చర్చకు సై!

ABN , First Publish Date - 2021-07-19T07:45:17+05:30 IST

పార్లమెంటులో ఏ అంశంపైనైనా చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

చర్చకు సై!

  • అన్ని అంశాలపైనా అర్థవంతమైన చర్చలు జరుపుదాం
  • అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ 
  • నేటి నుంచే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
  • 29 బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కారు
  • పెట్రో ధరల పెంపు, రైతుల నిరసనపై నిలదీయనున్న ప్రతిపక్షాలు
  • ఎంపీలతో సంయుక్త సమావేశంలోప్రధాని కొవిడ్‌పై వివరిస్తారన్న కేంద్రం
  • తిరస్కరించిన ప్రతిపక్షాలు
  • కాంగ్రెస్‌ పార్లమెంటరీ బృందాల్లో అసమ్మతి నేతలకు స్థానం 
  • జీ-23 నేతలకు చోటిచ్చిన సోనియా


న్యూఢిల్లీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో ఏ అంశంపైనైనా చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. లోక్‌సభ, రాజ్యసభల్లో వివిధ అంశాలపై నిబంధనల మేరకు అర్థవంతమైన చర్చ జరిపేందుకు సిద్ధమని తెలిపారు. తాము చర్చలకు వ్యతిరేకం కాదని, ప్రతిపక్షాలూ సహకరించి ఆరోగ్యకరమైన చర్చలకు తావివ్వాలని ప్రధాని కోరారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభమవనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నేతృత్వంలో అఖిలపక్ష నేతల సమావేశం జరిగింది. ఇందులో కాంగ్రెస్‌ సహా 33 పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, పీయూష్‌ గోయల్‌ పాల్గొన్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. అన్ని అంశాలపైనా అర్థవంతమైన చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ వివిధ పార్టీల ఫ్లోర్‌ లీడర్లకు స్పష్టం చేశారన్నారు. చర్చలు ఉన్నతంగా జరిగేందుకు ప్రజాప్రతినిధులు ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీల సభ్యులు తమ విలువైన సలహాలు, సూచనలు అందజేయాలని కోరారు. ఆ సూచనలను సమష్టిగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.


సభలో చర్చలు, సమాధానాలకు సానుకూల వాతావరణాన్ని ఏర్పర్చాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ప్రజాప్రతినిధులకు తెలుసని, కాబట్టి వారు చర్చల్లో పాల్గొంటే నిర్ణయాలు కూడా సరిగా తీసుకోవచ్చని ఆయన తెలిపారు. ఎంపీల్లో చాలా మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయినందువల్ల పార్లమెంట్‌ కార్యకలాపాలు నిర్వహించవచ్చని ఆయన అన్నారు. ఈ వర్షాకాల సమావేశాల్లో 5 ఆర్డినెన్సులతో పాటు 29 బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. బిల్లులకే మొత్త సమయం కేటాయిస్తే సామాన్యుల సమస్యలపై ఎప్పుడు చర్చిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని అకాలీదళ్‌ నేత హర్‌ సిమ్రత్‌ బాదల్‌ డిమాండ్‌ చేశారు. ద్రవ్యోల్బణం, పెట్రో ధరలు, కొవిడ్‌ నిర్వహణపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందని పలువురు ప్రతిపక్షనేతలు డిమాండ్‌ చేశారు. 


నీట్‌లో ఓబీసీలకు రిజర్వేషన్‌ కల్పించాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్‌ నేతలుమల్లికార్జున ఖర్గే, అధీర్‌ రంజన్‌ చౌధురితో పాటు టీఎంసీ, బీజేడీ, శివసేన, జేడీయూ, వైసీపీ, టీడీపీ, ఎస్పీ, టీఆర్‌ఎస్‌, బీఎస్పీ తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు. మొత్తం మీద సోమవారం నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. కాగా, ప్రధాని మోదీ ఉభయసభల ఎంపీలతో  సమావేశమై కొవిడ్‌-19పై వివరాలు వెల్లడిస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటించగా.. ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కొవిడ్‌కు సంబంధించిన అంశాలపై పార్లమెంటులోనే చర్చించాలని, బయట అవసరం లేదని టీఎంసీ, సీపీఎం సభ్యులు స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచిన లోక్‌సభ సభ్యులు కూడా ప్రమాణం చేయనున్నారు. మరోవైపు మోదీ ఎన్డీయే ఫ్లోర్‌ లీడర్లతోనూ భేటీ అయ్యారు.  


పార్లమెంట్‌ వద్ద రోజూ రైతుల నిరసనలు 

కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 22 నుంచి పార్లమెంటు ఎదుట రోజూ 200 మంది రైతులతో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. 


ఎంపీలాడ్స్‌ నిధులు పునరుద్ధరించాలి

కాంగ్రెస్‌, టీఎంసీ సహా పలు పార్టీలు ఎంపీలాడ్స్‌ నిధులను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశాయి. కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధురి, టీఎంసీ నేత సుదీప్‌ బందోపాధ్యాయ, వైసీపీ నేత మిథున్‌రెడ్డి తదితరులు ఎంపీలాడ్స్‌ నిధులను పునరుద్ధరించాలని కోరారు. 


కాంగ్రెస్‌ పార్లమెంటరీ బృందాల్లో  జీ-23 నేతలు 

కాంగ్రెస్‌ అధినాయకత్వం తీరును తప్పుబడుతూ.. గత ఏడాది లేఖాస్త్రం సంధించిన జీ-23 నేతల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ పార్లమెంటరీ గ్రూపుల్లో పలువురు అసమ్మతి నేతలకు స్థానం కల్పించింది. సోమవారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అధినేత్రి, పార్టీ పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ.. ఉభయసభల్లో పార్టీ ప్యానల్‌ల పునర్నియామకం జరిపారు. ఇందులో భాగంగా.. ఏడుగురు సభ్యుల లోక్‌సభ బృందంలో అసమ్మతి నేతలైన మనీశ్‌ తివారీ, శశి థరూర్‌, దిగ్విజయ్‌సింగ్‌లకు స్థానం కల్పించారు. కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేతగా అధిర్‌ రంజన్‌ చౌదరి కొనసాగుతారు. మరో అసమ్మతి నేత అయిన ఆనంద్‌శర్మను రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష ఉపనేతగా నియమించారు. గతంలో రాజ్యసభలో పార్టీ నేతగా మల్లికార్జున్‌ ఖర్గేకు బాధ్యతలు అప్పగించారు. 

Updated Date - 2021-07-19T07:45:17+05:30 IST