రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రేపు రైలు ప్రయాణం

ABN , First Publish Date - 2021-06-24T14:43:30+05:30 IST

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రేపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లోని తన స్వగ్రామమైన పరుంఖ్ సందర్శనకు రైలులో ప్రయాణించనున్నారు....

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రేపు రైలు ప్రయాణం

 న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రేపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లోని తన స్వగ్రామమైన పరుంఖ్ సందర్శనకు రైలులో ప్రయాణించనున్నారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే‌స్టేషను నుంచి రాష్ట్రపతి ప్రత్యేక రైలులో ప్రయాణించనున్నారు. కాన్పూర్ దేహాట్ మార్గంలోని జిన్జాక్, రురాల వద్ద ఈ ప్రత్యేక రైలు కొద్దిసేపు ఆగనుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన పాఠశాల రోజుల నాటి పాత పరిచయస్థులను కలిసి మాట్లాడనున్నారు. రాష్ట్రపతి తన జన్మస్థలాన్ని సందర్శించాలని అనుకున్నప్పటికీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కార్యరూపం దాల్చలేదు. 


కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తన స్వగ్రామానికి వెళ్లేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ రైలులో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఇద్దరు రాష్ట్రపతులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ రాజేంద్రప్రసాద్ లు మాత్రమే రైలు ప్రయాణాలు చేశారు. రాష్ట్రపతి తన స్వగ్రామమైన పరుంఖ్ ను సందర్శించి తిరిగి జూన్ 28వతేదీన కాన్పూర్ సెంట్రల్ రైల్వేస్టేషనులో రైలు ఎక్కి లక్నోకు చేరుకుంటారు. లక్నో పర్యటన అనంతరం జూన్ 29వతేదీన రామ్‌నాథ్ ప్రత్యేక విమానంలో లక్నో నుంచి ఢిల్లీకి తిరిగివస్తారు.


 గతంలో ఇండియన్ మిలటరీ అకాడమీలో కేడెట్ల పాసింగ్ పరేడ్ లో పాల్గొనేందుకు అబ్దుల్ కలాం 2006లో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ కు ప్రత్యేక రైలులో ప్రయాణించారు. దేశ మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ తరచూ రైలు ప్రయాణాలు చేశారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాజేంద్రప్రసాద్ బీహార్ రాష్ట్రంలోని సివాన్ జిల్లాలోని తన జన్మస్థలమైన జిరాడీని సందర్శించారు.ఛప్రా నుంచి రాష్ట్రపతి ప్రత్యేక రైలులో ప్రయాణించారు.

Updated Date - 2021-06-24T14:43:30+05:30 IST