Abn logo
Sep 24 2021 @ 11:44AM

అధికార పార్టీలో అధ్యక్ష పదవి చిచ్చు!

ఎంపీపీ పదవికి భారీ డిమాండ్‌

ఓ మండలంలో సుమారు రూ.35 లక్షలు పలికిన  వైనం

అరకోటి ఇచ్చేందుకు కొందరు సిద్ధం

63 మండలాల్లో నేడు ఎంపీపీ ఎన్నికలు 


అనంతపురం: అధికార పార్టీలో అధ్యక్షుడి పీఠం చిచ్చురేపుతోంది. మండలాధ్యక్షుల పదవి పార్టీ నేతల్లో అసమ్మతి, అసంతృప్తితోపాటు ఆగ్రహాలు, రాజీనామాలకు దారితీస్తోంది. కోరుకున్న పదవిని దక్కించుకోడానికి అరకోటి వరకూ ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాకేంద్రానికి దగ్గర్లోని ఓ మండలంలోని అధ్యక్ష పదవి ఏకంగా రూ. 35 లక్షలు పలికినట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా అరకోటి రూపాయలు పలికినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన సభ్యులను ఎన్నుకోనున్నారు. 


మండలాధ్యక్షుల ఎన్నిక నేడే 

మండలాధ్యక్షుల ఎన్నికలు శుక్రవారం నిర్వహించనున్నారు. రిజర్వేషన్ల వారిగా చూస్తే ఎంపీపీ పదవులు ఎస్టీలకు 3 స్థానాలు కేటాయించగా అందులో రెండు మహిళలకు కేటాయించారు. ఎస్సీలకు 10 కేటాయించగా ఐదు మహిళలకు, బీసీలకు 18 స్థానాలు కేటాయించగా మహిళలకు 9 కేటాయించారు. ఇక అన రిజర్వ్డుకు 32 స్థానాలు కేటాయించగా అందులో మహిళలకు 16 స్థానా లు కేటాయించారు.  అన రిజర్వుడ్‌ స్థానాలున్న మండలాల్లో ఈ పోటీ భారీగా ఉందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అమడగూరు, బ్రహ్మసముద్రం, బుక్కపట్నం, చిలమత్తూరు, డీ.హీరేహాళ్‌, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, కూడేరు, నంబులపూలకుంట, నల్లచెరువు, పామిడి, పెద్దపప్పూరు, పుట్లూరు, పుట్టపర్తి, తాడిమర్రితోపాటు అనంతపురం రూరల్‌ తదితర మండలాల్లో భారీగానే పదవుల కోసం ఎంపీటీసీ సభ్యులకు లక్షలు పంచినట్లు తెలుస్తోంది. కొన్ని మండలాల్లో అరకోటి వరకూ చేతులు మారినట్లు తెలుస్తోంది. 


తప్పని ఇంటిపోరు

జిలా వ్యాప్తంగా 841 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీ 713 స్థానాలను గెలుపొందగా, టీడీపీకి 49 స్థానాలు, బీజేపీ ఒకటి, జనసేన, సీపీఐ, సీపీఎం ఒక్కో స్థానం చొప్పున, ఇతరులు మరో 15 ఎంపీటీసీ స్థానాలను దక్కించుకున్నారు. అయితే అధికార పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడంతో... అన్ని ఎంపీపీ పదవులు వారివనే చెప్పాలి. అయితే భారీ మెజార్టీ వచ్చినా....అధికార పార్టీ నాయకులకు ఇంటిపోరు తప్పడం లేదు. ఎంపీపీ పదవులు కావాలంటూ ఎమ్మెల్యేలను, నాయకులను విమర్శించిన వారూ ఉన్నారు. కదిరిలో కుమ్మరవాండ్లపల్లికి చెందిన వైసీపీ ఎంపీటీసీ బత్తల రామలక్ష్మమ్మ, ఆమె భర్త ఆదినారాయణ అసమ్మతి గళం ఎత్తారు. స్థానిక ఎమ్మెల్యే మొదట తమకు పదవి ఇస్తానని చెప్పి, తర్వాత తన సామాజికవర్గానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఈ ఘటన జిల్లాలో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఆతర్వాత నేతలు జోక్యం చేసుకొని సర్దుబాటు చేశారు. పలు మండలాల్లో అధ్యక్ష పదవులు భారీగా పలికినట్లు సమాచారం. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న  ఓ మండలానికి చెందిన అధ్యక్షుడి పదవికి రూ. 35 లక్షల వరకూ బేరాలు సాగినట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్లు అరకోటి వరకూ పలికినట్లు సమాచారం.