ఊరి బడి మాయం

ABN , First Publish Date - 2021-08-01T08:17:10+05:30 IST

‘మా ఊరి బడి’ అనేది ఒక భావోద్వేగం. ఊరికి దూరమై ఎక్కడెక్కడో బతుకుతున్నవారిని సైతం బడి జ్ఞాపకాలు దగ్గర చేస్తాయి. అలాంటి ఊరి బడిని మాయం చేసేలా సర్కారీ ప్రణాళికలు చకచకా సిద్ధమవుతున్నాయి

ఊరి బడి మాయం

ప్రాథమిక పాఠశాలలకు ‘అంచలంచెలు’గా ఎసరు

కాలేజీవిద్యలో వెనుకబడ్డామంటూ విద్య ‘ప్రాథమిక’ పునాదిపై దెబ్బ

సర్కారుకు మద్యంపైనే మక్కువ

వీధికి నాలుగు వైన్‌ షాపులు

కానీ, ఊరికి మాత్రం బడి వద్దా?

తొలిదశలో రోడ్డు ఆవల స్కూళ్లు

ఆపై ఒకటొకటిగా బడుల విలీనం

ఆందోళనలో టీచరు సంఘాలు

బడుల కోసం ఊరూరా ప్రచారం


దశలవారీ మద్యనిషేధం అమలు చేస్తున్నామంటూనే వీధికి నాలుగు వైన్‌ షాపులు! బార్‌షాపులు దానికి అదనం. కాలేజీ విద్యలో ఏపీ వెనకబడిందంటూనే...ఎక్కడికక్కడ పాఠశాలల సంఖ్య తగ్గించేసి, విద్య ‘ప్రాథమిక’ పునాదులనే పెకలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 


‘‘ముందు ఒక స్కూలే అంటారు. రోడ్డు అవతల ఉన్న స్కూలునే విలీనం చేస్తున్నామంటారు. ఒకటేగా.. హైస్కూలులో కలిసిపోయినా ఫర్లేదు అనుకొన్నా.. కొద్ది దూరమే కదా... నడుద్దాంలే అని భావించినా... తర్వాత్తర్వాత గ్రామంలో ఏ పాఠశాలా మిగలదు. అన్ని ప్రాథమిక పాఠశాలలను తీసుకెళ్లి హైస్కూల్‌లో కలిపేస్తారు. ఇక గ్రామంలో బడులే ఉండవు. ‘మా ఊరి బడి’ మాయమైపోతుంది’’

- ఉపాధ్యాయ సంఘాల ఆందోళన


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘మా ఊరి బడి’ అనేది ఒక భావోద్వేగం. ఊరికి దూరమై ఎక్కడెక్కడో బతుకుతున్నవారిని సైతం బడి జ్ఞాపకాలు దగ్గర చేస్తాయి. అలాంటి ఊరి బడిని మాయం చేసేలా సర్కారీ ప్రణాళికలు చకచకా సిద్ధమవుతున్నాయి. జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆరంచెల విధానం సిద్ధం చేసింది. ఐదో తరగతి వరకు ఊళ్లోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలు చదువుకొని, ఆరో తరగతికి పక్క ప్రాంతంలోని హైస్కూల్‌లో చేరతారు. తాజా విధానంలో మూడో తరగతి నుంచే పిల్లలు హైస్కూలుకు వెళ్లాలి. ఈ క్రమంలో 250 మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలనే హైస్కూలులో విలీనం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇబ్బంది లేనివిధంగానే విలీనం చేపడతామని కూడా అంటోంది. అయినా, తమ ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలలకు ఎసరు తప్పదనే భయాలను మాత్రం తల్లిదండ్రుల్లో తొలగించలేకపోతోంది. మొత్తంగానే దీనివెనక దీర్ఘకాలిక ప్రణాళిక ఉందనే అనుమానాలు విద్యావర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ‘తొలిదశలో ఇలాగే చేస్తారు. ఆ తర్వాత నుంచి దూరం పెంచుకుంటూ వెళతారు’ అని ఆందోళన చెందుతున్నాయి. జాతీయ విద్యా విధానంపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన తొలినాటి ప్రకటనలు గమనిస్తే..ఈ ఆందోళనల్లో వాస్తవం లేదని అనలేం! అప్పట్లో హైస్కూలుకు ఒక కిలోమీటరు దూరం కంటే లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్ని ఎత్తేసి...వాటిని హైస్కూలులో విలీనం చేస్తారని ప్రచారం జరిగింది. నూతన విద్యా విధానంలో ఇదే ఉందని కూడా సంకేతాలిచ్చింది. ఆ వెంటనే అన్నివర్గాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తింది. దీంతో ‘దూరం’ విషయంలో సర్కారు స్వరం మారింది. 250మీటర్ల దూరం లెక్కిస్తేనే జిల్లాకు 250 చొప్పున సుమారు 3వేల పాఠశాలల వరకు తేలాయి. ఇది కిలోమీటరుకు పెరిగితే 13వేల వరకు ప్రాథమిక పాఠశాలలు మాయమవుతాయి. ఇలా క్రమంగా ప్రాథమిక పాఠశాలకు చదువుకునే పిల్లలకు దూరం పెరిగిపోతుంది. వాస్తవానికి గ్రామస్థాయిలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్ని ఇప్పుడు నాడు-నేడులో భాగం చేశామని ప్రభుత్వమే చెప్తోంది. అలాంటి ప్రాథమిక పాఠశాలలను తీసేసి...వాటిలో ప్రీ ప్రైమరీ పాఠశాలలు పెట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. 


పునాదికే దెబ్బ..

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యం దుకాణాలను ఏటా 20శాతం తగ్గిస్తానని హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని ఒక సంవత్సరం మాత్రమే అమలుచేసింది. మద్యం దుకాణాలైతే ఎన్నైనా ఉండొచ్చుగానీ, పాఠశాలల సంఖ్య మాత్రం తగ్గాల్సిందేనన్నట్టు సర్కారు వైఖరి ఉంది. వాస్తవానికి ప్రతి ఆవాసంలోనూ పాఠశాల ఉండాలనే ఉద్దేశంతో ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు. దగ్గరలో పాఠశాల ఉంటే పిల్లలు చదువుపై మొగ్గుచూపుతారనేది ప్రణాళిక. అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రంలో ఇవన్నీ ఉండాల్సిందే. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇంకా మన అక్షరాస్యత శాతం తక్కువే. కళాశాలకు వెళ్లేవారి శాతం చాలా తక్కువుందని ఇటీవల ముఖ్యమంత్రి కూడా పేర్కొన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్య అభ్యసించినవారిలో కేవలం 27శాతమే కళాశాలలకు వెళ్తున్నారని.. రష్యాలో సుమారు 84.5శాతం ఉందన్నారు. పై స్థాయికి రావాలంటే కిందిస్థాయిలో  పాఠశాలలను అందరికీ అందుబాటులో ఉంచాలని ఉపాధ్యాయ సంఘాల వాదిస్తున్నాయి. పునాదికే పాఠశాలలు అందుబాటులో లేకుంటే... ఇక పె ౖస్థాయి గురించి ఎలా ఆలోచిస్తారని ప్రశ్నిస్తున్నాయి. 


రంగంలోకి ఉపాధ్యాయులు..

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆరంచెల విద్యావిధానాన్ని చాలా ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. సుమారు 38 ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకుంటే అందులో అత్యధిక సంఘాలు ఈ నూతన విధానాన్ని వద్దన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం సంఘాలన్నీ ఒప్పుకున్నాయంటూ ముందుకెళ్లడం ఏమిటని యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌, ఎస్టీయూ తదితర సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ప్రాథమిక పాఠశాలల విలీనానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు తల్లిదండ్రులను చైతన్యం చేసే దిశగా సదస్సులు నిర్వహిస్తున్నాయి. తల్లిదండ్రులు గట్టిగా నిలబడితేనే ‘ఊరి బడి’ తరలిపోదు అని ప్రచారం చేస్తున్నాయి. అయితే వీటికి పోటీగా ప్రభుత్వం ఎక్కడికక్కడ అవగాహన సదస్సులు ఏర్పాటుచేస్తూ విమర్శలను మూటగట్టుకొంటోంది. 

Updated Date - 2021-08-01T08:17:10+05:30 IST