Advertisement
Advertisement
Abn logo
Advertisement

మార్కెట్‌ కమిటీలకు పూర్వవైభవం

వ్యవసాయ నూతన చట్టాల రద్దుతో మళ్లీ కాసుల గలగల

ట్రేడ్‌ లైసెన్సులు పెంచేందుకు యంత్రాంగం కసరత్తు

చెక్‌ పోస్టుల్లోనూ నూతన విధానానికి నిర్ణయం 

నల్లగొండ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ నూతన చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంటులో బిల్లును ఆమోదించడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లు మళ్లీ పూర్వవైభవం సంతరించుకోనున్నాయి. అదేవిధంగా మార్కెట్లలో పరిధిలోని తనిఖీ కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. పంట ఉత్పత్తులను తిరిగి వ్యవసాయ మార్కెట్ల పరిధిలోనే రైతులు విక్రయించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 21 వ్యవసాయ మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ, దేవరకొండ, నిడమనూరు, హాలియా, నల్లగొండ, నకిరేకల్‌, చిట్యాల, చండూరు, వీటీ.నగర్‌ (మాల్‌), శాలిగౌరారంలో మొత్తం 10 మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మార్కెట్‌తో పాటు కోదాడ, హుజూర్‌నగర్‌, తుంగతుర్తి, నేరేడుచర్ల, తిరుమలగిరిలో మొత్తం ఆరు మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్‌, మోత్కూరు, వలిగొండలో మొత్తం ఐదు మార్కెట్‌ యార్డులు ఉన్నాయి.

వ్యాపారులు గతంలో పంట ఉత్పత్తులను మార్కెట్‌ యార్డుల్లో కొనుగోలు చేసేందుకు అధికారులు ట్రేడ్‌ లైసెన్సులు ఇచ్చేవారు. ఇకపై ఏ ప్రాంతానికి చెందిన వ్యాపారులకైనా ట్రేడ్‌ లైసెన్సులు ఇచ్చి ఆదాయం పెంచుకునే యోచనలో ప్రభుత్వం ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 21 మార్కెట్‌ యార్డులు ఉండగా, వీటి పరిధిలో సుమారు 40 తనిఖీ కేంద్రాలు ఉన్నాయి. గతంలో క్రయ, విక్రయాలతోనే మార్కెట్లకు ఆదాయం రాగా, కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తేవడంతో రైతులు పంటను ఎక్కడైనా విక్రయించుకునే వెసులుబాటు కలిగింది. క్రయ, విక్రయాలపై ఆంక్షలు లేకపోవడంతో వ్యాపారులు మార్కెట్ల బయట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. దీంతో మార్కెట్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం కేంద్రం వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయడంతో తిరిగి తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు క్రయ, విక్రయాలపై  సెస్‌ వసూలు చేయనున్నారు.

చెక్‌ పోస్టుల్లో నూతన విధానం

కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో అధికార యంత్రాంగం చెక్‌ పోస్టులపై దృష్టిసారించింది. తొలుత వ్యవసాయ చట్టాల అమలు తాత్కాలికంగా నిలిచిన సమయంలో చెక్‌పోస్టులు తెరిచినా పకడ్బందీగా నిర్వహించలేకపోయారు. ప్రస్తుతం చట్టాలను పూర్తిగా రద్దు చేయడంతో మార్కెట్లకు ఆదాయం వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మార్కెట్‌శాఖ పరిధిలో తాజాగా సాంకేతిక మార్పులు, చేర్పులు కూడా చేయనున్నారు. గతంలో చేతి రాత ద్వారా ఇచ్చే రశీదులను వ్యాపారులు పదేపదే వినియోగించే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఈ-రశీదును ఆన్‌లైన్‌ ద్వారా అందజేస్తున్నారు. అందులో సమయంతో పాటు తేదీ తదితర వివరాలు కూడా ఉంటాయి. పైగా దానికి బార్‌కోడ్‌ కూడా ఉండనుంది. ఆన్‌లైన్‌ రశీదుల కారణంగా మార్కెట్‌ సిబ్బంది వసూలు చేసిన ఫీజు మొత్తాన్ని మరుసటి రోజు ప్రభుత్వ ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో ప్రభుత్వ సొమ్మును మార్కెట్‌ సిబ్బంది సొంతానికి వాడుకునే వీలు ఉండదు. కొత్త విధానంతో అక్రమాలు తగ్గడమేగాక ప్రభుత్వానికి ఆదాయం పెరగనుంది.

లక్ష్యం మేరకు ఆదాయం

ఉమ్మడి జిల్లాలోని మార్కెట్‌ యార్డులకు 2021-22 సంవత్సరానికి సంబంధించి ఆదాయం లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లగొండ జిల్లాలోని 10 మార్కెట్లకు రూ.33కోట్లు లక్ష్యం కాగా, రూ.28కోట్ల వరకు సమకూరినట్లు తెలిసింది. సూర్యాపేట జిల్లాలోని ఆరు మార్కెట్‌ యార్డులకు రూ.16.51కోట్లకు, రూ.13.61కోట్లు వచ్చినట్టు సమాచారం. యాదాద్రి జిల్లాకు చెందిన ఐదు మార్కెట్లకు రూ.7.48కోట్లకు రూ.12.93కోట్టు సమకూరినట్టు తెలిసింది.

మార్కెట్ల ఆదాయం పెంచేందుకు కృషి : పి.శ్రీకాంత్‌, ఏడీఎం, నల్లగొండ

జిల్లాలో మార్కెట్ల ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు కృషి చేస్తున్నాం. మార్కెట్లలో కొనుగోళ్లతో వచ్చే సెస్‌తోపాటు వ్యాపారులకు ట్రేడ్‌ లైసెన్సులు ఇచ్చి వారు పంట ఉత్పత్తులను ఎక్కడ కొనుగోలు చేసినా మార్కెట్లకు ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మార్కెట్లకు ఆదాయం పెరగనుంది.

Advertisement
Advertisement