ఆకు సేకరణకు అంతా సిద్ధం!

ABN , First Publish Date - 2021-02-28T05:27:12+05:30 IST

జిల్లాలో తునికి ఆకు సేకరణకు అటవీ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లా భౌగోళిక విస్తీర్ణం 4,153 చదరపు కి..మీ. కాగా, జిల్లాలో అటవీ ప్రాంతం 1706.89 చదరపు కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది.

ఆకు సేకరణకు అంతా సిద్ధం!
ఆదిలాబాద్‌ జిల్లా అటవీ శాఖ కార్యాలయం

ఏర్పాట్లు పూర్తి చేసిన అటవీ శాఖ

ఈయేడు 7500 స్టాండర్డ్‌ బ్యాగుల తునికి ఆకు లక్ష్యం 

కొనసాగుతున్న ఆన్‌లైన్‌ టెండర్లు

జిల్లాలో 12 యూనిట్లకు 8 యూనిట్లు సేల్‌

గ్రామీణ నిరుపేదలకు అదనంగా ఆదాయ మార్గం

మార్చి 2 వరకు ముగియనున్న టెండర్ల గడువు

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తునికి ఆకు సేకరణకు అటవీ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లా భౌగోళిక విస్తీర్ణం 4,153 చదరపు కి..మీ. కాగా, జిల్లాలో అటవీ ప్రాంతం 1706.89 చదరపు కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది. ఆదిలాబాద్‌, ఇచ్చోడ, ఉట్నూర్‌ సబ్‌ డివి జన్‌ల పరిధిలో ఆకు సేకరణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదిలాబాద్‌ డివిజన్‌లో 7, ఇచ్చోడ 3, ఉట్నూర్‌లో 2 మొత్తం 12 యూనిట్లకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను ప్రారం భించారు. ఈయేడు 7,500 స్టాండర్డ్‌ బ్యాగుల ఆకు సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే యేటేటా అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో ఆకు సేకరణ లక్ష్యం కూడా గణనీయంగా తగ్గింది. గతేడు 14,230 స్టాండర్డ్‌ బ్యాగుల లక్ష్యం పెట్టుకోగా ఈసారి 7,500  బ్యాగుల లక్ష్యం మాత్రమే కనిపిస్తోంది. ఈ సీజన్‌లో పూర్తిస్థాయిలో ఆకు సేకరణ చేయాలన్న ఉద్దేశంతో అధికారులున్నారు. ఈ సంవత్సరం ఒక్కో స్టాండర్బ్‌ బ్యాగు ధర రూ.1800 నిర్ణయించగా గిట్టుబాటు కావడం లేదంటూ రూ.2 వేల వరకు పెంచాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. మార్చి 2వరకు టెండర్లను ముగించి, 5నుంచి ఆకు సేకరణ ప్రక్రియను ప్రారంభించేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. ఈసారి వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావడంతో ఆకు సేకరణ ఆశాజనకంగానే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని యూనిట్లలో కొమ్మకొట్టడం(చాక్‌తరస్‌) ప్రక్రియను మొదలు పెట్టారు. ఊపందుకున్న ఉపాధితో కూలీలు ఉదయం కూలీ పనులకు వెళ్తు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అడవిలో ఆకును సేకరిస్తూ అదనంగా ఆదాయం పొందుతున్నారు. జిల్లా అటవీ ప్రాంతంతో పాటు బీడు, పోడు భూముల్లో లభ్యమయ్యే తునికాకులు ఎంతో నాణ్యతగా ఉండడంతో వీటికి భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో జిల్లాలో టెండర్లను దక్కించుకునేందుకు కాంట్రాక్టర్‌లు పోటీ పడుతుంటా రు. బీడీలను తయారు చేసేందుకు జిల్లా నుంచి తునికి ఆకును బర్మా, బంగ్లాదేశ్‌లతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లకు ఎగుమతి చేస్తారు.

2లక్షల మంది కూలీలకు ఉపాధి

ఇప్పటికే యాసంగి వ్యవసాయ పనులను ముగించుకున్న గ్రామీణ కూలీలకు తునికి ఆకు సేకరణ ఉపాధి మార్గంగా మారింది. నిత్యం ఒకొక్కరు రూ.300 నుంచి 400 వరకు సంపాదించే అవకాశం ఉంది. ఈ వేసవిలో జిల్లాలోని దాదాపు రెండు లక్షల మందికి పైగా కూలీల కు ఆకు సేకరణతో ఉపాధి దక్కనుంది. నిత్యం కూలీలు చెట్టూ, గుట్ట లను తిరుగుతూ బీడీల ఆకులను సేకరిస్తారు. ఇలా సేకరించిన ఆకులను ఇంటి వద్ద కట్టలుగా కట్టి అటవీ శాఖ ఏర్పాటు చేసి న కళ్లాలకు తరలిస్తారు. 3 నెలల పాటు ఆకును సేకరించి న అనంతరం వచ్చే వానాకాలం సీజన్‌ పనుల్లో నిమగ్నమవుతారు. అయితే తునికి ఆకు సేకరణపై మారుమూల గ్రామాల ప్రజలకు అవగాహన లేకపోవడంతో ప్రమాదాల బారీన పడు తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. వడదెబ్బతో పాటు ఎలుగుబంట్లు, విషసర్పాల బారీన పడుతున్నారు. ఆకు సేకరించే సమయంలో ప్రమాదవశాత్తు గాయపడిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నా.. అలాంటి పథకాలు పేదల ధరికి చేరడం లేదంటున్నారు. అటవీ శాఖ అధికారులు గ్రామస్థాయిలో అవగాహన సదస్సు నిర్వహిస్తే పేద ప్రజలకు ప్రయోజనం కలుగనుందంటున్నారు. 

మరో 4 యూనిట్లకు టెండర్లు

జిల్లాలో మొత్తం 12 యూనిట్లకు గాను ఆదిలాబాద్‌ డివిజన్‌లో ఆరు యూనిట్లు, ఉట్నూర్‌ డివిజన్‌లో రెండు యూనిట్లకు టెండర్లు పూర్తయ్యాయి. మరో నాలుగు యూనిట్లకు టెండర్‌ ప్రక్రియ  పూర్తి కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్‌లు కొత్త ఎత్తుగడలను వేస్తున్నారు. అసలు టెండర్లు దక్కించుకున్నా..  అటవీ ప్రాంతం పరిధిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఆకు సేకరణకు సిద్ధమవుతున్నట్లు వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా కాంట్రాక్టర్‌లు గుట్టుచప్పుడు కాకుండా అడవికి నిప్పంటిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొమ్మకొట్టడం అధికఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఇలా చేస్తే నష్టపోతామని భావిస్తున్న కాంట్రాక్టర్‌లు అడవికి నిప్పంటిస్తున్నారు. దీంతో తునికాకు చెట్టు మొదలు కాలిపోవడంతో కొత్తగా ఆకులు చిగురిస్తాయి. కాంట్రాక్టర్‌ల ఇష్టారాజ్యంతో యేటా కోట్ల విలువైన అటవీ సంపద కాలిబూడిదవుతుందన్న ఆరోపణలు లేకపోలేదు.

టెండర్‌ ప్రక్రియను ప్రారంభించాం

: చంద్రశేఖర్‌, ఇన్‌చార్జి డీఎఫ్‌వో, ఆదిలాబాద్‌

జిల్లాలో తూనికాకు సేకరణకు టెండర్‌ ప్రక్రియను ప్రారంభించాం. ఈ ప్రక్రియంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. మార్చిలో టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసి ఆకు సేకరణ ప్రక్రియను ప్రారంభిస్తాం. యూనిట్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు మార్చి చివరి నుంచి కొమ్మ కొట్టడం ప్రారంభిస్తే ఏప్రిల్‌లో ఆకు సేకరణ ఊపందుకుంటుంది.

Updated Date - 2021-02-28T05:27:12+05:30 IST