అయోధ్య రామాలయానికి..రాష్ట్రపతి విరాళం 5 లక్షలు

ABN , First Publish Date - 2021-01-16T08:03:40+05:30 IST

అయోధ్య రామాలయ నిర్మాణానికి ‘సమర్పణ్‌ నిధి సంగ్రహ అభియాన్‌’ కింద రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రూ. 5,00,100 విరాళం అందజేశారు. విరాళాల సేకరణలో భాగంగా..

అయోధ్య రామాలయానికి..రాష్ట్రపతి విరాళం 5 లక్షలు

వెంకయ్య కుటుంబం, పలు రాష్ట్రాల సీఎంలు కూడా

రాహుల్‌గాంధీనీ విరాళాలు 

అడుగుతాం: వీహెచ్‌పీ

రామజన్మ భూమి భద్రతకు 

డీఎస్పీ స్థాయి అధికారి

కాశీ, మథురలకు కూడా


న్యూఢిల్లీ, జనవరి 15: అయోధ్య రామాలయ నిర్మాణానికి ‘సమర్పణ్‌ నిధి సంగ్రహ అభియాన్‌’ కింద రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రూ. 5,00,100 విరాళం అందజేశారు. విరాళాల సేకరణలో భాగంగా.. శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ సహాధ్యక్షుడు గోవింద్‌ దేవ్‌ గిరీజి మహారాజ్‌, వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌, ఆలయ నిర్మాణ కమిటీ చీఫ్‌ నృపేంద్ర మిశ్రా శుక్రవారం రాష్ట్రపతి కోవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు ఆలయ నిర్మాణ పనులను గురించి రాష్ట్రపతికి వివరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సతీమణి ఉషానాయుడు కూడా రూ.5,11,116 అందజేశారు.


మధ్యప్రదేశ్‌ సీఎం శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కూడా రూ.లక్ష చెక్కును, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేందర్‌ సింగ్‌ రావత్‌ రూ.1.51 లక్షలు, గవర్నర్‌ బేబీ రాణీ మౌర్య రూ.1.21 లక్షలను అందజేశారు. మందిర నిర్మాణానికి ఇప్పటి వరకు అత్యధికంగా వచ్చిన విరాళం రూ.1,11,11,111 అని ట్రస్ట్‌ సభ్యులు తెలిపారు. ఆ మొత్తాన్ని రాయ్‌బరేలీ పరిధిలోని తేజోగావ్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే సురేంద్ర బహదూర్‌ సింగ్‌ ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని కూడా విరాళాలు అడుగుతామని వీహెచ్‌పీ నేతలు చెప్పారు. కాగా.. అయోధ్యలోని రామజన్మభూమి, వారాణసిలోని కాశీ క్షేత్రం, మథురలోని శ్రీకృష్ణ జన్మభూమికి భద్రతగా డీఎస్పీ స్థాయి అధికారులను నియమిస్తూ ఉత్తరప్రదేశ్‌ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. 


మందిర నిర్మాణానికి సహకరిస్తా: అన్సారీ

బాబ్రీమసీదు కూల్చివేతకు సంబంధించి కేసు వేసిన వారిలో ఒకరైన ఇక్బాల్‌ అన్సారీ అయోధ్య రా మాలయ నిర్మాణానికి సహకరించేందుకు ముందు కొచ్చారు. ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణను చేపడతానని.. ఇందుకోసం ఇప్పటికే రూ.10, రూ.100, రూ.1,000 విలువైన కూపన్లను సిద్ధం చేశాననన్నారు.  

Updated Date - 2021-01-16T08:03:40+05:30 IST