గ్రామ బడులు విలీనం

ABN , First Publish Date - 2021-10-22T15:13:55+05:30 IST

ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ప్రాథమిక పాఠశాలల్లో ఇక 1, 2 తరగతులు మాత్రమే ఉంటాయి. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలిపేయనున్నారు. ప్రభుత్వ బడుల విలీనానికి గతంలోనే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తాజాగా కార్యాచరణ ప్రారంభించింది. ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను..

గ్రామ బడులు విలీనం

3, 4, 5 తరగతులు సమీప ఉన్నత పాఠశాలలకు..

250 మీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలు విలీనం

ఉపాధ్యాయులూ అక్కడికే.. ప్రభుత్వం ఉత్తర్వులు 

విలీన ప్రక్రియకు మ్యాపింగ్‌ చేయాలని ఆదేశం 

‘గిరిజన’ పాఠశాలల్లో టీచర్లకు బదులు వలంటీర్లు


అమరావతి(ఆంధ్రజ్యోతి): ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ప్రాథమిక పాఠశాలల్లో ఇక 1, 2 తరగతులు మాత్రమే ఉంటాయి. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలిపేయనున్నారు. ప్రభుత్వ బడుల విలీనానికి గతంలోనే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తాజాగా కార్యాచరణ ప్రారంభించింది. ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను వాటిలో కలిపేయనున్నారు. అదేవిధంగా ఆయా తరగతుల ఉపాధ్యాయులను కూడా సమీపంలోని ఉన్నత పాఠశాలల్లోకి తీసుకుంటారు. పాఠశాల విద్య డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ఈ మేరకు తాజాగా ఉత్తర్వులిచ్చారు.


ఏయే ప్రాథమిక పాఠశాలల్ని విలీనం చేయాలి, సమీపంలోని ఉన్నత పాఠశాలలు ఏవి ఉన్నాయనే మ్యాపింగ్‌ చేయాలన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల లభ్యత, వారు సరిపోతారా? సర్దుబాటు చేయాలా? అన్న దానిపైనా తగిన కసరత్తు చేసి ఆ మేరకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరోవైపు తొలి ఏడాది 250 మీటర్ల దూరంలోని పాఠశాలలను విలీనం చేస్తామన్న ప్రభుత్వం... భవిష్యత్తులో ఒక కిలోమీటరు లోపు దూరమున్న పాఠశాలల్ని కూడా విలీనం చేస్తుందని సమాచారం.


విజయనగరం జిల్లాలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేని చోట్ల వలంటీర్లతో పాఠాలు చెప్పించాలని ఆదేశాలిచ్చారు. ఆ జిల్లాలోని కురుపాం మండలంలో ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పలుచోట్ల ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఖాళీలున్నాయి. దీంతో ఆయా చోట్ల వారానికి రెండురోజులు వలంటీర్లే పాఠాలు చెప్పాలని ఆదేశాలిచ్చారు. 


8వ తరగతి నుంచి పాఠ్యాంశాల మార్పు.. అధికారులతో సమావేశంలో మంత్రి సురేశ్‌ 

వచ్చే ఏడాది నుంచి 8వ తరగతిలో సీబీఎస్ఈ సిలబస్‌ ప్రవేశపెట్టే అంశంపై మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఒక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉండే పాఠ్య పుస్తకాలు చదివితే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తామన్న నమ్మకం కలిగించేలా పాఠ్యపుస్తకాలు ఉండాలన్నారు. తొలుత 8వ తరగతి, ఆ తర్వాత ఏడాది 9వ తరగతి, ఆ తర్వాత 10వ తరగ తి పాఠ్యాంశాలను మార్చి సీబీఎస్ఈ సిలబస్‌కు తగ్గట్లుగా కొత్త పాఠ్యాంశాలు రూపొందిస్తామని తెలిపారు. 70 లక్షల మంది విద్యార్థుల తలరాతలు మీ చేతుల్లో ఉన్నాయంటూ సమావేశానికి హాజరైన పాఠ్యాంశాల రూపకర్తలను ఉద్దేశించి పేర్కొన్నారు. మరోవైపు అసోంకు చెందిన విద్యాశాఖ బృందం రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను పరిశీలించేందుకు వచ్చింది. మంత్రి సురేశ్‌తో వారు సమావేశమయ్యారు. కొన్నిరోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. 

Updated Date - 2021-10-22T15:13:55+05:30 IST