ఏడాదిన్నరలో.. లీటర్ పెట్రోల్ ధర ఎంత పెరిగిందో తెలిస్తే.. షాకవుతారు..!

ABN , First Publish Date - 2021-10-24T09:32:56+05:30 IST

దేశీయంగా ఇంధనాల ధరలు కదంతొక్కుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో పెరుగుదల వాహనదారులకు మోయలేని భారంగా మారుతోంది.

ఏడాదిన్నరలో.. లీటర్ పెట్రోల్ ధర ఎంత పెరిగిందో తెలిస్తే.. షాకవుతారు..!

ఏడాదిన్నర లో రూ.36

పెట్రోల్‌పై పెరిగిన భారమిది

డీజిల్‌పైనా రూ.26.58 పెంపు 

వరుసగా నాలుగో రోజూ  ధరల్లో పెరుగుదల

న్యూఢిల్లీ, అక్టోబరు 23: దేశీయంగా ఇంధనాల ధరలు కదంతొక్కుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో పెరుగుదల వాహనదారులకు మోయలేని భారంగా మారుతోంది. వరుసగా నాలుగో రోజైన శనివారం లీటరు పెట్రోల్‌, డీజిల్‌ ధర 35 పైసల చొప్పున పెరిగింది. దీంతో 2020 మే ప్రారంభం నుంచి చూస్తే లీటరు పెట్రోల్‌ ధర రూ.36, డీజిల్‌ ధర రూ.26.58 పెరిగినట్టయింది. ఏడాదిన్నర కాలంలోనే ఈ స్థాయిలో ధరలు పెరిగిపోవడం పట్ల వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. తాజా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.107.24కు, డీజిల్‌ ధర రూ.95.97కు చేరుకుంది. 2020 మే 5న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని రికార్డు స్థాయిలకు పెంచింది. ఒకవేళ ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచకపోయినట్టయితే అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ధరలకు అనుగుణంగా దేశీయంగా ధరలు తగ్గి వాహనదారులకు మరింత చవకగా ఇంధనాలు అందుబాటులోకి వచ్చేవి. కానీ ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచడంతో వాహనదారులకు ఊరట లభించలేకపోయింది. గతేడాది మే 5 నుంచి ఇప్పటి వరకు లీటరు పెట్రోల్‌ ధర రూ.35.98, డీజిల్‌పై రూ.26.58 పెరిగింది. ఎక్సైజ్‌ సుంకం లీటరు పెట్రోల్‌పై రూ.32.9, డీజిల్‌పై రూ.31.8గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 85 డాలర్ల స్థాయికి పెరిగింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా దేశీయంగా ఇంధనాల ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి.  


భారత్‌పై అంతర్జాతీయ మార్కెట్‌ప్రభావమెంత?  

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పడుతోంది. కొవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రపంచ దే శాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. ఇవి ముడిచమురు వినియోగం పెరిగేందుకు దారితీస్తున్నాయి. ఫలితంగా ముడిచమురు ధరలు ఎగబాకుతున్నాయి. మరోవైపు సహజవాయువు, బొగ్గు ధరలు కూడా రికార్డు గరిష్ఠ స్థాయిలకు దూసుకుపోతున్నాయి. వీటన్నింటి ధరలు పెరగడం వల్ల భారత్‌పైనా ప్రభావం పడుతోందంటున్నారు విశ్లేషకులు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ రకం ముడిచమురు ధర 85 డాలర్ల స్థాయికి చేరుకుంది. ఏడాది క్రితం ముడిచమురు ధర 42.5 డాలర్ల స్థాయిలో ఉంది. ఇప్పుడు రెండింతలు పెరిగింది. ధరలు పెరిగినప్పటికీ తమ కట్టుబాటు ప్రకారమే ముడిచమురును ఉత్పత్తి చేయాలని ఆయిల్‌ ఉత్పత్తి దేశాలు ఇటీవలి సమావేశంలో నిర్ణయించాయి. ఇవి ముడిచమురు ధరల పెరుగుదలకు మరింత ఊతమిస్తున్నాయి.దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా దేశీయంగా ఇంధనాల ధరలు దూసుకుపోతున్నాయి. దీని వల్ల వాహనదారులపై భారం పడుతోంది. 

Updated Date - 2021-10-24T09:32:56+05:30 IST