నీరజ్ చోప్రాకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

ABN , First Publish Date - 2021-08-08T00:12:52+05:30 IST

టోక్యా ఒలంపిక్స్‌లో అసమాన ప్రతిభ కనబరిచి.. జావెలిన్ త్రో‌లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్..

నీరజ్ చోప్రాకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

న్యూఢిల్లీ: టోక్యా ఒలంపిక్స్‌లో అసమాన ప్రతిభ కనబరిచి.. జావెలిన్ త్రో‌లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాకు దేశవ్యాప్తంగా అభినందలు వెల్లువెత్తుతున్నాయి. 121 ఏళ్ల భారత చరిత్రలో అథ్లెటిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా రికార్డులకు ఎక్కడంతో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసలు కురిపించాయి. టోక్యోలో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించడం దేశానికి గర్వకారణమని, దేశ ప్రజల హృదయాల్లో ఈ విజయం చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. నీరజ్ చోప్రా సాధించిన ఘనత యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. ఇది అసాధారణ విజయమని, చోప్రా సాధించిన జావెలిన్ గోల్డ్ అన్ని హద్దులను చెరిపేసి, చరిత్ర సృష్టించిందని, దేశం గర్విస్తోందని అభినందించారు.


నీరజ్ చోప్రా ఈరోజు సాధించిన విజయం కలకాలం నిలిచిపోతుందని ప్రధాని మోదీ తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. ''టోక్యోలో చరిత్ర సృష్టించారు. నీరజ్ చోప్రా సాధించిన విజయం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది. యువ నీరజ్ ఎంతో పట్టుదలగా, అనితర సాధ్యమైన ప్రతిభ చూపారు. బంగారు పతకం గెలుచుకున్న నీరజ్‌కు నా అభినందనలు'' అని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఒలంపిక్స్ జావెలిన్ త్రోలో భారత్‌కు స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాకు కేంద్ర యవజనల వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అభినందనలు తెలిపారు. నీరజ్ చరిత్ర సృష్టించారని, ఒలంపిక్స్‌లో జరిగిన ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారని అన్నారు. భవిష్యత్ తరాలకు నీరజ్ చోప్రా స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు.


వెంకయ్యనాయుడు అభినందనలు

''యావద్భారతావని గర్వించదగిన మధురమైన క్షణం! టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రతిభతో భారతదేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించిన శ్రీ నీరజ్ ఛోప్రాకు హార్దిక అభినందనలు. స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనతో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో తొలి స్వర్ణం తీసుకొచ్చిన నీరజ్ ఛోప్రా భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను" అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.


Updated Date - 2021-08-08T00:12:52+05:30 IST