పరిశుభ్రతతో సీజనల్‌ వ్యాధుల పరార్‌

ABN , First Publish Date - 2021-07-31T08:52:22+05:30 IST

కరోనా నేపథ్యంలో పారిశుధ్య చర్యలు పాటిస్తుండటంతో రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా మలేరియా, డెంగీ, చికెన్‌ గున్యా కేసులు బాగా తగ్గాయి.

పరిశుభ్రతతో సీజనల్‌ వ్యాధుల పరార్‌

2020 నుంచి తెలంగాణలో తగ్గుదల..

2019 దాక డెంగీ దాడి.. తర్వాత వెనుకంజ

ఈ ఏడాది చికున్‌ గున్యా కేసు ఒక్కటీ లేదు

కరోనా నేపథ్యంలో పారిశుధ్య చర్యలేకారణం

గణాంకాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ


హైదరాబాద్‌, జూలై 30(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో పారిశుధ్య చర్యలు పాటిస్తుండటంతో రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా మలేరియా, డెంగీ, చికెన్‌ గున్యా కేసులు బాగా తగ్గాయి. 2019కి ముందు, ఆ తర్వాత నమోదైన కేసులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. దేశంలో ఆరేళ్లుగా నమోదైన సీజనల్‌ వ్యాధుల వివరాలను రాష్ట్రాల వారీగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌ వరకు పరిస్థితిని కూడా అందులో పేర్కొంది. దీనిప్రకారం చూస్తే 2019తో పోలిస్తే 2020లో తెలంగాణలో మలేరియా కేసులు 50శాతం, డెంగీ కేసులు 84 శాతం, చికున్‌ గున్యా కేసులు 95 శాతం తగ్గాయి. 2020తో పోలిస్తే ఈ ఏడాది మలేరియా కేసులు 75 శాతం, చికున్‌ గున్యా కేసులు 87 శాతం తగ్గాయి. వాస్తవానికి 2016 నుంచి 2019 వరకు డెంగీ, చికున్‌ గున్యా బాధితుల పెరుగుదల కనిపించింది. అయితే, కొవిడ్‌ నేపథ్యంలో 2020 నుంచి ప్రజలు పరిశుభ్రతకు పెద్దపీట వేయడంతో తీవ్రత తగ్గింది. ఈ ఏడాది ఇప్పటివరకు చికున్‌ గున్యా కేసు ఒక్కటీ నమోదు కాలేదు. మరోవైపు రెండు, మూడేళ్లలో తెలంగాణను మలేరియా రహితం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. దీని కారణంగా కూడా ఐదేళ్లుగా మలేరియా కేసులు తగ్గుతున్నాయి.


ఛత్తీస్‌గఢ్‌పై మలేరియా పంజా

కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం మలేరియా బాధితుల్లో ఛత్తీస్‌గఢ్‌ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ఆర్నెళ్లలోనే 10,347 కేసులు వచ్చాయి. 14 మంది మృతి చెందారు. ఒడిసా (6,260), జార్ఖండ్‌ (3,436), మహారాష్ట్ర (2,990)ల్లోనూ కేసులు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఏడాది అన్ని రాష్ట్రాల్లో 28,495 మలేరియా కేసులు నమోదవగా 18 మంది చనిపోయారు. తమిళనాడులో డెంగీ దడ పుట్టిస్తోంది. 2,062 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. కేరళ (1,596), కర్ణాటక (1,203), మహారాష్ట్ర (936) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డెంగీ కేసుల్లో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది దేశంలో 8,973 డెంగీ కేసులు రాగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 2021లో దేశంలో 15,875 చికెన్‌ గున్యా కేసులు నమోదవగా కర్ణాటక (6,928) టాప్‌లో ఉంది. గుజరాత్‌ (2,521), మహారాష్ట్ర (1,554) సైతం ఈ వ్యాధితో ప్రభావితమయ్యాయి.



Updated Date - 2021-07-31T08:52:22+05:30 IST