రాష్ట్రపతి నుంచి సాధారణ ఉద్యోగి దాకా..

ABN , First Publish Date - 2020-03-30T09:37:05+05:30 IST

కరోనాతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమవుతున్న వారికి సాయం అందించడానికి ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు,

రాష్ట్రపతి నుంచి సాధారణ ఉద్యోగి దాకా..

  • పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళాల వెల్లువ.. 
  • 100 కోట్లు ప్రకటించిన జిందాల్‌
  • 25 వేల మంది సినీ కార్మికుల బాధ్యత నాదే: సల్మాన్‌ ఖాన్‌


న్యూఢిల్లీ, మార్చి 29: కరోనాతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమవుతున్న వారికి సాయం అందించడానికి ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, సినీ నటులు, వ్యాపారులు ఇలా సాయం చేయడానికి అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరు విరాళాలను అందజేస్తున్నారు. కష్టకాలంలో ఒకరికొకరు సాయం చేసుకోవాలని పిలుపునిస్తున్నారు. ఉక్కు తయారీలో ప్రసిద్ధి చెందిన జిందాల్‌ స్టీల్‌ వర్క్స్‌(జేఎ్‌సడబ్ల్యూ-జిందాల్‌) ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ. 100 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. సంస్థలో విధులు నిర్వహించే ప్రతీ ఉద్యోగి తన ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారని చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.


  • రాష్ట్రపతి కోవింద్‌ తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ప్రధాని మోదీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 
  • త్రివిధ దళాల సైనికులు, రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేసే ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాల మొత్తం రూ. 500 కోట్లను పీఎం కేర్స్‌ ఫండ్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. 
  • దేశవ్యాప్తంగా ఉన్న పారామిలటరీ బలగాలు తమ ఒకరోజు వేతనం రూ. 116 కోట్లను విరాళంగా ప్రకటించారు. 
  • రైల్వే ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాల మొత్తం రూ. 151 కోట్లను ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. 
  • కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఎంపీల్యాడ్‌ నిధుల నుంచి రూ. 1 కోటిని పుణెలోని ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు కొనడానికి ఇచ్చారు. 
  • కశ్మీర్‌లోని 3 ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలను మెరుగుపర్చేందుకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా ఎంపీల్యాడ్స్‌ నిధుల నుంచి రూ. 1.5 కోట్లు విడుదల చేశారు.  
  • పీఎం కేర్స్‌ ఫండ్‌కు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని సీబీఐ ఉద్యోగులు నిర్ణయించారు.   
  • సీబీఎస్‌ఈ ఉద్యోగులు రూ. 21 లక్షలు ఇవ్వాలని  నిర్ణయించారు.
  • బాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్‌ పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ. 11 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.  
  • బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ సినిమా ఇండస్ట్రీలో పనిచేసే 25 వేల మంది కార్మికులకు ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు.  
  • ఇండియన్‌ రైల్వేస్‌ ట్రాఫిక్‌ సర్వీ్‌స(ఐఆర్‌టీఎస్‌) పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ. 5లక్షల విరాళం ప్రకటించింది. ఐఆర్‌సీటీసీ ఆదివారం 11 వేల మంది పేదలకు ఆహారాన్ని అందజేసింది.
  • ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్‌ దాతృత్వ సంస్థ ‘చాన్‌ జుకర్‌బర్గ్‌’ కొవిడ్‌ బాధితులకు చికిత్సపై పరిశోధనలకు గాను గేట్స్‌ ఫౌండేషన్‌తో కలిసి రూ. 187 కోట్లు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రకటించింది. 
  • ప్రసార భారతి ప్రోగ్రామ్‌ స్టాఫ్‌ ఉద్యోగులు ఒక రోజు వేతనం రూ.3 కోట్లను విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-03-30T09:37:05+05:30 IST