అమెరికన్లందరికీ కొవిడ్ చికిత్స ఉచితం: ట్రంప్

ABN , First Publish Date - 2020-10-18T17:44:48+05:30 IST

ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం విస్కాన్సిన్‌లోని జానెస్విల్లేలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులతో మాట్లాడుతూ అమెరికన్లందరికీ తాను పొందిన కరోనావైరస్ చికిత్స ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.

అమెరికన్లందరికీ కొవిడ్ చికిత్స ఉచితం: ట్రంప్

విస్కాన్సిన్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం విస్కాన్సిన్‌లోని జానెస్విల్లేలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులతో మాట్లాడుతూ అమెరికన్లందరికీ తాను పొందిన కరోనావైరస్ చికిత్స ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. "ఈ వైరస్ నుంచి త్వరగా కోలుకోవడానికి నేను తీసుకున్న కొవిడ్ చికిత్సను అమెరికన్లందరూ ఉచితంగా పొందవచ్చు. యాంటీబాడీస్.. యాండీబాడీస్ అనేవి వైరస్ కణాలతో పోరాటంలో కీలక పాత్ర పోషిస్తాయి. మేము దానిని ఉచితం చేయబోతున్నాము" అని చెప్పారు.


అలాగే మిచిగాన్‌లోని ముస్కేగోన్‌లో మరో ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన అధ్యక్షుడు ట్రంప్... నవంబర్ ఎన్నికల్లో డెమొక్రట్ల విజయం మిచిగాన్‌తో పాటు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పరిస్థితిని మరింత దిగజార్చవచ్చని అన్నారు. బైడెన్ వస్తే దేశాన్ని షట్‌డౌన్ చేయడంతో పాటు వ్యాక్సిన్ ఆలస్యం అవుతుంది. దీంతో దేశంలో మహమ్మారి ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని తెలిపారు. ఇక కరోనా బారిన పడి కోలుకున్న ట్రంప్ ముమ్మరంగా ప్రచార ర్యాలీలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న కొవిడ్ బారిన పడ్డ ట్రంప్‌ కేవలం 10 రోజుల వ్యవధిలోనే కోలుకున్నారు. అక్టోబర్ 12న వైట్‌హౌస్ వైద్యుడు సీన్ కోన్లీ ట్రంప్‌కు యాంటీజెన్ పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చినట్లు ప్రకటించారు. దీంతో ట్రంప్ తీసుకున్న కొవిడ్ చికిత్సపై అందరూ ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే విస్కాన్సిన్‌లో ట్రంప్.. తాను తీసుకున్న కరోనా చికిత్సను అమెరికన్లందరికీ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.  

Updated Date - 2020-10-18T17:44:48+05:30 IST