రైలు ప్రయాణానికి సిద్ధం

ABN , First Publish Date - 2020-06-01T10:15:39+05:30 IST

చాన్నాళ్ల తర్వాత సాధారణ ప్రయాణికులు మళ్లీ రైలెక్కే అవకాశం వచ్చింది.

రైలు ప్రయాణానికి సిద్ధం

నేటి నుంచి పట్టాలపైకి ‘సంఘమిత్ర’ 

టికెట్‌ కన్ఫామ్‌ అయిన వారికే అనుమతి

భౌతిక దూరం, మాస్క్‌లు, స్ర్కీనింగ్‌ తప్పనిసరి 

దుప్పట్లు, ఆహారం ప్రయాణికులే తెచ్చుకోవాలి


నెల్లూరు (వెంకటేశ్వరపురం), మే 31 : చాన్నాళ్ల తర్వాత సాధారణ ప్రయాణికులు మళ్లీ రైలెక్కే అవకాశం వచ్చింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 21 నుంచి నిలిచిపోయిన  రైళ్ల సర్వీసులు రెండు నెలల తర్వాత పునఃప్రారంభం కానున్నాయి. జూన్‌ 1 (నేటి) నుంచి దేశవ్యాప్తంగా నడుపుతున్న ప్రత్యేక రైళ్లలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ జిల్లా మీదుగా వెళ్లనుంది.  దానాపూర్‌ నుంచి విజయవాడ మీదుగా బెంగళూరు వెళ్లే ఆ రైలుకు నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగనుంది. బెంగళూరు వెళ్లేటప్పుడు ఉదయం 9.30 గంటలకు, దానాపూర్‌ వెళ్లేటప్పుడు సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుతుంది. రైల్వే ప్రయాణాల పునరుద్ధరణ నేపథ్యంలో కరోనా వైరస్‌ నియంత్రణకు రైల్వేశాఖ కొన్ని నిబంధనలు విధించింది. వాటిని ప్రయాణికులు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.


అవేమిటంటే..

  • ప్రయాణానికి కనీసం గంటన్నర ముందే స్టేషన్‌కు రావాలి.
  • ధ్రువీకరించిన టికెట్‌ ఉన్న ప్రయాణికులకు మాత్రమే స్టేషన్‌లోకి అనుమతి.
  • తప్పనిసరిగా స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలి.
  • ఎలాంటి జ్వర లక్షణాలు లేని వారినే రైలులోకి అనుమతిస్తారు.
  • కరోనా లక్షణాలు ఉంటే ప్రయాణికుడి టికెట్‌ నగదు 100 శాతం తిరిగి చెల్లిస్తారు.
  • రైల్వేస్టేషన్‌, రైలులోనూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి, మాస్క్‌లు ధరించాలి.
  • ప్రయాణికులు వారి వెంట ఆహారం, తాగునీటిని తెచ్చుకోవడం మంచిది.
  • రైలు లోపల దుప్పట్లు, దిండు ప్రయాణికులే తెచ్చుకోవాలి.
  • ఏసీ కోచ్‌లలో ఉష్ణోగ్రతను సాధార ణంగా నియంత్రించి ఉంటుంది. 
  • పరిమిత రైళ్లలో మాత్రమే ప్రయాణికులకు నగదు తీసుకుని ఆహారం, తాగునీరు సరఫరా చేస్తారు.
  • రైల్వే స్టేషన్లలోని అన్ని స్టాటిక్‌ క్యాటరింగ్‌ , వెండింగ్‌ యూనిట్లు తెరిచి ఉంటాయి.
  • వీలైనంత వరకు తేలికపాటి లగేజితో ప్రయాణిస్తే బాగుంటుంది. 
  • గమ్యస్థానం చేరాక ఆయా రాష్ట్రాలు సూచించిన ఆరోగ్య ప్రొటోకాల్‌కు కట్టుబడి ఉండాలి.

Updated Date - 2020-06-01T10:15:39+05:30 IST