Abn logo
Oct 22 2021 @ 23:42PM

టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో సన్నాహక జోష్‌

హైదరాబాద్‌కు తరలివెళ్లిన టీఆర్‌ఎస్‌ జిల్లా నేతలు

వరంగల్‌ మహాసభకు భారీగా తరలిరావాలని పిలుపు

ప్రభుత్వ పథకాల ప్రచార బాధ్యత కార్యకర్తలదేనన్న అధిష్ఠానం

టీఆర్‌ఎస్‌ నేతలకు దిశానిర్దేశం చేసిన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

ఆదిలాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం జిల్లా నేతల్లో జోష్‌ను నింపింది. టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో నిర్వహించిన నియోజక వర్గ స్థాయి సన్నాహక సమావేశానికి టీఆర్‌ఎస్‌ జిల్లా నేతలు హాజరయ్యారు. ఆదిలాబాద్‌, బోథ్‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ నియోజక వర్గాల నుంచి ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపూరావు, రేఖానాయక్‌, ఆత్రం సక్కులతో పాటు జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, టీడీడీసీ చైర్మన్‌ లోక భూమారెడ్డి, రైతుబంధు జిల్లా చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు హాజరయ్యారు. ప్రతీ నియోజక వర్గం నుంచి 20 మంది నేతలు మాత్రమే సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. అయితే కొంతమంది సీనియర్‌ నాయకులకు అధిష్ఠానం నుంచి పిలుపు రాకపోవడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారుతోంది. అధిష్ఠానం ఆదేశాల మేరకే పరిమిత సంఖ్యలో సమావేశానికి నేతలను ఆహ్వానించినా.. కొందరు ఎమ్మెల్యేలు కావాలనే వ్యతిరేక వర్గానికి చెందిన నేతలను పక్కన పెట్టించారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశానిర్దేశంతో జిల్లా అధికార పార్టీ నేతల్లో కొంత జోష్‌ కనిపిస్తోంది. 

గ్రామానికి 50 మంది..

ఈ నెల 25న నిర్వహించనున్న ప్లీనరి తర్వాత నవంబరు 15న వరంగల్‌లో నిర్వహించే మహాసభకు జిల్లాలోని ప్రతీ గ్రామం నుంచి 50 మంది తరలి రావాలని నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది. జిల్లాలోని 468 గ్రామ పంచాయతీలు, ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని 49 వార్డుల నుంచి సుమారుగా 25,850 మంది కార్యకర్తలు తరలివెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక బస్సుల్లో ప్రతి గ్రామం, వార్డుల నుంచి కార్యకర్తలను మహాసభకు తరలించనున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక తర్వాత మొదటి సారి వరంగల్‌లో భారీ ఎత్తున నిర్వహించే బహిరంగ సభను సక్సెస్‌ చేసేందుకు సిద్ధం కావాలని ఆదేశించినట్లు పేర్కొంటున్నారు. నియోజక వర్గ స్థాయి సన్నాహాక సమావేశంలో పెద్దగా జిల్లా రాజకీయాల జోలికి వెళ్లక పోయినా పార్టీ బలోపేతం పై ప్రత్యేక దృష్టిని సారించినట్లు చెబుతున్నారు. నియోజక వర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ప్రత్యేక బాధ్యతను తీసుకుని భారీ జన సమీకరణ చేయాలని సూచించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే జిల్లా అధికార పార్టీలో ఉన్న గ్రూపు విభేదాలతో నేతలంతా ఒకేతాటిపైకి వచ్చి పని చేయడం అనుమానంగానే కనిపిస్తోంది. నేతలంతా పైపైన భాగానే కనిపిస్తున్నా.. లోలోన మాత్రం ఒకరిపై ఒకరు రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజక వర్గాల్లో నేతలు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే పనిచేయడం పరిపాటిగానే మారింది.

పార్టీ కార్యకర్తలే కీలకం..

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పార్టీ శ్రేణులపైననే ఉందని అధిష్ఠానం పెద్దలు పేర్కొన్న ట్లు చెబుతున్నారు. ఎన్ని పథకాలు అమలు చేసిన ప్రజల్లోకి వెళ్లకుంటే పెద్దగా ఫలితం ఉండదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ముఖ్యంగా రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ, దళిత బంధు, గురుకులాల ద్వారా ఉచిత విద్య లాంటి పథకాలపై దృష్టి సారించాలని, అలాగే ప్రతిపక్షాల విమర్శలను  సమర్థవంతంగా తిప్పికొట్టే విధంగా నేతలు సిద్ధం కావాలని సన్నాహాక సమావేశంలో సూచించినట్లు తెలుస్తోంది. 

మరో 20ఏళ్ల పాటు పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, కొత్తగా ఎన్నికైన వార్డు, గ్రామ, మండల, జిల్లా కమిటీలు చురుకుగా పనిచేస్తూ నిత్యం ప్రజల మధ్య ఉండాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆదేశించినట్లు జిల్లా నేతలు పేర్కొంటున్నారు. అలాగే నేడో, రేపో జిల్లా నుంచి ప్లీనరీకి హాజరయ్యే నేతల జాబితా కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.