కార్మికుల ఐక్య పోరాటాలతోనే స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ

ABN , First Publish Date - 2021-12-05T05:45:26+05:30 IST

కార్మికుల ఐక్య పోరాటాలతోనే విశాఖ ఉక్కును సాధిస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వరంగంలో కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ కూర్మన్నపాలెంలో ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 296వ రోజు కొనసాగాయి.

కార్మికుల ఐక్య పోరాటాలతోనే స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ
దీక్షా స్థలిలో నినాదాలు చేస్తున్న పోరాట కమిటీ ప్రతినిధులు

పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, డిసెంబరు 4: కార్మికుల ఐక్య పోరాటాలతోనే విశాఖ ఉక్కును సాధిస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వరంగంలో కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ  కూర్మన్నపాలెంలో ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 296వ రోజు కొనసాగాయి. శనివారం ఈ దీక్షలలో ఏడీఎం, డబ్ల్యూఆర్‌ఎం-1 కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి ఆదినారాయణ మాట్లాడుతూ రిలే దీక్షలు 300వ రోజుకు చేరుకుంటున్న సందర్భంగా ఈ నెల 8న గాజువాకలో భారీ ధర్నా చేపడతామన్నారు. పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు ఎన్‌.రామారావు మాట్లాడుతూ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.  పోరాట కమిటీ మరో నాయకుడు గంధం వెంకటరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి కార్మికులకు ఆమోదయోగ్యంగా స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు జి.ఆనంద్‌, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, రమణ, అప్పలరాజు, మహేష్‌, రామ కోటేశ్వరరావు, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-05T05:45:26+05:30 IST