పోరుబాటకు విద్యుత్‌ కార్మికులు సిద్ధం

ABN , First Publish Date - 2020-09-24T08:49:40+05:30 IST

విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి విద్యుత్‌ కార్మిక సంఘాలు పోరుబాటకు

పోరుబాటకు విద్యుత్‌ కార్మికులు సిద్ధం

నేడు లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు ధర్నా


రెవెన్యూ కాలనీ, సెప్టెంబరు 23: విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి విద్యుత్‌ కార్మిక సంఘాలు పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. కార్మికులను పర్మినెంట్‌ చేయాలని విద్యుత్‌ కార్మిక సంఘాలు ఉద్యమించి 23,647 మంది కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించేందుకు కృషిచేశాయి. కానీ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి మూడేళ్లు గడుస్తున్నా క్రమబద్ధీకరించడం లేదని కార్మిక సంఘాలు గుర్రుగా ఉన్నాయి. సీఐటీయూ అనుబంధ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీఎస్‌యూఈఈయూ) ఆధ్వర్యంలో పోరుబాటకు సిద్ధమైంది. బుధవారం హైదరాబాద్‌లోని లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.


గురువారం వరంగల్‌ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు సిద్ధమవుతున్నారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో లేనివిధంగా తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో రెండు వేర్వేరు సర్వీసురూల్స్‌ తీసుకురావడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. స్టాండింగ్‌ఆర్డర్స్‌ పూర్తిగా తొలగించి కార్మికులందరికీ పర్మినెంట్‌ ఉద్యోగుల మాదిరిగా ఒకే సర్వీస్‌రూల్స్‌ అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వాస్తవానికి పర్మినెంట్‌ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా.. తమకు ఏపీఎస్‌ఈబీ రూల్స్‌ అందడం లేదని వాపోతున్నారు.  డిమండ్ల సాధన కోసం ఉద్యమబాటే శరణ్యమని కార్మికులు భావిస్తున్నారు. తమతో వచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. 


ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి- సీఐటీయూ నాయకుడు ప్రభాకర్‌రెడ్డి 

 ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు ప్రభాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు ఆర్టిజన్‌ పేరుతో ప్రత్యేక చట్టాన్ని తెచ్చి హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. ఒకే సంస్థలో రెండు రకాల చట్టాలు ఎలా అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి ఆర్టిజన్లకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-09-24T08:49:40+05:30 IST