రైతు సంక్షేమంపై చర్చకు సిద్ధం

ABN , First Publish Date - 2022-01-12T07:54:45+05:30 IST

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పాలనలో రైతు సంక్షేమం కోసం చేట్టిన పథకాలపై చర్చకు రావాలంటూ మంత్రి కేటీఆర్‌ విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

రైతు సంక్షేమంపై చర్చకు సిద్ధం

  • కేటీఆర్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నా
  • తేదీ ఎప్పుడో ఆయనే ప్రకటించాలి: రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్‌, జనవరి 11(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పాలనలో రైతు సంక్షేమం కోసం చేట్టిన పథకాలపై చర్చకు రావాలంటూ మంత్రి కేటీఆర్‌ విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. చర్చకు తేదీని ఆయనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. చర్చకు సిద్ధమంటూ సవాళ్లు విసరడమో, తండ్రి చాటున దాక్కోవడమో, కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడమో కేటీఆర్‌కు అలవాటుగా మారిందని, ఇప్పుడేం చేస్తారో చూడాలని అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. గత కాంగ్రెస్‌ పాలనలో, ప్రస్తుతం కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్న రైతు పథకాలు ఏంటో చెప్పాలంటూ కేటీఆర్‌ సవాల్‌ విసిరారని, కానీ తెలంగాణ కంటే అద్భుతమైన పథకాలను ఛత్తీ్‌సగఢ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరపై రూ. 600 బోనస్‌ కూడా చెల్లిస్తోందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో దేశవ్యాప్తంగా రూ.70వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని, ధాన్యం మద్దతు ధరను రూ. 1060కు పెంచామని, మొక్కజొన్నలు, ఎర్రజొన్నలు, పసుపు, మిర్చి, పత్తి రైతులకు కూడా కనీస మద్దతు ధర కల్పించామని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నో రైతు సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు.  రాష్ట్రంలో రైతు హంతకులుగా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు మారారని, వేలాది మంది రైతులు చనిపోవడానికి కారణమయ్యారని ఆరోపించారు.  


బీజేపీ సమావేశాలకు ఎలా అనుమతులిస్తున్నారు? 

ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయురాలి కుటుంబానిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పరామర్శించడానికి వెళితే.. ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు.. బీజేపీ సమావేశాలకు మాత్రం ప్రతిరోజూ ఎలా అనుమతులిస్తున్నారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీలు బాయ్‌ బాయ్‌ అని, ఆ పార్టీల కుట్రను ప్రజలు గమనించాలని  మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. కాగా, తెలంగాణ.. దేశానికే దిక్సూచి అంటూ మంత్రి కేటీఆర్‌ అంటున్నారని, ఎందులో దిక్సూచి? అని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ ప్రశ్నించారు.  


గాంధీభవన్‌లో లాల్‌బహుదూర్‌ శాస్త్రికి నివాళి

దివంగత మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి వర్ధంతి సందర్భంగా గాంధీభవన్‌లో మంగళవారం ఆయన చిత్రపటానికి కాంగ్రెస్‌ నేతలు నివాళిని అర్పించారు. రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, హర్కార వేణుగోపాల్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-12T07:54:45+05:30 IST