President Ram Nath Kovind:ప్రత్యేక రైలులో అయోధ్య రామజన్మభూమి పర్యటన

ABN , First Publish Date - 2021-08-25T13:10:16+05:30 IST

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రత్యేక రైలులో అయోధ్యలోని రామాలయం నిర్మాణస్థలంలో పర్యటించనున్నారు....

President Ram Nath Kovind:ప్రత్యేక రైలులో అయోధ్య రామజన్మభూమి పర్యటన

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రత్యేక రైలులో అయోధ్యలోని రామాలయం నిర్మాణస్థలంలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి ఈ నెల 26వతేదీ నుంచి 29వతేదీ వరకు లక్నో, గోరఖ్ పూర్, అయోధ్య నగరాల్లో పర్యటిస్తారని రాష్ట్రపతి సచివాలయం వెల్లడించింది. రాష్ట్రపతి ఈ నెల 26, 27 తేదీల్లో లక్నోనగరంలో జరగనున్న రెండు స్నాతకోత్సవాల్లో పాల్గొంటారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ సంపూర్ణానంద్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత కెప్టెన్ మనోజ్ పాండే సైనికస్కూలులో ఆడిటోరియాన్ని ప్రారంభిస్తారు.ఆగస్టు 28 వ తేదీన కోవింద్ మహాయోగి గురు గోరఖ్‌నాథ్ ఆయుష్ మహా విద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. 


అనంతరం గోరఖ్‌పూర్‌లో మహాయోగి గోరఖ్‌నాథ్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు.రాష్ట్రపతి కోవింద్ ఆగస్టు 29 న లక్నో నగరం నుంచి ప్రత్యేక రైలులో అయోధ్యకు వెళ్లి రామాలయం నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించి పూజ చేస్తారు.అయోధ్యలో రాష్ట్రపతి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టనున్న పునర్నిర్మాణం/తులసి స్మారక్ భవన్ నిర్మాణం, నగర్ బస్టాండ్, అయోధ్య ధామ్ అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తారు.గత రెండు నెలల్లో రాష్ట్రపతి కోవింద్ ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించడం ఇది రెండోసారి. అంతకుముందు జూన్‌లో కోవింద్ కాన్పూర్‌లోని తన స్వగ్రామం పారుంఖ్‌ను రైలులో వెళ్లి సందర్శించారు.

Updated Date - 2021-08-25T13:10:16+05:30 IST