ధర దడ

ABN , First Publish Date - 2021-05-13T05:00:27+05:30 IST

కరోనా కాలంలో మందుల కోసం వేలకు వేలు ఖర్చుచేస్తున్న పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం కాస్త పండ్లు తిందామంటే పేదలకు కష్టమవుతోంది. వాటి ధరలు వింటేనే వణుకు పుడుతోంది. రవాణా సదుపాయాలు తగ్గడం.. ప్రజల అవసరాలకు తగ్గట్టు సంబంధిత సరకులు దిగుమతి కాకపోవడంతో ధరలు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు.

ధర దడ

మందుల రేట్లు భారీగా పెంపు

పండ్లదీ అదే బాట

నిత్యావసరాల వైపు చూడలేం

కరోనా వేళ ప్రజలకు నిలువు దోపిడీ

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

కరోనా కాలంలో మందుల కోసం వేలకు వేలు ఖర్చుచేస్తున్న పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం కాస్త పండ్లు తిందామంటే పేదలకు కష్టమవుతోంది. వాటి ధరలు వింటేనే వణుకు పుడుతోంది. రవాణా సదుపాయాలు తగ్గడం.. ప్రజల అవసరాలకు తగ్గట్టు సంబంధిత సరకులు దిగుమతి కాకపోవడంతో ధరలు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. ముఖ్యంగా మందులు, పండ్లు, నిత్యావసరాల ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. కరోనాకు సంబంధించిన మందులు మార్కెట్లో దొరకని పరిస్థితి ఉంటోంది. డిమాండ్‌ను గుర్తించిన మందుల దుకాణదారులు వారికి నచ్చినట్లు ధరలను పెంచేశారు. కరోనా బాధిత వ్యక్తి ఆహారం తీసుకోక ముందు(పరగడుపున) వేయాల్సిన పెంటోప్రజోల్‌-40 ఎమ్‌జీ 10 మాత్రల స్ర్టిప్‌ ఇదివరకు రూ.70నుంచి 75 ఉండేది. ప్రస్తుతం రూ.148 నుంచి 150కి పెంచేశారు. మల్టీ విటమిన్‌ టాబ్లెట్లు 15మాత్రల స్ట్రిప్‌ ఇదివరకు రూ.75నుంచి 80కి లభ్యమయ్యేది. ఇపుడు రూ.105 నుంచి రూ.110కి పెంచేశారు. విటమిన్‌-సి 15 మాత్రల స్ట్రి్ట్రప్‌ ఇదివరకు రూ.45 నుంచి రూ.55కు లభ్యమయ్యేది. ఇపుడు రూ.80 నుంచి 85కి పెంచేశారు. వివిధ రకాల డాక్సీ సైక్లిన్‌ 10మాత్రల స్ట్రిప్‌ రూ.80 ఉండేది. ఇపుడు రూ.100 చేశారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు వాడుతున్న మందులు మార్కెట్లో కొరతగా ఉన్న కారణంగా వాటిపై సూచించిన ఎమ్‌ఆర్‌పీ కంటే అధికంగా గుంజేస్తున్నారు. ముఖ్యంగా ఇంటిల్లిపాదికి కరోనా సంబంధిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన ప్రతి ఒక్కరూ ముందస్తుగా మందులు వాడేస్తున్నారు. అలాగే ఏదైనా డాక్టర్‌ వద్దకు జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో వెళితే ముందుగా కరోనా సంబంధిత మందులనే ప్రిస్ర్కైబ్‌ చేస్తున్నారు. దీంతో ఈ మందులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. 

ఇదిలా ఉండగా కరోనా కేసులు జిల్లాలో ప్రతి రోజు సరాసరి 600కు మించి నమోదవుతున్నాయి. వారంతా రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు బలవర్ధకమైన ఆహారం, పండ్లు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. పండ్ల ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదివరకు కిలో ద్రాక్ష పండ్లు రూ.80 ఉండేవి. ప్రస్తుతం కిలో రూ.150 చేశారు. ఆపిల్‌ పండ్ల ధర కిలో రూ.140 నుంచి 150 ఉండేది. ప్రస్తుతం రూ.250కు అమ్మకాలు చేస్తున్నారు. కమలాలు కిలో 50 నుంచి 60 ఉండేది. ప్రస్తుతం వీటిని రూ.150కి అమ్ముతున్నారు. బొప్పాయి కిలో నుంచి రెండు కిలోలు ఉన్నవి రూ.40కి లభ్యమయ్యేది. ఇపుడు రూ.50 నుంచి రూ.60కి విక్రయిస్తున్నారు. కివీ పండు ఇది వరకు రూ.13 ఉండేది. ప్రస్తుతం వీటి ధర వినేందుకు కూడా భయమేస్తోంది. ఒక పండు ధర రూ.80 పలుకుతోంది. ప్రస్తుతం ఈ పండ్లు మార్కెట్లో అందుబాటులోనే లేని పరిస్థితి. కార్పొరేట్‌ షాపుల్లో సైతం కివీ పండ్లు లభ్యం కావడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 

ఇక నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెంచేస్తున్నారు. వంట నూనె రెండు నెలల కిందట లీటరు రిఫండాయిల్‌ రూ.100 నుంచి 110 ఉండేది. ప్రస్తుతం రూ.170 నుంచి 180కి అమ్ముతున్నారు. మినపగుళ్లు ఇదివరకు రూ.100 నుంచి 105కు లభ్యమయ్యేవి. ఇపుడు 135 నుంచి రూ.140కి అమ్మకాలు చేస్తున్నారు. కందిపప్పు కిలో రూ.75 నుంచి 80 ఉండేది. ఇపుడు కిలో రూ.100 నుంచి 120కి విక్రయిస్తున్నారు. 



Updated Date - 2021-05-13T05:00:27+05:30 IST