ఒమైక్రాన్‌తో జాగ్రత్త

ABN , First Publish Date - 2021-11-28T08:18:22+05:30 IST

కొత్త కరోనా వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ పలు దేశాలను వణికిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో కొవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై శనివారం ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో

ఒమైక్రాన్‌తో జాగ్రత్త

అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలపై సమీక్షించండి

ప్రయాణికులకు పటిష్ఠ స్ర్కీనింగ్‌ 

శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపండి

ఉన్నతాధికారులతో భేటీలో ప్రధాని మోదీ ఆదేశం

ఆ దేశాల విమానాలను నిషేధించండి: కేజ్రీవాల్‌


కొత్త కరోనా వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ పలు దేశాలను వణికిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో కొవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై శనివారం ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ప్రమాదకర వేరియంట్‌ ఒమైక్రాన్‌.. అత్యంత వేగంగా వ్యాపించే రకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలపై సమీక్షించాలని మోదీ అధికారులను ఆదేశించారు. ఒమైక్రాన్‌ ప్రభావంపైనా ఆయన చర్చించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఓ ప్రకటనలో తెలిపింది. ప్రమాదకర వేరియంట్‌ పుట్టుకొచ్చిన నేపథ్యంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. ముప్పు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చేవారిపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టాలన్నారు. వచ్చే నెల 15 నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని ఈ మేరకు అధికారులను హెచ్చరించారు. బ్రిటన్‌, జర్మనీ, సింగపూర్‌, ఇజ్రాయెల్‌, ఫ్రాన్స్‌, ఇటలీ తదితర దేశాలు దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకపోకలను నిషేధించిన వేళ.. కేంద్ర పౌర విమానయాన శాఖ భారత్‌ నుంచి వివిధ దేశాలకు విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించడం గమనార్హం.


‘‘కొత్త వేరియంట్‌ వెలుగుచూసిన నేపథ్యంలో దేశంలో కొవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై సమీక్షించాం. రెండో డోసు టీకాను వేగిరం చేయడంపై మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి’’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులకు పటిష్ఠ స్ర్కీనింగ్‌ చేయాలని, వారి శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలని తెలిపారు. టీకా తొలి డోసు తీసుకున్నవారంతా నిర్దేశిత గడవులోగా రెండో డోసు తీసుకునేలా చూడాలని రాష్ట్రాలకు సూచించారు. కాగా, ఓమైక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో.. విమానాల పునరుద్ధరణపై ఓ సర్వేలో పాల్గొన్న 66 శాతం మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు.


ఆ విమానాలను ఆపండి: కేజ్రీవాల్‌ 

కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ట్విటర్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కొత్త వేరియంట్‌ బాధిత దేశాల నుంచి వచ్చే విమానాలను నిషేధించాలని ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నా. అది భారత్‌లోకి ప్రవేశించకుండా మనం అడ్డుకోవాలి’’ అని ట్వీట్‌ చేశారు. మరోవైపు.. కొత్త వేరియంట్‌తో పెనుముప్పేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. దేశ ప్రజలకు మరింత భద్రతనిచ్చేందుకు కేంద్రం పనిచేయాలని ట్విటర్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2021-11-28T08:18:22+05:30 IST