వ్యాక్సినేషన్‌తో కరోనా మరణాలను అడ్డుకున్నాం.. కానీ..: Joe Biden

ABN , First Publish Date - 2021-07-21T23:44:32+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి దేశ ప్రజలను మహమ్మారి విషయంలో అలసత్వం ప్రదర్శించరాదని కోరారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియతో కరోనా మరణాలు భారీగా తగ్గాయని చెప్పిన ఆయన.. డెల్టా వేరియంట్ పట్ల అప్రమత్తత చాలా అవసరమని పేర్కొన్నారు.

వ్యాక్సినేషన్‌తో కరోనా మరణాలను అడ్డుకున్నాం.. కానీ..: Joe Biden

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి దేశ ప్రజలను మహమ్మారి విషయంలో అలసత్వం ప్రదర్శించరాదని కోరారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియతో కరోనా మరణాలు భారీగా తగ్గాయని చెప్పిన ఆయన.. డెల్టా వేరియంట్ పట్ల అప్రమత్తత చాలా అవసరమని పేర్కొన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంగా మంగళవారం కేబినేట్ మీటింగ్‌లో బైడెన్ మాట్లాడారు. టీకా కార్యక్రమం వల్ల దేశవ్యాప్తంగా కరోనా మరణాలు 90 శాతం తగ్గాయని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


తాజాగా అగ్రరాజ్యంలోని వివిధ రాష్ట్రాల్లో నమోదవుతున్న కొత్త కేసుల్లో 80 శాతం డెల్టావేనని అన్నారు. కనుక డెల్టా ఎంత డేంజరో? ప్రజలే అర్థం చేసుకోవాలని, లేనిపక్షంలో భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇక కరోనాతో చనిపోయిన వారితో పాటు ఆస్పత్రిలో చేరిన వారిలో చాలా మంది టీకా తీసుకోని వారేనని బైడెన్ తెలిపారు. అందుకే సాధ్యమైనంత త్వరగా అందరూ తప్పకుండా టీకాలు వేసుకోవాలని కోరారు. వ్యాక్సిన్‌పై అపోహాలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ఈ సందర్భంగా అగ్రరాజ్యం ఇతర దేశాలకు టీకాలను సాయం చేస్తున్న విషయాన్ని కూడా బైడెన్ గుర్తు చేశారు.  

Updated Date - 2021-07-21T23:44:32+05:30 IST