ముందస్తు రిజిస్ట్రేషన్‌

ABN , First Publish Date - 2022-01-29T07:11:17+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్‌ ధరల పెంపు యోచనతో ఉమ్మడి జిల్లా రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు కొనుగోలుదారులు, అమ్మకందారులతో కిటకిటలాడుతున్నాయి.

ముందస్తు రిజిస్ట్రేషన్‌

భూముల రిజిస్ట్రేషన్‌ ఫీజు పెంచే యోచనలో ప్రభుత్వం 

ముందస్తుగానే రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్న కొనుగోలుదారులు

కిటకిటలాడుతున్న ఉమ్మడి జిల్లా సబ్‌ రిజిస్ర్టార్‌  కార్యాలయాలు  

1వ తేదీ నుంచి పెంపునకు అవకాశం 

ఆదేశాలు రాలేదంటున్న అధికారులు

నిజామాబాద్‌, జనవరి 28(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్‌ ధరల పెంపు యోచనతో ఉమ్మడి జిల్లా రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు కొనుగోలుదారులు, అమ్మకందారులతో కిటకిటలాడుతున్నాయి. ముందుస్తుగానే రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు కార్యాలయాల వద్ద బారులుతీరుతున్నారు. దీంతో నాలుగురోజులుగా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ర్టేషన్‌ ఫీజులు పెంచే అవకాశం ఉండడంతో ముందస్తుగా అనేక మంది రిజిస్ర్టేషన్‌ చేయించుకుంటున్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకోనివారు కూడా నేరుగా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు వచ్చి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ర్టేషన్‌లు చేయిస్తున్నారు. ప్రభుత్వం ఒకేసారి 40శాతం వరకు ఫీజులు పెంచే అవకాశం ఉండంతో ముందస్తుగా ఈ రిజిస్ర్టేషన్‌లు చేసుకుంటున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్‌లు కూడా గడిచిన నాలుగు రోజులుగా ఎక్కువగా జరుగుతున్నాయి. రిజిస్ర్టేషన్‌ల కోసం ఎక్కువ మంది స్లాట్‌ బుక్‌ చేసుకునేందుకు సిద్ధం కావడంతో కొన్నిసార్లు సర్వర్‌ కూడా డౌన్‌ కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఫ ఉమ్మడి జిల్లా పరిధిలో పది కార్యాలయాలు.. 

ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం పది సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ర్టేషన్‌లు జరుగుతున్నాయి. నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీంగల్‌, కామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడ పరిధిలో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రతి రోజూ 250 నుంచి 300 వరకు రిజిస్ర్టేషన్‌లు కాగా గడిచిన నాలుగు రోజులుగా 350 వరకు అయ్యాయి. ప్రతినెలా రిజిస్ర్టేషన్‌ రూపంలో రూ.12 నుంచి రూ.15 కోట్ల మధ్య ప్రభుత్వానికి  ఫీజు రూపంలో వస్తోంది. గడిచిన నాలుగు రోజులుగా పది సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్‌లు భారీగా పెరిగాయి. ప్లాట్స్‌, అపార్ట్‌మెంట్స్‌, ఇతర ఆస్తుల రిజిస్ర్టేషన్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. స్లాట్‌ బుక్‌చేయకున్న నేరుగా వచ్చి డాక్యుమెంట్‌ రైటర్స్‌ ద్వారా అదేరోజు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసి రిజిస్ర్టేషన్‌లు కొనసాగిస్తున్నారు. త్వరగా రిజిస్ర్టేషన్‌లు అయ్యేందుకు కొంత ఖర్చు చేస్తున్నారు. 

ఫ వ్యవసాయేతర ఆస్తులపైనా భారం..

ఉమ్మడి జిల్లాలో వ్యవసాయేతర ఆస్తులపైన భారీగానే భారం పడనుంది. నిజామాబాద్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం పరిధిలో వినాయక్‌నగర్‌, ఆర్యనగర్‌ పరిధిలో గజానికి రిజిస్ర్టేషన్‌ ఫీజు 4వేల వరకు ఉంది. 30శాతం పెరిగితే సుమారు 1200 వరకు భారం పడనుంది. నిజామాబాద్‌ రూరల్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ పరిధిలో ముబారక్‌నగర్‌, గంగాస్థాన్‌, మాణిక్‌భండార్‌ ప్రాంతంలో 1800 నుంచి 3వేల వరకు రిజిస్ర్టేషన్‌ ఫీజు ఉంది. ప్రస్తుతం 30శాతం పెరిగితే 900 వరకు భారం పడనుంది. సారంగపూర్‌, కాలూర్‌, అర్సపల్లి, ధర్మపురిహిల్స్‌, నాగారం పరిధిలో రిజిస్ర్టేషన్‌ ఫీజు రూ.800 నుంచి 2వేల వరకు ఉంది. 30శాతం పెరిగితే రూ.300 నుంచి 600 మధ్య పెరగనుంది. ఇదేవిధంగా అన్ని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల పరిధిలో ఫిబ్రవరి 1 నుంచి పెంచిన రేట్లు అమలులోకి రానున్నాయి. జిల్లాలో వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్‌లన్నీ తహసీల్దార్‌ కార్యాలయాల్లో అవుతున్నాయి. ఈ భూముల రిజిస్ర్టేషన్‌లకు ఆయా మండలాల పరిధిలో ఎకరం భూమి విలువను బట్టి రూ. 15 నుంచి 16వేల వరకు రిజిస్ర్టేషన్‌ ఫీజు చెల్లిస్తున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్‌లను కొన్నవారు చేసుకుంటున్నారు. ఈ భూములకు కూడా 50 శాతం వరకు పెరగనుంది. ప్రస్తుతం ఏర్గట్ల మండలం పరిధిలో ఎకరం భూమికి 15వేల రూపాయలను రిజిస్ర్టేషన్‌, ముటేషన్‌, పాస్‌బుక్‌ కోసం చెల్లించి రిజిస్ర్టేషన్‌లు చేస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయ భూములపైన 50 శాతం ఫీజును పెంచితే ఈ మండలం పరిధిలో భూముల రిజిస్ర్టేషన్‌కు 7500 రూపాయలు అదనంగా పెరగనుంది. పెంచిన రేట్లు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తే రిజిస్ర్టేషన్‌ చేసుకునే వారిపైన ఎకరాకు అదనంగా ఏడున్నర వేలు భారం పడనుంది. జిల్లాలోని అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రస్తుతం ప్రతిరోజూ 3 నుంచి 10వరకు డాక్యుమెంట్‌ రిజిస్ర్టేషన్‌లు జరుగుతున్నాయి. భూముల రిజిస్ర్టేషన్‌ ఫీజులు పెరుగుతున్నాయని ప్రచారం జరిగినప్పటి నుంచి ఎక్కువ మంది ధరణి ద్వారా రిజిస్ర్టేషన్‌ కోసం ప్రయత్నించినా కొన్నిసార్లు సర్వర్‌ డౌన్‌ కావడంతో ఇబ్బం దులు ఎదురవుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీకి మరో మూ డు రోజులు గడువు ఉంది. రిజిస్ర్టేషన్‌లకు ఇంకా రెండు రోజులే అవకాశం ఉండడంతో ఎక్కువమంది స్లాట్‌ బుకింగ్‌ చేసుకుంటున్నారు. వ్యవసాయ భూములపైన కూడా రిజిస్ర్టేషన్‌ ఫీజు పెంచితే తహసీల్దార్‌ కార్యాలయం ద్వారా రిజిస్ర్టేషన్‌ ఫీజు రూపంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది.

ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు : ఫణిందర్‌రావు, ఉమ్మడి జిల్లా రిజిస్ర్టార్‌

భూముల రిజిస్ర్టేషన్‌ ఫీజు పెంపుపై ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు ఏమీ రాలేదు. వ్యవసాయేతర ఆస్తులతోపాటు వ్యవసాయ భూములపైనా రిజిస్ర్టేషన్‌ ఫీజు పెరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1నుంచి రిజిస్ర్టేషన్‌ ఫీజు పెంచే అవకాశం ఉండడంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్‌లు పెరిగాయి.

Updated Date - 2022-01-29T07:11:17+05:30 IST