వ్యవసాయ ప్రణాళిక సిద్ధం

ABN , First Publish Date - 2020-05-26T05:32:04+05:30 IST

నియంత్రిత వ్యవసాయ విధానానికి అనుగుణంగా వానాకాలం వ్యవసాయ ప్రణాళిక సిద్ధమైంది

వ్యవసాయ ప్రణాళిక సిద్ధం

ఉమ్మడి జిల్లాలో వరిసాగుకు ఢోకాలేదు

మాయమై పోతున్న మొక్కజొన్న 

కరీంనగర్‌లో పత్తి, పెసరపై దృష్టి 

జగిత్యాలలో కంది పంటకు ప్రాధాన్యం


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

నియంత్రిత వ్యవసాయ విధానానికి అనుగుణంగా వానాకాలం వ్యవసాయ ప్రణాళిక సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి, వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులతో జరిపిన సమీక్షల అనంతరం వ్యవసాయశాఖ జిల్లాల వారిగా ప్రణాళిక రూపొందించింది. గోదావరి జిల్లాలకు ధీటుగా వరి ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తున్న పాత కరీంనగర్‌ జిల్లా పరిధిలో వరిసాగుకు ఢోకాలేదని తేలి పోయింది. గత వానాకాలంలో జరిగిన సాగు మేరకే వరిని పండించాలని మొక్కజొన్న పంట అసలే వేయవద్దని కంది, పెసర లాంటి పప్పుదినుసులు పత్తిసాగుపై దృష్టిసారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో గత వానాకాలంతో పోలిస్తే 33,164 ఎకరాల్లో వరి సాగు పెరుగనున్నది.


గత వానాకాలం 86,774 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరుగగా ఈసారి ఆ పంట పూర్తిగా కనుమరుగుకానున్నది. ఈ వానాకాలం నూతన ప్రణాళిక మేరకు 7,53,229 ఎకరాల్లో వరి, 3,50,151 ఎకరాల్లో పత్తి, 34,257 ఎకరాల్లో కంది, 13,145 ఎకరాల్లో పెసర పంటలు సాగుకానున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే 32,115 ఎకరాల్లో కంది, పెసర పంటలు, 31,523 ఎకరాల్లో పత్తి, 33,164 ఎకరాల్లో వరి, 9 వేల ఎకరాల్లో ఇతర పంటలు, కూరగాయలు, తదితర పంటలు అదనంగా సాగుకానున్నాయి.


జిల్లాలో ఈ వానాకాలం వరిసాగులో సుమారు 35శాతం అంటే 2.50 లక్షల ఎకరాల్లో సన్న రకాలను సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. తెలంగాణ సోనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ హెచ్‌ఎంటీ, బీపీటీ, జైశ్రీరాం లాంటి రకాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అలాగే వరి విత్తన ఉత్పత్తి సాగుపైన కూడా దృష్టిసారించి విత్తన ఉత్పత్తిలో జిల్లా అగ్రగామిగా నిలిచేలా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నది. 


కరీంనగర్‌ జిల్లాలో ఈ వానాకాలం 2,22,199 ఎకరాల్లో వరి, 1,00,979 ఎకరాల్లో పత్తి, 3వేల 50 ఎకరాల్లో కంది, 5,902 ఎకరాల్లో పెసర, 8,888 ఎకరాల్లో ఇతర పంటలు ప్రధానంగా కూరగాయల సాగుపై ప్రభుత్వం దృష్టిసారించింది. గత వానాకాలంతో పోలిస్తే 23,908 ఎకరాల్లో వరి, 10,692 ఎకరాల్లో పతి, 743 ఎకరాల్లో కంది, 4,900 ఎకరాల్లో పెసర సాగు పెరుగనున్నది. 


పెద్దపల్లి జిల్లాలో గత వానాకాలంతో పోలిస్తే వరి సాగు విస్తీర్ణంలో తేడా లేదు. 1,92,651 ఎకరాల్లో వరి, 1337 ఎకరాల్లో కంది, 81,172 ఎకరాల్లో పత్తి, 30 ఎకరాల్లో జొన్న, 474 ఎకరాల్లో పెసర, 165 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయాలని నిర్ణయించారు.


జగిత్యాల జిల్లాలో కూడా వరి సాగు విస్తీర్ణంలో తేడా లేదు. గతంలో మాదిరిగానే 2,28,379 ఎకరాల్లో వరి సాగు చేయాలని నిర్నయించారు. కందిపంటపై ప్రత్యేక దృష్టిసారించి గతంలో కంటే 18వేల ఎకరాల్లో అదనంగా ఈ పంటను సాగు చేయాలని నిర్ణయించారు. 21,850 ఎకరాల్లో కంది, 1743 ఎకరాల్లో సోయా, 38 వేల ఎకరాల్లో పత్తి, 5769 ఎకరాల్లో పెసర, 685 ఎకరాల్లో చెరుకు, 400 ఎకరాల్లో ఇతర పంటలను సాగు చేయాలని ప్రణాళిక రూపొందించారు. 


రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,10,000 ఎకరాల్లో వరి సాగు చేయాలని నిర్ణయించారు. గత వానాకాలంతో పోలిస్తే ఇది 9,256 ఎకరాలు ఎక్కువ. 8వేల ఎకరాల్లో కంది, 25 ఎకరాల్లో సోయా, 1,30,000 ఎకరాల్లో పత్తి, 80 ఎకరాల్లో జొన్న, వేయి ఎకరాల్లో పెసర, 119 ఎకరాల్లో మినుము, 150 ఎకరాల్లో చెరుకు, 815 ఎకరాల్లో ఇతర పంటలను సాగుచేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. 

Updated Date - 2020-05-26T05:32:04+05:30 IST