దేశాన్ని నెంబర్‌వన్‌గా నిలిపిన ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2022-06-18T05:37:53+05:30 IST

సంక్షేమం, అభివృద్ధి, దేశరక్షణ, అంతర్గత భద్రత అంశాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని నెంబర్‌వన్‌గా నిలిపారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

దేశాన్ని నెంబర్‌వన్‌గా నిలిపిన ప్రధాని మోదీ
సమావేశంలో మాట్లాడుతున్న డీకే అరుణ

- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ 

గద్వాల, జూన్‌ 17 : సంక్షేమం, అభివృద్ధి, దేశరక్షణ, అంతర్గత భద్రత అంశాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని నెంబర్‌వన్‌గా నిలిపారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ‘నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల సుపాలన’పై గద్వాల పట్టణంలోని ఎస్‌వీ ఈవెంట్‌ హాల్‌లో శుక్రవారం నిర్వ హించిన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోదీ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూనే, వివిధ రంగాల్లో అభివృద్ధి చేశారని కొనియాడారు. దేశరక్షణ, అంతర్గత భద్రత విషయంలో రాజీ పడకుండా దేశాన్ని కాపాడుకోవడమే కాకుండా, వివిధ దేశాలలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పారన్నారు. కరోనా విపత్తు సమయంలో దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇచ్చి ప్రాణాలను కాపాడారన్నారు. కానీ కొందరు టీఆర్‌ఎస్‌ మూర్ఖులు దీనిని ఎద్దేవా చేశారని, వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద వారి ఫోటోలు పెట్టుకొని ఫోజులు కొట్టారని విమర్శించారు. గద్వాలలో ఏడాదికి ఐదువేల ఇళ్లు ఇస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కేసీఆర్‌, ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వకపోగా, పేదల ఇళ్ల పట్టా భూములు గుంజుకున్న మోసగాళ్లు టీఆర్‌ఎస్‌ నాయకులని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను, అవినీతి రహిత పాలనను ప్రజలలోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్‌ భాష, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శులు డీకే స్నిగ్ధారెడ్డి, రవి ఎక్బోటే, జలగరి అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-18T05:37:53+05:30 IST