ఉపాధ్యాయ బదిలీలకు సిద్ధం

ABN , First Publish Date - 2020-06-04T08:57:20+05:30 IST

ఎట్టకేలకు జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. జిల్లాలో 2017 తరువాత మరలా ఇప్పుడే బదిలీలు..

ఉపాధ్యాయ బదిలీలకు సిద్ధం

ఉద్యోగోన్నతులకు కూడా ఏర్పాట్లు 

జూలై 16 తర్వాత షెడ్యూల్‌ విడుదల

జిల్లాలో 4200 మందికి స్థానచలనం


గుంటూరు(విద్య), జూన్‌ 3: ఎట్టకేలకు జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. జిల్లాలో 2017 తరువాత మరలా ఇప్పుడే బదిలీలు, ఉద్యోగోన్నతులు జరుగుతుండటంతో ఉపాధ్యాయ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో జిల్లా స్థాయిలో బదిలీలకు ప్రాథమిక ఏర్పాట్లు చేయడానికి అధికారులు సిద్ధమౌతున్నారు. ఈసారి కూడా వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, జడ్పీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో దాదాపు 15 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిలో దాదాపు 4200 మందికిపైగా బదిలీల ద్వారా స్థాన చలనం కావచ్చునని సమాచారం. ప్రధానోపాధ్యాయులు అయితే ఐదేళ్లు, స్కూల్‌ అసిస్టెంట్‌ ఇతర క్యాడర్‌లో ఉన్న వారు ఎనిమిదేళ్లు ఒకే చోట ఉంటే బదిలీ తప్పదు. బదిలీలతోపాటు ఒకేసారి సర్దుబాటు(రేషనలైజేషన్‌) ప్రక్రియ ప్రారంభం కానుంది. దీని ప్రకారం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేస్తారు.


స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు, హిందీ, పీటీ తదితర పోస్టులను అప్‌గ్రేడ్‌ చేసి ఉద్యోగోన్నతులు కల్పించనున్నారు. డీఈవో పూల్‌లో ఉన్న పండిట్స్‌కు సీనియార్టీ ఆధారంగా ఉద్యోగోన్నతి కల్పిస్తారని సమాచారం. బదిలీలు, ఉద్యోగోన్నతుల్లో గుండె జబ్బులు, క్యాన్సర్‌ తదితర వ్యాధులతో బాధపడేవారికి, వితంతువులకు, విడాకులు తీసుకున్న టీచర్లకు, 40 శాతం అంగవైకల్యం ఉన్న వారికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. స్కౌట్స్‌, ఎన్‌సీసీ, ఆర్మ్‌డు సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు మొదటి ప్రాధాన్యం కల్పించనున్నారు. 


యూపీ స్కూల్స్‌లో తీరనున్న ఉపాధ్యాయుల కొరత

జిల్లాలో దాదాపు 150 ప్రాథమికోన్నత(యూపీ) పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ప్రస్తుతం ఎస్‌జీటీ స్థాయి ఉపాధ్యాయులతోనే నెట్టుకు వస్తున్నారు.  బదిలీలు, ఉద్యోగోన్నతుల ద్వారా ఈ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టులు స్కూల్‌ అసిస్టెంట్స్‌తో భర్తీ కానున్నాయి. దీంతో ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత పూర్తిస్థాయిలో తీరే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకుడు, విశ్రాంత ఉపాధ్యాయులు సీవీఎస్‌ మణి తెలిపారు. 


ఉపాధ్యాయ సంఘాల హర్షం

ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతుల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంపై పీఆర్‌టీయూ అధ్యక్ష, కార్యదర్శులు కే ఆనందరావు, జీవీఎస్‌ రామకృష్ణ, హిందీ ఉపాధ్యాయ సంఘం అఽధ్యక్ష, కార్యదర్శులు వనిమిరెడ్డి విజయకుమార్‌, మేడికొండ సదానందబాబు వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు. యూపీ స్కూల్స్‌కు నాలుగు స్కూల్‌ అసిస్టెంట్స్‌ పోస్టులు మంజూరు చేయాలని కోరారు. డీఈవో పూల్‌లో ఉండి క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌పోస్టుల జీతాలు తీసుకుంటున్న హిందీ, తెలుగు భాషోపాధ్యాయులకు కూడా ఉద్యోగోన్నతులు ఇవ్వాలన్నారు. ఎన్నో ఏళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న 4వేల మందికి ఉపశమనం కలగనుందని తెలిపారు.  

Updated Date - 2020-06-04T08:57:20+05:30 IST