రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జమ్మూ-కశ్మీరు పర్యటన ప్రారంభం

ABN , First Publish Date - 2021-07-25T19:47:32+05:30 IST

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జమ్మూ-కశ్మీరు, లడఖ్ పర్యటన

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జమ్మూ-కశ్మీరు పర్యటన ప్రారంభం

శ్రీనగర్ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జమ్మూ-కశ్మీరు, లడఖ్ పర్యటన ఆదివారం ప్రారంభమైంది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఆదివారం ఉదయం 11.15 గంటలకు శ్రీనగర్ చేరుకున్నారు. ఆయనకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పోలీసు, ఇతర శాఖలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు స్వాగతం పలికారు. 


1999లో పాకిస్థాన్‌తో కార్గిల్ వద్ద జరిగిన యుద్ధంలో భారతీయ దళాలు సాటిలేని ధైర్యసాహసాలు ప్రదర్శించి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో కార్గిల్ విజయ్ దివస్ ఈ నెల 26న జరుగుతుంది. ఈ సందర్భంగా లడఖ్‌లోని ద్రాస్‌లో కార్గిల్ యుద్ధ సంస్మరణ కేంద్రం వద్ద అమర వీరులకు రాష్ట్రపతి నివాళులర్పిస్తారు. జూలై 27న శ్రీనగర్‌లోని కశ్మీర్ విశ్వవిద్యాలయం 19వ వార్షిక స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. 


2019లో జరిగిన కార్గిల్ విజయ్ దివస్‌లో రాష్ట్రపతి పాల్గొనలేదు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ద్రాస్ వెళ్లలేకపోయారు. దీంతో ఆయన శ్రీనగర్‌లోని బాదామీ బాగ్‌లో ఉన్న 15 కార్స్స్ ప్రధాన కార్యాలయంలోని యుద్ధ స్మారకం వద్ద కార్గిల్ వీరులకు నివాళులర్పించారు. 



Updated Date - 2021-07-25T19:47:32+05:30 IST