మాయలేడి మాటలు నమ్మి రూ. 3.5 లక్షలు పోగొట్టుకున్న కేరళ ఫాదర్!

ABN , First Publish Date - 2020-09-24T23:15:15+05:30 IST

ఫేస్‌బుక్‌ ద్వారా ఓ క్రైస్తవ మతాధికారితో పరిచయం పెంచుకున్న ఓ మాయలేడి అతి కొద్ది రోజుల్లోనే...

మాయలేడి మాటలు నమ్మి రూ. 3.5 లక్షలు పోగొట్టుకున్న కేరళ ఫాదర్!

బరేలీ: ఫేస్‌బుక్‌ ద్వారా ఓ క్రైస్తవ మతాధికారితో పరిచయం పెంచుకున్న మాయలేడి అతి కొద్ది రోజుల్లోనే ఆయనకు రూ. 3.5 లక్షల మేర కుచ్చుటోపీ పెట్టిన వైనమిది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఉత్తర ప్రదేశ్‌లోని బరేలి సైబర్ పోలీసులు సదరు మహిళ, ఆమె అనుచరులపై కేసు నమోదు చేశారు. బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం.. గత నెల 28న ఓ మహిళ ఫేస్‌బుక్‌లో ఆయనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. తాను బ్రిటీష్ దేశస్తురాలినంటూ ఆయనతో పరిచయం పెంచుకుంది. మాటలు కలిశాక ఆయన ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ సంపాదించింది. ఆయన అంటే తనకు చాలా ఇష్టమని చెబుతూ.. ఐఫోన్, ల్యాప్‌టాప్, బంగారు ఆభరణాలు సహా కొన్ని విలువైన బహుమతులు పంపిస్తున్నానని నమ్మబలికింది.


ఆ మరుసటి రోజే కస్టమ్స్ అధికారుల పేరుతో సదరు ఫాదర్‌కి ఫోన్ వచ్చింది. న్యూఢిల్లీ ఐజీఐ ఎయిర్‌పోర్టు నుంచి మాట్లాడుతున్నామనీ.. కస్టమ్స్ డ్యూటీ కింద రూ. 3.5 లక్షలు ఓ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాలని దాని సారాంశం. వాళ్లు చెప్పినట్టుగానే డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసినప్పటికీ  ఎంతకీ పార్సిల్ రాకపోవడంతో ఆయనకు అనుమానం వచ్చింది. బ్యాంకు వాళ్లను ఆరా తీస్తే తన డబ్బులు ఉత్తర ప్రదేశ్‌లోని అయోన్లా స్టేట్ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ అయినట్టు తెలిసిందే. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆయన ఢిల్లీలోని ఓ స్నేహితుడి సాయంతో యూపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అఖిల్ నబీ అనే మహిళతో పాటు, బాధితుడికి ఫోన్ కాల్ చేసిన ఓ మొబైల్ షాప్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Updated Date - 2020-09-24T23:15:15+05:30 IST