం 8.30 గంటల్లోగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఆ తరువాత అనుమతించబోమన్నారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మోతీలాల్‌ మంత్రికి వివరించారు. పరీక్షల సమయంలో జిరాక్స్‌ సెంటర్లు మూసివేసేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. సమావేశంలో ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి శంకర్‌, అదనపు ఎస్పీ రషీద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T04:54:22+05:30 IST