ట్రంప్‌తో విందుకు రండి.. కేసీఆర్‌కు ఆహ్వానం

ABN , First Publish Date - 2020-02-22T19:55:55+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన గౌరవార్థం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 25న విందు ఇవ్వనున్నారు.

ట్రంప్‌తో విందుకు రండి.. కేసీఆర్‌కు ఆహ్వానం

హైదరాబాద్/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన గౌరవార్థం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 25న విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు హాజరు కావాలంటూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాష్ట్రపతి ఆహ్వానాలు పంపించారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావుకు కూడా ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. తెలంగాణతో పాటూ మహారాష్ట్ర, హరియాణా, బీహార్, ఒడిశా, కర్ణాటక ముఖ్యమంత్రులకు విందుకు హాజరయ్యేందుకు ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది. ఇక విందుకు కేవలం 90 నుంచి 95 మంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానాలు అందటం ఆసక్తి కలిగించే మరో అంశం. 


కాగా.. కేసీఆర్ విందుకు హాజరవడంలో ఓ ప్రత్యేకత ఉంది. అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే విందులో కేసీఆర్ పాల్గొనడం ఇదే తొలిసారి.. అయితే ఆయన కుమార్తె ఇవాంకాతో మాత్రం రెండో సారి సమావేశం కానున్నారు. 2017లో హైదరాబాద్‌లో గ్లోబల్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా ఇవాంకా నగరానికి విచ్చేసిన విషయం తెలిసిందే. ఇవాంకా గౌరవార్థం హైదరాబాద్‌లోని ప్రముఖ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ఇవాంకాకు ప్రత్యేక బహుమితిని ఇచ్చి ఆమెను ఆశ్చర్యచకితుల్ని చేశారు. తెలంగాణలో లభించిన ఆతిథ్యానికి అబ్బురపడిన ఇవాంకా.. అమెరికాకు వెళ్లిన అనంతరం కేసీఆర్‌కు ధన్యావాదాలు తెలుపుతూ ఓ లేఖను కూడా రాశారు.


Updated Date - 2020-02-22T19:55:55+05:30 IST