కాంగ్రెస్‌ను తరిమికొట్టండి

ABN , First Publish Date - 2021-02-26T13:00:52+05:30 IST

దేశమంతటా కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, కుటుంబపాలనను ప్రోత్సహించే ఆ పార్టీని పుదుచ్చేరి రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ చరిత్రలోనే కాంగ్రెస్‌ పార్టీ వందకు తక్కువగా...

కాంగ్రెస్‌ను తరిమికొట్టండి

పుదుచ్చేరి సభలో ప్రధాని మోదీ పిలుపు

చెన్నై (ఆంధ్రజ్యోతి): దేశమంతటా కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, కుటుంబపాలనను ప్రోత్సహించే ఆ పార్టీని పుదుచ్చేరి రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ చరిత్రలోనే కాంగ్రెస్‌ పార్టీ వందకు తక్కువగా ఎంపీలను కలిగివున్న పార్టీగా దిగజారి పోయిందని, కాంగ్రెస్‌ సంస్కృతి ఏమిటో పుదుచ్చేరి ప్రజలు ఐదేళ్లుగా పరిశీలించారని, జాతీయ స్థాయిలో ఆ పార్టీ ఎలా ప్రవర్తిస్తుందో తాము గమనిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పుదుచ్చేరిలో గురువారం మధ్యాహ్నం లాస్‌పేట హెలిపాడ్‌ మైదానంలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ఉద్వేగంగా ప్రసంగిస్తూ పుదుచ్చేరి రాష్ట్ర ప్రజల్లో ప్రస్తుతం ఆనందం తాండవిస్తోందని, అందుకు కారణాలు ఆ రాష్ట్రానికి సంబంధించి తాను కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించడం, ఐదేళ్ల అసమర్థ అవినీతి కాంగ్రెస్‌ పాలనను నుంచి విముక్తి పొందడమేనని చెప్పారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాలను నాశనం చేసిందని, నూలుమిల్లులను మూసివేసిందని, స్థానిక పరిశ్రమలన్నీ దుస్థితికి చేరుకున్నాయని, ప్రజలకు సేవ చేయాలన్న తలంపు కాంగ్రెస్‌కు లేదని అన్నారు. కొద్ది రోజులకు ముందు రాహుల్‌గాంధీ పాల్గొన్న కార్యక్రమానికి సంబం ధించి ఓ వీడియోను చూశానని, అందు లో వరదల వల్ల తాను నష్టపోయానని ఓ మహిళ మొరపెట్టుకుంటే అప్పటి ముఖ్యమంత్రి నారా యణస్వామి ఆమె చెప్పిన మాటలను తప్పుగా అనువాదం చేసి పార్టీ నేతనే మోసగించారని ఆరోపించారు. 


‘బెస్ట్‌’ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో తానొక ఎన్నికల వాగ్దానం చేస్తున్నానని, బీజేపీ కూటమిని గెలిపిస్తే పుదుచ్చేరిని దేశంలోనే ‘బెస్ట్‌’ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని ప్రధాని మోదీ చెప్పారు. బెస్ట్‌ అనే ఆంగ్ల పదంలో ఉన్న ఆంగ్ల అక్షరాలకు  బి అంటే బిజినెస్‌, ఇ అంటే ఎడ్యుకేషన్‌, ఎస్‌ అంటే స్పిరిచువల్‌, టీ అంటే టూరిజం అని అర్థాలు చెబుతూ పుదుచ్చేరి రాష్ట్రాన్ని వాణిజ్యపరంగా, విద్యాపరంగా, ఆధ్మాతికపరంగా, పర్యాటకపరంగా అభివృద్ధికలిగిన రాష్ట్రంగా మార్చుతానని హామీ ఇచ్చారు. పుదుచ్చేరి యువకులు ప్రతిభావంతులని, వారికి సరైన ఉపాధి అవకాశాలు కల్పించేలా ఐటీ, వైద్య, జవుళి రంగాలను మెరుగుపరుస్తామని చెప్పారు. పుదుచ్చేరిలో రెండు రంగాలపై ప్రత్యేక దృష్టిని సారించాల్సి వుందని, సముద్ర సంబంధిత శాఖలను, సహకారం సంఘాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాగరమాల పథకం ప్రకారం తీర ప్రాంతాల అభివృద్ధి, జాలర్ల సంక్షేమానికి పలు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మత్స్యశాఖకు రూ.46 వేల కోట్ల మేరకు నిధులు కేటాయించామని, ఇది 2014లో కేటాయించిన నిధుల కంటే 50 శాతం అధికమని మోదీ చెప్పారు. 


వీరభూమి ఇది

పుదుచ్చేరి వీరభూమి అని, విభిన్న సంస్కృతుల సమైక్యతను చాటిచెప్పే పవిత్రభూమి అని, ఈ పుణ్యభూమిలో ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు సంచరించారని, వారిలో భారతియార్‌, అరవిందర్‌ ముఖ్యులని ప్రధాని మోదీ అన్నారు. పుదుచ్చేరి జిప్మర్‌ ఆస్పత్రిలోని అబ్దుల్‌ కలామ్‌ ఆడిటోరియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన సభలో రూ.2426కోట్ల వ్యయంతో కారైక్కాల్‌ మీదుగా విల్లుపురం సదానందపురం నుంచి నాగపట్టినం దాకా నిర్మించనున్న నాలుగు రహదారులతో కూడిన జాతీయ రహదారికి ఆయన శంకుస్థాపన చేశారు. జిప్మర్‌ ఆస్పత్రి ప్రాంగణంలో రూ.491 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వైద్యకళాశాల కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు. సాగరమాల పథకం కింద రూ. 44 కోట్ల వ్యయంతో పుదుచ్చేరి ఓడరేవు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో రూ.7 కోట్ల వ్యయంతో 400 మీటర్ల రన్నింగ్‌ ట్రాక్‌ పథకాన్ని, లాస్‌పేటలో భారత క్రీడా సంస్థ ఆధ్వర్యంలో 100 పడకలు కలిగిన లేడీస్‌ హాస్టల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో మోదీ ప్రసంగిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెబుతున్న పుదుచ్చేరి రాష్ట్రాన్ని మరిన్ని మౌళిక సదుపాయాలతో అభివృద్ధిపరచాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాను ప్రారంభించిన సదానందపురం నాగపట్టిన రహదారిలో పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. 

Updated Date - 2021-02-26T13:00:52+05:30 IST